అప్పుల ఊబిలో పడకుండా ఉండాలంటే? | Financial Basics | Sakshi
Sakshi News home page

అప్పుల ఊబిలో పడకుండా ఉండాలంటే?

Published Sun, Jul 2 2017 11:48 PM | Last Updated on Tue, Sep 5 2017 3:02 PM

Financial Basics

‘అప్పు చేసి పప్పుకూడు’ అనే సామెత గుర్తుందా? చేతిలో డబ్బులు లేనప్పుడు అనుకున్న దాన్ని సాధించడం కోసం కొందరు అప్పే శరణ్యమని అనుకుంటారు. ఇక్కడ గుర్తుంచుకోవాల్సి న విషయం ఒకటుంది. మిగతా ఇబ్బందులతో పోలిస్తే ఆర్థిక పరమైన సమస్యలు మనల్ని ఎక్కువగా బాధిస్తుంటాయి. అందుకే అప్పుల ఊబిలో పడకుండా ఉండటానికే ఎక్కువ ప్రయత్నించాలి. రుణం తీసుకోవడం వలన సంభవించే ప్రతికూలతలను, అనుకూలతలను ముందుగానే బేరీజు వేసుకోవాలి. చాలా మంది ఇలా చేయరు. అప్పటికప్పుడు సమస్య తీరిందా? లేదా? అని మాత్రమే చూస్తారు. ఇలా చేయడం సరికాదు. మన కలల్ని సాకారం చేసుకోవడానికి రుణం సులువైన మార్గమని ఎప్పుడూ భావించకూడదు. ఇంట్లో మూడు పూటల తినడానికి లేకపోయినా పర్లేదు కానీ ఎవరికీ అప్పు ఉండకూడదు అని అనుకోవాలి.

అప్పు తీసుకునే ముందు పలు అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. ఉదాహరణకు మీరు ఇల్లు కొనుగోలుకు రుణం తీసుకుంటే అక్కడ ఆస్తి మిగులుతుంది. అంటే సంపద సృష్టి జరుగుతోంది. అదే టూర్‌కు వెళ్లడానికి అప్పు తీసుకుంటే దాని వల్ల ఏ ఉపయోగం లేదు. ఇలాంటప్పుడు అప్పు తీసుకోవడం కన్నా ఖాళీగా ఉండటం మంచిది. ఇక్కడ రుణం దేని కోసం తీసుకుంటున్నామనేది చాలా ముఖ్యం. చేతిలో డబ్బులు ఉన్నాయి కదా అని దేనికి పడితే దానికి ఖర్చు పెట్టడం అవివేకం అనిపించుకుంటుంది. అలాగే మన ఆదాయ, వ్యయాల మధ్య నిష్పత్తిపై ఎప్పుడూ ఒక కన్నేసి ఉంచాలి. ఆదాయంలో సగభాగానికి మించి ఎక్కువ మొత్తాన్ని రుణ చెల్లింపులకు ఉపయోగించడం సరైన పద్ధతి కాదు. అంటే ఎక్కువ స్థాయిలో రుణాలు తీసుకోవద్దు.

ఎస్‌బీఐ రివార్డ్స్‌
మీరు స్టేట్‌ బ్యాంక్‌ గ్రూప్‌ కస్టమరా? అయితే దీన్ని మీరు తెలుసుకోవాల్సిందే. ‘ఎస్‌బీఐ రివార్డ్స్‌’ యాప్‌లో మనం నిర్వహించిన బ్యాంకింగ్‌ లావాదేవీలపై రివార్డు పాయింట్లను పొందొ చ్చు. అలాగే వీటిని రిడీమ్‌ కూడా చేసుకోవచ్చు. ఈ యాప్‌ను గూగుల్‌ ప్లేస్టోర్‌ నుంచి ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

ప్రత్యేకతలు
డెబిట్‌ కార్డు, ఇంటర్నెట్‌ బ్యాంకింగ్, మొబైల్‌ బ్యాంకింగ్,  డీమ్యాట్‌ ఖాతా తదితర వాటి ద్వారా జరిపిన బ్యాంకింగ్‌ లావాదేవీలపై రివార్డ్‌ పాయింట్లు పొందొచ్చు.

బ్యాంక్‌ పార్ట్‌నర్‌ బ్రాండ్‌ ఔట్‌లెట్స్‌లో జరిపిన లావాదేవీలపై మరిన్ని ఎక్కువ పాయింట్లను సొంతం చేసుకోవచ్చు.

రివార్డ్‌ పాయింట్లతో డీటీహెచ్, మొబైల్‌ రీచార్జ్‌ చేసుకోవచ్చు. సినిమా టికెట్లను బుకింగ్‌ చేసుకోవచ్చు. గిఫ్ట్‌ కార్డులను కొనొచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement