న్యూఢిల్లీ : వరుసగా రెండో రోజు బంగారం ధరలు తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతోపాటు స్థానికంగా డిమాండ్ లోపించడంతో దేశీయ మార్కెట్లో బంగారం ధరలు పడిపోయాయి. శనివారం నాటి బులియన్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర 100 రూపాయలు తగ్గడంతో రూ. 31,350గా నమోదైంది. ఇటు బంగారం ధరలు తగ్గితే, వెండి ధరలు మాత్రం పైకి ఎగిశాయి. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్ రావడంతో, వెండి ధరలు పెరిగాయి. నేటి మార్కెట్లో కేజీ వెండి ధర 275 రూపాయలు పెరిగి రూ. 37,775గా నమోదైంది.
అమెరికా ఉద్యోగ డేటా సానుకూలంగా ఉండటంతో డాలర్‌కు డిమాండ్ పెరిగింది. దీంతో పసిడిలో పెట్టుబడులు తగ్గాయి. దీనికి తోడు స్థానిక నగల వ్యాపారులు, రిటైలర్ల నుంచి కూడా కొనుగోళ్లు లేకపోవడంతో ధర తగ్గినట్లు బులియన్ వర్గాలు చెప్పాయి. అంతర్జాతీయంగానూ పసిడి 0.28శాతం తగ్గి ఔన్సు ధర 1,196.20 డాలర్లు పలికింది. 99.9 శాతం, 99.5 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం ధర 100 రూపాయల చొప్పున తగ్గి, రూ.31,350గా, రూ.31,200గా నమోదైంది. శుక్రవారం కూడా బంగారం ధరలు 60 రూపాయలు తగ్గాయి.
Comments
Please login to add a commentAdd a comment