
పసిడి ధరలపై ‘ఫెడ్’ ప్రభావం
దేశీయంగా వరుసగా మూడువారాలపాటు క్షీణించిన బంగారం ధర గతవారం స్వల్పంగా పెరిగింది. జువెల్లరీ స్టాకిస్టులు, రిటైలర్ల నుంచి డిమాండ్ మెరుగుపడటంతో ఈ స్వల్ప పెరుగుదల సంభవించింది. అయితే కీలకమైన రుతుపవనాల సీజన్ జాప్యంకావడం, ఆర్థిక వ్యవస్థ వృద్ధి మందకొడిగా వుండటం వల్ల బంగారం ధర వారమంతా హెచ్చుతగ్గులకు లోనయ్యిందని బులియన్ వర్తకులు చెప్పారు. ఈ వారం జరిగే అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ కమిటీ సమావేశంపై బులియన్ మార్కెట్ దృష్టి వుందని వారన్నారు. ఫెడ్ వడ్డీ రేట్ల పెంపునకు సంబంధించిన సంకేతాల ఆధారంగా బంగారం బాగా పెరగడం లేదా తగ్గడం జరుగుతుందని వారు వివరించారు.
అంతర్జాతీయ మార్కెట్లో గతవారం పుత్తడి ధర ఔన్సుకు 11 డాలర్లు పెరిగి 1,179 డాలర్లకు చేరింది. దేశీయంగా ముంబై బులియన్ మార్కెట్లో 99.9 స్వచ్ఛతగల 10 గ్రాముల బంగారం ధర అంతక్రితం వారంతో పోలిస్తే రూ. 110 పెరుగుదలతో 26,840 వద్దకు ఎగిసింది. 99.5 స్వచ్ఛతగల స్టాండర్డ్ బంగారం ధర అంతేమొత్తం పెరిగి రూ. 26,690 వద్దకు చేరింది.