3.5 ట్రిలియన్ డాలర్లకు గ్లోబల్ ఐటీ వ్యయాలు!
న్యూఢిల్లీ: గ్లోబల్ ఐటీ వ్యయాలు 2017లో 1.4 శాతం వృద్ధితో 3.5 ట్రిలియన్ డాలర్లకి చేరుతాయని ప్రముఖ రీసెర్చ్ సంస్థ గార్ట్‌నర్ తాజాగా అంచనా వేసింది. దీనికి అమెరికా డాలర్ బలపడుతుండటం కారణమని తెలిపింది. ‘డాలర్ పుంజుకోవడం వల్ల మా 2017 ఐటీ వ్యయాల అంచనా విలువ 67 బిలియన్ డాలర్లమేర తగ్గింది. కరెన్సీ ఒడిదుడుకుల వల్ల అమెరికా కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తోన్న అంతర్జాతీయ ఐటీ కంపెనీల రాబడులు తగ్గొచ్చు’ అని గార్ట్‌నర్ రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ జాన్ డేవిడ్ లవ్‌లాక్ తెలిపారు.
డేటా సెంటర్ సిస్టమ్ వ్యయాలు 0.3 శాతం వృద్ధితో 171 బిలియన్ డాలర్లకి చేరొచ్చని పేర్కొన్నారు. ఇక ఎంటర్‌ప్రైజ్ సాఫ్ట్‌వేర్ వ్యయాలు 5.5% వృద్ధితో 351 బిలియన్ డాలర్లకి పెరగొచ్చని తెలిపారు. డివైసెస్, ఐటీ సర్వీసులపై వ్యయాలు వరుసగా 1.7%, 2.3% వృద్ధితో 645 బిలియన్ డాలర్లు, 917 బిలియన్ డాలర్లకి చేరొచ్చని అంచనా.