ముంబై: ప్రభుత్వరంగ బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) టెక్నాలజీకి ఎంతో ప్రాధాన్యమిస్తోంది. టెక్ సిబ్బందిని ప్రస్తుతమున్న 1,500 మంది నుంచి రెండేళ్లలో రెట్టింపునకు (3,000 మంది) పెంచుకోనున్నట్టు బ్యాంక్ ఎండీ, సీఈవో దేవదత్త చాంద్ తెలిపారు.
రెగ్యులర్ నియామకాలతో పాటు, ఇతర సంస్థల్లో ఇదే తరహా బాధ్యతల్లో ఉన్న ప్రత్యేక నిపుణులను నియమించుకోనున్నట్టు (లేటరల్ హైరింగ్) మార్చి త్రైమాసికం ఫలితాల సందర్భంగా ప్రకటించారు. టెక్నాలజీ పరంగా కొన్ని లోపాలు వెల్లడి కావడంతో ఇటీవల బీవోబీపై ఆర్‌బీఐ ఆంక్షలు ప్రకటించడం గుర్తుండే ఉంటుంది. తర్వాత వీటిని ఎత్తివేసింది.
1,500 మంది ప్రస్తుత టెక్నాలజీ బృందంలో రెగ్యులర్ ఉద్యోగులతోపాటు, కాంట్రాక్టు ఉద్యోగులు కూడా ఉన్నట్టు చాంద్ చెప్పారు. జెనరేటివ్ ఏఐ ఆధారిత ప్లాట్‌ఫామ్ త్వరలోనే కస్టమర్లకు అందుబాటులోకి వస్తుందని తెలిపారు. టెక్నాలజీపై బ్యాంక్ పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తున్నట్టు చెప్పారు. టెక్నాలజీ మౌలిక సదుపాయాల కోసమే రూ.2,000 కోట్లు వెచ్చిస్తున్నట్టు తెలిపారు.
రానున్న కాలంలోనూ దీనిపై ఎక్కువ మొత్తంలో పెట్టుబడులు పెడతామన్నారు. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2024–25) 600 కొత్త శాఖలను ప్రారంభిస్తామని చెప్పారు. 12–14 శాతం మేర రుణాల్లో వృద్ధిని లక్ష్యంగా పెట్టుకున్నామని, అదే సమయంలో డిపాజిట్లలో 10–12 శాతం వృద్ధిని కాంక్షిస్తున్నట్టు తెలిపారు. నికర వడ్డీ మార్జిన్ (నిమ్) 3.15 శాతంగా ఉంటుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment