ఫైనాన్షియల్ బేసిక్స్..
వర్చువల్ క్రెడిట్ కార్డుతో ఉపయోగం ఎంత?
టెక్నాలజీ వల్ల ప్రజల జీవనం సులభతరం అయ్యింది. ముఖ్యంగా ఆర్థిక లావాదేవీలు సరళతరమయ్యాయి. ఇదే సమయంలో సైబర్ మోసాలు కూడా పెరిగిపోయాయి. ఆన్‌లైన్ షాపింగ్ సమయంలో మోసాలను ఎదుర్కోవడానికి వర్చువల్ క్రెడిట్ కార్డులు బాగా దోహదపడతాయి.
ఆన్‌లైన్ పేమెంట్
వర్చువల్ క్రెడిట్ కార్డు అనేది ఒక ప్రత్యేకమైన ఆన్‌లైన్ పేమెంట్ సొల్యూషన్. వీటిని ఉపయోగించడం వల్ల ఇంటర్నెట్‌లో షాపింగ్ చేసేటప్పుడు భద్రత గురించి భయపడాల్సిన పనిలేదు. లావాదేవీలు పూర్తి సురక్షితం. కార్డు కంపెనీలు ప్రైమరీ క్రెడిట్ కార్డుకు యాడ్ ఆన్ కార్డును జారీ చేస్తాయి. వర్చువల్ కార్డు కూడా ఒకరకంగా అలాంటిదే. వర్చువల్ క్రెడిట్ కార్డును కేవలం ఒకసారి మాత్రమే ఉపయోగించగలం. ఇది కొంత మొత్తంతో ప్రిలోడెడ్‌గా వస్తుంది. వర్చువల్ కార్డుకు నిర్దిష్ట కాలమంటూ ఉంటుంది. తర్వాత ఎక్స్‌పైర్ అవుతుంది. దీన్ని క్రెడిట్, డెబిట్ కార్డుల మాదిరి చేతితో పట్టుకోలేం. అంటే ఫిజికల్ రూపంలో ఉండదు. కేవలం ఆన్‌లైన్‌లో మాత్రమే ఉపయోగించడానికి వీలుగా వీటిని జారీచేస్తారు.
సైబర్ మోసాలపై భయంలేదు..
కార్డు కంపెనీలు ప్రధాన క్రెడిట్ కార్డు ఆధారంగా వర్చువల్ కార్డును జారీ చేస్తాయి. దీనికి కార్డు నెంబర్, సీవీవీ, ఎక్స్‌పైరీ నెంబర్ వంటివి ఉంటాయి. వీటి ఆధారంగా ఆన్‌లైన్‌లో లావాదేవీ నిర్వహిస్తాం. లావాదేవీ నిర్వహించేటప్పుడు మన ప్రైమరీ కార్డు వివరాలను ఉపయోగించం కాబట్టి ఎలాంటి సమస్య ఉండదు. సైబర్ మోసాల గురించి భయపడాల్సిన పనిలేదు. అంతర్జాతీయ ట్రాన్సాక్షన్లకు వర్చువల్ కార్డుల వినియోగం ఉత్తమమైన మార్గం.
ఆఫర్ చేస్తున్న బ్యాంక్‌లు ఇవీ...
ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఎస్‌బీఐ, యాక్సిస్ బ్యాంక్, కొటక్ మహీంద్రా బ్యాంక్ వంటి పలు సంస్థలు వర్చువల్ కార్డులను ఆఫర్ చేస్తున్నాయి. డెబిట్ కార్డుకు వర్చువల్ కార్డును తీసుకోవచ్చు. వర్చువల్ కార్డు మొత్తాన్ని పూర్తిగా ఉపయోగించుకోకపోతే.. మిగిలిన అమౌంట్ ప్రైమరీ కార్డుకు వచ్చి చేరుతుంది. ఒకవేళ లావాదేవీ ఫెయిల్ అయితే అప్పుడు పూర్తి మొత్తం మళ్లీ రిఫండ్ వస్తుంది.