దేశీ మార్కెట్లో చిన్న కార్ల జోరు | small cars in domestic market | Sakshi
Sakshi News home page

దేశీ మార్కెట్లో చిన్న కార్ల జోరు

Published Wed, Oct 1 2014 1:20 AM | Last Updated on Sat, Sep 2 2017 2:11 PM

small cars in domestic market

న్యూఢిల్లీ: కష్టకాలాన్ని ఎదుర్కొంటూ వచ్చిన దేశీ కార్ల మార్కెట్‌కు ప్రస్తుతం చిన్న కార్లు ఊతమిస్తున్నాయి. ఇరుకు రోడ్లు, పార్కింగ్ సమస్యల కారణంగా కొనుగోలుదారులు ఎక్కువగా వీటివైపు మొగ్గు చూపుతుండటమే ఇందుకు కారణం.

దీంతో పరిమాణంలో చిన్నగా ఉన్నా, కొనుగోలుదారు పెట్టే ధరకు గరిష్ట స్థాయిలో లగ్జరీ సదుపాయాలను కూడా ఆటోమొబైల్ కంపెనీలు వీటిలో కల్పించేందుకు ప్రయత్నిస్తున్నాయి. రూ. 5,00,000- రూ. 9,00,000 శ్రేణిలో మినీ సెడాన్లు, రూ. 6,00,000 నుంచి రూ. 12,00,000 దాకా ఖరీదు చేసే స్పోర్ట్స్ యుటి లిటీ వాహనాలు(ఎస్‌యూవీ), మల్టీ యుటిలిటీ వాహనాలు(ఎంయూవీ) మార్కెట్లను ముంచెత్తుతున్నాయి. మిగతా సెగ్మెంట్లతో పోలిస్తే ఈ సెగ్మెంట్ మెరుగ్గా 15-16 శాతం స్థాయిలో వృద్ధి చెందుతోందని అంచనా.

 నాలుగు మీటర్ల లోపు పొడవుండే కార్లపై తక్కువ స్థాయిలో ఎనిమిది శాతం ఎక్సైజ్ సుంకం విధించాలన్న గత యూపీఏ ప్రభుత్వ విధానపరమైన నిర్ణయం.. చిన్న కార్ల ట్రెండ్‌కు శ్రీకారం చుట్టింది. సెడాన్లపై 20 శాతం, ఎస్‌యూవీలపై 24 శాతం ఎక్సైజ్ సుంకాలు ఉండాలని గత ప్రభుత్వం నిర్ణయించింది. ఆటోమొబైల్ రంగానికి ఊతమిచ్చే విధంగా ప్రస్తుత ఎన్‌డీయే ప్రభుత్వం కూడా ఇదే విధానం కొనసాగించాలని నిర్ణయించడం చిన్న కార్ల మార్కెట్‌కు తోడ్పడుతోంది.

  లగ్జరీ ఫీచర్లు..
 లోపల విశాలంగా ఉండటం, లగ్జరీ ఫీచర్లు, తక్కువ ధర, చూడముచ్చటి ఆకారం, అన్నింటికన్నా ముఖ్యంగా మెరుగైన మైలేజీ, ట్రాఫిక్‌లో సైతం సులువుగా వెళ్లేందుకు అనువుగా ఉండటం చిన్న కార్లకు ప్లస్ పాయింటు. టచ్‌స్క్రీన్లు, బ్లూటూత్ కనెక్టివిటీ, ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, పార్కింగ్ సెన్సార్‌లు, డే-టైమ్ ల్యాంప్‌లు, సీడీ ప్లేయర్లు మొదలైన ఫీచర్లు కొన్నాళ్ల క్రితం దాకా కాస్త పై స్థాయి కార్లకు మాత్రమే పరిమితం అయ్యేవి.

 ప్రస్తుతం టెక్నాలజీ అభిరుచి కలిగిన యువ కొనుగోలుదారుల సంఖ్య పెరుగుతుండటంతో కంపెనీలు చిన్న కార్లలో కూడా ఇలాంటి ఫీచర్లను పొందుపరుస్తున్నాయి. స్టీరింగ్ వీల్‌పైనే బ్లూటూత్ కనెక్టివిటీ, ఆడియో కంట్రోల్స్ కూడా ఉండాలని చాలా మంది కొనుగోలుదారులు కోరుకుంటున్నట్లు ఆటోమొబైల్ రంగ నిపుణుడు టుటు ధవన్ తెలిపారు. ఇతరులను అనుకరించడం కాకుండా తమ అవసరాలకు అనుగుణమైన కార్లను ఎంచుకోవడంలో దేశీ కొనుగోలుదారులు ప్రస్తుతం వాస్తవిక దృక్ప థంతో వ్యవహరిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

 ప్రస్తుతం 4 మీటర్ల లోపు పొడవుండే కార్లలో ఫోర్డ్ ఎకోస్పోర్ట్, హోండా అమేజ్, మారుతీ సుజుకీ స్విఫ్ట్ డిజైర్, హ్యుందాయ్ ఎక్సెంట్  వాహనాలు పాపులర్‌గా ఉన్నాయి. అలాగే రెనో డస్టర్, నిస్సాన్ టెరానో, మారుతీ సుజుకీ ఎర్టిగా, హోండా మొబీలియో కార్లు మార్కెట్‌లో పెను మార్పులు తెచ్చాయి. ఈ సెగ్మెంట్ ఊతంతోనే రెనో, ఫోర్డ్ వంటి కంపెనీలు నిలదొక్కుకున్నాయి.

భారత మార్కెట్లో లేటుగా ప్రవేశించినప్పటికీ 2012 జూలైలో ప్రవేశపెట్టిన డస్టర్ ఎస్‌యూవీతో రెనో సంస్థ ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇక, రెండు దశాబ్దాల పైగా భారత్‌లో ఉన్న పెద్దగా విజయవంతం కాలేకపోయిన ఫోర్డ్ సైతం.. ఎకోస్పోర్ట్ మినీ ఎస్‌యూవీని ప్రవేశపెట్టడం ద్వారా ఒక్కసారిగా అందరి దృష్టినీ ఆకర్షించింది. 17 రోజుల వ్యవధిలో ఏకంగా 40,000 బుకింగ్స్ వచ్చాయి.

ఇప్పటికీ వీటికోసం నాలుగు నుంచి ఎనిమిది నెలల దాకా వెయిటింగ్ పీరియడ్ ఉంటోంది. ఈ విభాగం కార్లు ఇంత  ప్రజాదరణ పొందుతుండటంతో రాబోయే ఆరు నెలల్లో మారుతీ, టాటా, హ్యుందాయ్, మహీంద్రా, ఫియట్, షెవర్లె, ఫోక్స్‌వ్యాగన్ తదితర కంపెనీలు మరిన్ని మినీ-సెడాన్లను ప్రవేశపెట్టేందుకు కసరత్తు చేస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement