వృద్ధిపై దృష్టి పెట్టాలి: ఆర్థికవేత్తల సూచన
న్యూఢిల్లీ: వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రభుత్వం ద్రవ్య లోటు కట్టడి చర్యల నుంచి వృద్ధికి ఊతమిచ్చే చర్యల వైపు దృష్టి మళ్లించవచ్చని ఆర్థికవేత్తలు అభిప్రాయపడ్డారు. బడ్జెట్ ముందస్తు సమావేశాల్లో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో భేటీ అయిన ఎకానమిస్టులు తమ అభిప్రాయాలు తెలియజేశారు. ప్రస్తుత పన్నులు, సబ్సిడీల విధానాలు..
వృద్ధికి తోడ్పడే విధంగా వాటిల్లో చేపట్టాల్సిన మార్పులు, చేర్పుల గురించి సమావేశంలో చర్చించారు. వ్యవసాయ రంగం సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్న దరిమిలా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పించడంపై దృష్టి సారించాల్సి ఉంటుందని ఇందిరా గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డెవలప్‌మెంట్ రీసెర్చ్ సంస్థ డెరైక్టర్ ఎస్ మహేంద్ర దేవ్ పేర్కొన్నారు. అలాగే ఆరోగ్యపరమైన రిస్కులు పెరుగుతున్నందున వైద్యం తదితర సామాజిక సంక్షేమ పథకాలపై వ్యయాలు మరింతగా పెరగాలని తెలిపారు.