మళ్లీ పసిడి మెరుపులు...
- నాలుగువారాల గరిష్టం
- అంతర్జాతీయ అంశాలు కారణం
న్యూయార్క్/న్యూఢిల్లీ: యూరోపియన్ యూని యన్ నుంచి బ్రిటన్ వైదొలగడంపై అంచనాలు, అమెరికా ఫెడ్ ఫండ్ రేటు పెంపులో ఆలస్యం వంటి అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి అంశాలు పసిడికి బలంగా మారుతున్నాయి. న్యూయార్క్ కమోడిటీ ఎక్స్ఛేంజ్‌లో ధర వరుసగా నాల్గవ ట్రేడింగ్ సెషన్‌లోనూ పెరిగింది. క్రితం ముగింపుతో పోల్చితే కడపటి సమాచారం అందేసరికి చురుగ్గా ట్రేడవుతున్న ఆగస్టు డెలివరీ కాంట్రాక్ట్ ధర ఔన్స్(31.1గ్రా)కు 10 డాలర్ల లాభంతో 1,286 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. మే 16 తరువాత ఈ స్థాయికి పసిడి ధర చేయడం ఇదే తొలిసారి.
తిరిగి రూ. 30,000 పైకి
ఇక దేశీయంగానూ పసిడి పరుగులు తీసింది. కొనుగోళ్ల మద్దతుతో ముంబై ప్రధాన బులియన్ మార్కెట్‌లో 99.9 స్వచ్ఛత 10 గ్రాముల ధర ఒకేరోజు రూ.480 ఎగసింది. రూ.30,070కి చేరింది. ఇక 99.5 స్వచ్ఛత ధర సైతం అంతే మొత్తం ఎగసి రూ.29,920కి ఎగసింది. వెండి ధర కేజీకి రూ.470 పెరిగి రూ.41,520 వద్దకు చేరింది.