భారత్‌లో విక్రయాలకు జీఎం గుడ్‌బై! | General Motors to stop selling cars in India but not pulling out | Sakshi
Sakshi News home page

భారత్‌లో విక్రయాలకు జీఎం గుడ్‌బై!

Published Fri, May 19 2017 12:11 AM | Last Updated on Tue, Sep 5 2017 11:27 AM

భారత్‌లో విక్రయాలకు జీఎం గుడ్‌బై!

భారత్‌లో విక్రయాలకు జీఎం గుడ్‌బై!

న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన ప్రముఖ ఆటోమొబైల్‌ కంపెనీ జనరల్‌ మోటార్స్‌ భారత మార్కెట్లో ‘షవర్లే’ కార్ల విక్రయాలకు స్వస్తి చెప్పనుంది. రెండు దశాబ్దాలుగా దేశీయ ప్రయాణికుల కార్ల మార్కెట్లో తన అదృష్టాన్ని పరీక్షించుకున్న ఈ సంస్థ వాటా ఒక్క శాతంలోపే ఉండిపోవడంతో, చివరికి విక్రయాలను నిలిపివేయాలని నిర్ణయించింది. దేశీయ కార్ల మార్కెట్‌ను దాదాపుగా జపాన్‌ కంపెనీలే గణనీయమైన వాటాతో శాసిస్తున్న నేపథ్యంలో జీఎం నిర్ణయానికి ప్రాధాన్యం ఏర్పడింది.

 సమగ్ర సమీక్ష అనంతరం, ప్రపంచ వ్యాప్తంగా తమ కార్యకలాపాల పునర్నిర్మాణ చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నామని జీఎం ప్రకటించింది. అలాగే, రష్యా, యూరోప్‌ సహా నాలుగు ఇతర మార్కెట్ల నుంచి కూడా వైదొలిగింది. ఇకపై ‘జీఎం మోటార్స్‌ ఇండియా’ భారత్‌ నుంచి ఎగుమతులకే పరిమితం కానుంది. కంపెనీకి మహారాష్ట్రలోని తాలెగాన్, గుజరాత్‌లోని హాలోల్‌లో తయారీ ప్లాంట్లు ఉన్నాయి. హాలోల్‌ ప్లాంట్‌లో ఉత్పత్తిని గత నెలలోనే జీఎం నిలిపివేసింది. ఈ ప్లాంట్‌ను తన చైనా భాగస్వామి ఎస్‌ఏఐసీ మోటార్‌కు విక్రయించేందుకు చర్చలు జరుపుతోంది. తాలేగాన్‌ ప్లాంట్‌ను మాత్రం ఎగుమతుల కోసం వినియోగించుకుంటుంది. జీఎం కార్ల విక్రయాలు గత ఆర్థిక సంవత్సరంలో 21% క్షీణించి 25,823కు పరిమితం కాగా, అదే సమయంలో కంపెనీ ఉత్పత్తి చేసిన కార్ల సంఖ్య 83,368. వీటిలో ఎక్కువ భాగాన్ని కంపెనీ ఎగుమతి చేసింది.

రేసులో గెలవలేక...
భారత్‌లో తమ కార్యకలాపాలను విస్తృతం చేసేందుకుగాను బిలియన్‌ డాలర్ల పెట్టుబడులను పెట్టనున్నట్టు జీఎం 2015లో ప్రకటించింది. భారత మార్కెట్లో స్థానికంగానే తయారు చేసిన 10 మోడళ్లను ప్రవేశపెట్టనున్నట్టు కూడా తెలిపింది. అయితే, ఇక్కడి మార్కెట్లో కంపెనీ అమ్మకాలు పుంజుకోకపోవడంతో తన ప్రణాళికలను పక్కన పెట్టేసింది. ‘‘ఈ నిర్ణయానికి రావడం కష్టంగానే అనిపించినా, మా ప్రపంచవ్యాప్త విధానానికి మద్దతుగా నిలిచేందుకు, మా వాటాదారులకు తగినంత లాభాలను అందించేందుకు ఇది సరైన నిర్ణయమే అవుతుంది’’అని జీఎం మోటార్స్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ స్టీఫన్‌జాకొబి పేర్కొన్నారు. ఎన్నో అవకాశాలను పరిశీలించిన అనంతరం భారత్‌లో పెట్టుబడులు పెంచుకోవడం వల్ల ఆశించిన మేర రాబడులు రావని గుర్తించినట్టు చెప్పారు.

 కాగా, ఈ నిర్ణయాన్ని జీఎం భారత్‌లోని తన ఉద్యోగులకు కూడా తెలియజేసింది. అయితే, ఎంత మందిపై ఇది ప్రభావం చూపేది కంపెనీ స్పష్టం చేయలేదు. కనీసం 200 మంది ఉద్యోగులు ఉపాధి కోల్పోవచ్చని విశ్వసనీయ సమాచారం. ఇకపై ఎగుమతులే తమకు ముఖ్యమని జీఎం ఇండియా ప్రెసిడెంట్, ఎండీ కహెర్‌ కాజెమ్‌ తెలిపారు. ఇటీవల విడుదల చేసిన షవర్లే బీట్‌ హచ్‌బ్యాక్‌ను మెక్సికో, సెంట్రల్, దక్షిణా్రíఫికా మార్కెట్లకు ఎగుమతి చేస్తున్నామని... ఈ మార్కెట్ల కోసం షవర్లే బీట్‌ సెడాన్‌ను ఈ ఏడాది చివరి నాటికి అందుబాటులోకి తెస్తామన్నారు.

Advertisement
Advertisement