ఆన్ లైన్ కస్టమర్లకు ఫ్లిప్ కార్ట్ శుభవార్త
ఆన్ లైన్ లో ఎక్కువ మొత్తంలో వస్తువులు కొనడం మీకు అలవాటా? అయితే మీలాంటి వారికోసమే ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ ఓ శుభవార్త అందిస్తోంది. సమాన నెలసరి వాయిదా పద్ధతి(ఈఎంఐ)లో వస్తువులను కొనుగోలు చేసేవారికి అదనంగా చెల్లింపులు పడకుండా ఓ కొత్త ఆప్షన్ ను తీసుకొచ్చింది. "నో కాస్ట్ ఈఎంఐ' అనే పేరుతో ఫ్లిప్ కార్ట్ వినియోగదారులకు ఒక బంపర్ ఆఫర్ ప్రవేశపెట్టింది. భారీ కొనుగోళ్లు జరిపే వారికి ఆన్ లైన్ షాపింగ్ ను సులభతరం చేయడానికి ఈ ఆప్షన్ ను ప్రవేశపెట్టినట్టు ఫ్లిప్ కార్ట్ తెలిపింది. ఈ కొత్త ఆప్షన్ ప్రకారం డౌన్ పేమెంట్, ప్రాసెసింగ్ ఫీజు, వడ్డీరేట్లులాంటి చెల్లింపులు ఇక ముందు వుండవని ప్రకటించింది.
జీరో ప్రాసెసింగ్ ఫీజు, జీరో డౌన్ పేమెంట్, కస్టమర్లకు జీరో ఇంటరెస్ట్ వంటివి 'నో కాస్ట్ ఈఎంఐ' కింద వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చినట్టు పేర్కొంది. ఆన్ లైన్ షాపింగ్ ప్రియులకు ఇది శుభవార్త అనీ, వారికి షాపింగ్ ను సులభతరం చేయడంలో ఇదే తొలి అడుగు అని ఫ్లిప్ కార్ట్ డిజిటల్ అండ్ కస్టమర్ ఫైనాన్సియల్ సర్వీసుల అధినేత మయాంక్ జైన్ తెలిపారు. వినియోగదారులు కోరుకున్న ఉత్పత్తులను ఎలాంటి అవరోధాలు లేకుండా కొనుగోలు చేయడమే లక్ష్యంగా 'నో కాస్ట్ ఈఎంఏ' ఆప్షన్ ను ప్రవేశపెట్టినట్టు ఫ్లిప్ కార్ట్ వెల్లడించింది.