ఐపీవోల్లో ఇన్వెస్ట్ చేయడం మంచిదేనా?
ఫైనాన్షియల్ బేసిక్స్...
ఐపీవో.. ఈ పదాన్ని మనం తరుచుగా వింటూనే ఉంటాం. పలు కంపెనీలు ఐపీవోకు వస్తున్నట్లు ప్రకటిస్తూనే ఉంటాయి. ఒక కంపెనీ తొలిసారి తన షేర్లను ప్రజలకు విక్రయించడాన్ని ‘ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్’ (ఐపీవో)గా చెప్పుకుంటాం. నిధుల సమీకరణ కోసం ఒక కంపెనీ ఐపీవోకు వస్తుంది. ఇక్కడ ఏ సంస్థ/కంపెనీ అయినా ఐపీవోకు రావాలంటే.. తప్పనిసరిగా మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ ఆమోదం తీసుకోవాల్సి ఉంటుంది. మార్కెట్లు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాయో తెలియదు.
ఇతర ఇన్వెస్ట్‌మెంట్ సాధనాల మాదిరిగానే ఐపీవో ఇన్వెస్ట్‌మెంట్లలో కూడా రిస్క్ ఉంటుంది. అందుకే ఐపీవో మార్గంలో షేర్లను కొనుగోలు చేసేటప్పుడు తగిన జాగ్రత్తలను పాటించాలి.
ఇదివరకే ఐపీవోకు వ చ్చిన/ తెలిసిన కంపెనీ షేర్లను కొనుగోలు చేయడం సులభమే. ఎందుకంటే ఆయా కంపెనీల చరిత్ర, పనితీరు వంటి తదితర అంశాలు మనకు అందుబాటులో ఉంటాయి. వాటిని విశ్లేషించుకొని పలు అంశాలను బేరీజు వేసుకొని ఆయా కంపెనీల స్టాక్స్ కొనాలా? వద్దా? అని ఒక నిర్ణయానికి రావొచ్చు. కానీ ఇక్కడ తొలిసారి ఐపీవోకు వచ్చే కంపెనీ గురించి మనకు అంతగా ఏమీ తెలియదు. అప్పుడు మనం ఆ కంపెనీ మేనేజ్‌మెంట్, ఐపీవో పత్రాలు వంటి తదితర అంశాలను క్షుణ్ణంగా తెలుసుకోవాలి. కంపెనీ ఐపీవో మార్గంలో సమీకరించే నిధులను దేని కోసం వెచ్చిస్తుందనే విషయాలపై దృష్టిలో ఉంచుకోవాలి.