పసిడిపై ‘ఫ్రాన్స్’ ఫలితాల ప్రభావం
అంతర్జాతీయ మార్కెట్‌లో తగ్గిన ధర
న్యూయార్క్/ముంబై: బంగారం ధరలపై ఫ్రాన్స్ ఎన్నికల ఫలితాల సరళి ప్రభావం పడింది. అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్– నైమెక్స్‌లో పసిడి ధర ఔన్స్ (31.1గ్రా) కడపటి సమాచారం అందేసరికి 13 డాలర్లు తగ్గి 1,275 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. స్పష్టంకాని అమెరికా అధ్యక్షుడి ఆర్థిక విధానాలు, భౌగోళిక ఉద్రిక్తతలు, దీనితో డాలర్ బలహీనత వంటి అంశాల నేపథ్యంలో– తమ పెట్టుబడులకు సురక్షితమైనదిగా ‘పసిడి’వైపు పెట్టుబడులు మళ్లాయి. యూరో నుంచి ఫ్రాన్స్ వైదొలగాలని కోరుతున్న లీ పెన్ గెలుపు అంచనాల భయాలూ దీనికి తోడయ్యాయి.
దీనితో పసిడి భారీగా పెరగడం ప్రారంభించింది. అయితే ఫ్రాన్స్ ఫలితాల సరళి ఇందుకు భిన్నంగా, మార్కెట్ అనుకూల మాక్రాన్‌కు సానుకూలంగా ఉండడంతో పసిడి నుంచి పెట్టుబడులు వెనక్కుమళ్లడం ప్రారంభిం చాయి. లాభాల స్వీకరణ దీనికో ప్రధాన కారణం. ఒకదశలో 1,266 డాలర్లకు తగ్గింది. తుది సమాచారం అందేసరికి క్రితంకన్నా 13 డాలర్ల తక్కువగా ట్రేడవుతోంది.
మాక్రాన్ గెలుపుతో పసిడి ధర ప్రస్తుతానికి కొంత వెనక్కుతగ్గే వీలుందని విశ్లేషకుల అంచనా. అయితే డాలర్ బలహీనత నేపథ్యంలో స్వల్పకాలంలో పసిడిది బులిష్ ధోరణేనన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. కాగా దేశ ఫ్యూచర్స్ మార్కెట్– మల్టీ కమోడిటీ ఎక్సే్ఛంజ్‌లో కూడా కడపటి సమాచారం అందే సరికి పసిడి 10 గ్రాముల ధర రూ. 270 తగ్గి రూ29,148 వద్ద ట్రేడవుతోంది. మరోవైపు దేశ ప్రధాన స్పాట్ మార్కెట్ ముంబైలో సోమవారం 99.9 స్వచ్ఛత 10 గ్రాముల ధర రూ.235 తగ్గి రూ. 29,260కి చేరింది. వెండి కేజీ ధర కూడా రూ. 480 పడి, రూ.41,545కు చేరింది.