న్యూఢిల్లీ: దేశ ఆర్థిక రంగానికి 2020 ఆర్థిక సంవత్సరం నుంచి మంచి రోజులేనని, వృద్ధి రేటు వెలిగిపోతుందని అంతర్జాతీయ ఆర్థిక సేవల కంపెనీ హెచ్‌ఎస్‌బీసీ తెలిపింది. అయితే, వచ్చే రెండేళ్లపాటు వృద్ధి నిదానిస్తుందని, ఆ తర్వాత మధ్య కాలానికి పుంజుకుంటుందని తన నివేదికలో వివరించింది. 2019–20లో జీడీపీ వృద్ధి రేటు 7.6 శాతంగా ఉంటుందని అంచనా వేసింది. ‘‘భారత వృద్ధి ప్రయాణం రెండు భాగాలు. మొదటిది వృద్ధి తగ్గడం, తిరిగి స్వల్ప కాలంలో (2017–18, 2018–19 సంవత్సరాల్లో) క్రమంగా రికవరీ అవడం.
జీఎస్టీ అమలు కారణంగా ఎదురైన విఘాతాల నుంచి వివిధ రంగాలు తిరిగి గాడినపడతాయి. రెండోది 2019–20 తర్వాత నుంచి మధ్యకాలంలో ఆశాజనక వృద్ధికి అవకాశాలు. 2017–18 నుంచి 2019–20 వరకు వృద్ధి రేటు వరుసగా 6.5 శాతం, 7 శాతం, 7.6 శాతం చొప్పున నమోదు కావచ్చని అంచనా వేస్తున్నాం’’ అని హెచ్‌ఎస్‌బీసీ వివరించింది. మధ్య కాలంలో ఒక్క జీఎస్టీయే జీడీపీని 40 బేసిస్ పాయింట్ల మేర పెంచుతుందని అభిప్రాయపడింది.
నాణేనికి రెండో వైపు అన్నట్టు... రెండు బ్యాలన్స్ షీట్ల సమస్య, కంపెనీల అధిక రుణ భారం దీర్ఘకాలం పాటు కొనసాగితే పెట్టుబడుల పునరుద్ధరణ, జీడీపీ వృద్ధి రేటు రికవరీపై ప్రభావం పడుతుందని హెచ్‌ఎస్‌బీసీ పేర్కొంది. కరెంట్ ఖాతా లోటు 2017–18లో 1.7 శాతం, 2018–19లో 1.9 శాతం, 2019–20 నాటికి 2.1 శాతానికి విస్తరిస్తుందని అంచనా వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు లక్ష్యం 3.2 శాతం పెరిగే అవకాశాలున్నాయని తెలిపింది.
వచ్చే 20 ఏళ్లు 8 శాతం తగ్గదు...
భారత్ తదుపరి అంచె సంస్కరణలకు తెరతీస్తే వచ్చే రెండు దశాబ్దాల కాలం పాటు 8 శాతం వృద్ధి రేటును నమోదు చేయగలదని ఐక్యరాజ్యసమితిలో ఆర్థిక వ్యవహారాల అధికారి సెబాస్టియన్ వెర్గర అన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ సానుకూలంగా, వృద్ధికి అనుకూలంగా ఉందని పేర్కొన్నారు. భారత్ తన పూర్తి సామర్థ్యాలను చేరుకునేందుకు తదుపరి విడత సంస్కరణలను చేపట్టాల్సి ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు.
పెట్టుబడులను ప్రోత్సహించడంతోపాటు దేశ ప్రజల జీవన స్థితిగతులను మెరుగుపరచాలని సూచించారు. భారత ఆర్థిక రంగం సానుకూల స్థితిలో ఉన్నప్పటికీ దేశ ఆర్థిక వృద్ధి రేటు అన్నది గత అంచనాల కంటే కొంచెం తగ్గొచ్చన్నారు. భారతదేశ ద్రవ్య విధానం వివేకంతో ఉందని, ఆర్థిక కార్యకలాపాలకు మద్దతుగా ఉందని వర్గర వివరించారు. పబ్లిక్ ఇన్వెస్ట్‌మెంట్, మౌలిక çసదుపాయాలపై ప్రభుత్వం దృష్టి సారించడాన్ని ప్రశంసించారు.
Comments
Please login to add a commentAdd a comment