తగ్గిన బంగారం ధరలు
ఒకరోజు భారీగా పైకి ఎగుస్తూ.. మరోరోజు భారీగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు, మంగళవారం మళ్లీ కిందకి పడిపోయాయి.
సాక్షి, న్యూఢిల్లీ : ఒకరోజు భారీగా పైకి ఎగుస్తూ.. మరోరోజు భారీగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు, మంగళవారం మళ్లీ కిందకి పడిపోయాయి. ఈక్విటీలు, డాలర్ పైకి ఎగియడంతో పసిడి పరుగుకు బ్రేక్‌పడింది. 150 రూపాయల నష్టంలో రూ.31వేల మార్కుకు కిందకి పడిపోయింది. నేటి బులియన్ మార్కెట్‌లో 10 గ్రాముల బంగారం ధర రూ.30,850గా నమోదైంది. ఉత్తర కొరియా టెన్షన్లు కొంత తగ్గుముఖం పటట్టడంతో, సురక్షిత ఆస్తులుగా ఉన్న బంగారం, జపనీస్ యెన్, స్విస్ ఫ్రాంక్, ట్రెజరీలకు డిమాండ్ పడిపోయింది. వెండి ధరలు కూడా స్వల్పంగా 50 రూపాయల నష్టంలో కేజీకి రూ.41,650గా నమోదయ్యాయి.
అంతర్జాతీయంగా బలహీనమైన ట్రెండ్‌తో పాటు స్థానిక జువెల్లర్స్, రిటైలర్ల నుంచి డిమాండ్ లేకపోవడంతో బంగారం ధరలు తగ్గుతున్నట్టు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. గ్లోబల్‌గా బంగారం 0.08 శాతం పడిపోయి, సింగపూర్ ఔన్స్ బంగారం ధర 1,325.90 డాలర్లుగా నమోదైంది. వెండి కూడా 0.31 శాతం కిందకి పడిపోయి ఔన్స్‌కు 17.70 డాలర్లుగా ఉంది. దేశరాజధాని ఢిల్లీలో 99.9 శాతం, 99.5 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం ధరలు 150 రూపాయల చొప్పున పడిపోయి రూ.30,850గా, రూ.30,700గా నమోదయ్యాయి. సోమవారం ట్రేడింగ్‌లో ఈ ధరలు 470 రూపాయలు బలపడ్డాయి.