
న్యూఢిల్లీ : బంగారం ధరలు వరుసగా రెండో కూడా పతనమయ్యాయి. గత రెండు రోజుల నుంచి పడిపోతున్న ధరలతో బంగారం రూ.32వేల మార్కు దిగువకు వచ్చి చేరింది. బుధవారం ఒక్కసారిగా 430 రూపాయల మేర పడిపోయిన బంగారం ధరలు, నేడు మరో 240 రూపాయలు కిందకి దిగజారాయి. 240 రూపాయలు తగ్గడంతో నేడు బులియన్ మార్కెట్‌లో 10 గ్రాముల బంగారం ధర రూ.31,780గా నమోదైంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బలహీనమైన ట్రెండ్‌తో పాటు దేశీయ జువెల్లర్ల వద్ద నుంచి డిమాండ్ తగ్గడంతో దేశీయంగా బంగారం ధరలు పడిపోతున్నట్టు బులియన్ ట్రేడర్లు చెప్పారు.
అంతర్జాతీయంగా అమెరికా బాండ్ ఈల్డ్స్‌కు డిమాండ్ పెరగడం, ఇటలీలో రాజకీయ ఆందోళనలు చెలరేగడం వంటి వాటితో డాలర్ ఇండెక్స్ భారీగా పెరుగుతోంది. ఈ ప్రభావం బంగారం ధరలపై పడుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు ఈ వారం 2 శాతానికి పైగా పడిపోయినట్టు తెలిసింది. దేశీయంగా 99.9 శాతం, 99.5 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం ధరలు రూ.240 చొప్పున పడిపోయి రూ.31,780గా, రూ.31,630గా నమోదయ్యాయి. నిన్న రూ.430 పడిపోయిన బంగారం ధరలు రూ.32,020 వద్ద ముగిసిన సంగతి తెలిసిందే. మరోవైపు బుధవారం బంగారం బాటలోనే నడిచిన వెండి, నేడు మాత్రం రికవరీ అయింది. వెండి ధరలు నేటి మార్కెట్‌లో 100 రూపాయలు పెరిగి కేజీకి రూ.40,750గా నమోదయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment