న్యూఢిల్లీ: రానున్న బడ్జెట్‌లో మోదీ ప్రభుత్వం ఆదాయపు పన్ను(ఐటీ) భారం నుంచి ప్రజలకు ఊరటకలిగించే అవకాశం ఉందా? కార్పొరేట్లు, నిపుణులు ఈ దిశగా చర్యలు ఉంటాయని అంచనా వేస్తున్నారు. ఆదాయపన్ను రేట్లు, శ్లాబుల్లో మార్పులు చేయవచ్చని ఎర్నెస్ట్ అండ్ యంగ్ (ఈవై) అనే కన్సల్టెన్సీ సంస్థ నిర్వహించిన సర్వేలో అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. డివిడెండ్లపై ప్రస్తుత పన్నులో ఎటువంటి మార్పులు చేయకపోవచ్చని ఈ సర్వే పేర్కొంది.ప్రజల వినియోగాన్ని మరింత పెంచేందుకు వీలుగా పన్ను మినహాయింపు పరిమితిని మరింత పెంచే అవకాశం ఉందని బడ్జెట్‌కు ముందు ఈవై నిర్వహించిన ఈ సర్వేలో 69 శాతం మంది అభిప్రాయపడ్డారు.
ఈ నెలలోనే జరిగిన ఈ సర్వేలో 150 మంది కంపెనీల సీఎఫ్‌వోలు, పన్ను అధికారులు, ఆర్థిక శాఖ సీనియర్ నిపుణులు పాల్గొన్నారు. ఉద్యోగులపై పన్ను భారం తగ్గించేందుకు కాలం చెల్లిపోయిన మినహాయింపుల స్థానంలో ప్రామాణిక తగ్గింపును ప్రవేశపెట్టే అవకాశం ఉందని 59 శాతం మంది చెప్పారు. కార్పొరేట్ పన్నును ఆర్థిక మంత్రి 25 శాతానికి తగ్గించొచ్చని, సర్‌చార్జ్‌ను కొనసాగించొచ్చని 48 శాతం మంది చెప్పారు. డివిడెండ్ పంపిణీపై ప్రస్తుతమున్న పన్నులో మార్పు చేస్తారని ఆశించడం లేదంటూ 65 శాతం మంది చెప్పడం గమనార్హం.
కార్పొరేట్ రంగంపై భారం తగ్గించేందుకు గాను పన్ను రేటును 10 శాతం తగ్గించాలని 24 శాతం మంది అభిప్రాయపడ్డారు. ‘‘పన్ను విధానాల్లో స్థిరత్వం, క్రమబద్ధత, మోస్తరు పన్నులు ఉండాలన్న దానిపై భారత పారిశ్రామిక రంగంలో ఏకాభిప్రాయం ఉందని ‘2018 బడ్జెట్ ముందస్తు సర్వే’ తెలియజేస్తోంది. ప్రత్యక్ష పన్ను వసూళ్లలో భారీ మార్పుల పట్ల తక్కువ అంచనాలే ఉన్నాయి’’ అని ఈవై ఇండియా నేషనల్ ట్యాక్స్ లీడర్ సుధీర్ కపాడియా పేర్కొన్నారు. ఫిబ్రవరి 1న మోదీ సర్కారు తన చిట్టచివరి పూర్తిస్థాయి కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది.
సెజ్‌లకు పన్ను రాయితీలు కొనసాగాలి...
ప్రత్యేక ఆర్థిక మండళ్లలోని యూనిట్లకు ప్రస్తుతమున్న పన్ను రాయితీలను కొనసాగించాలని వాణిజ్య శాఖ డిమాండ్ చేస్తోంది. ఎగుమతులు, ఉద్యోగాల కల్పనకు ఇది అవసరమని అభిప్రాయపడింది. ఈ మేరకు వాణిజ్య శాఖ ఓ లేఖను కేంద్ర ఆర్థిక శాఖకు రాసింది. సెజ్‌లపై ఉన్న కనీస ప్రత్యామ్నాయ పన్నును సైతం తొలగించాలని కోరడం గమనార్హం.
నూతన సెజ్ యూనిట్లు 2020 మార్చి 31లోపు ప్రారంభమయ్యే వాటికే ఆదాయపన్ను ప్రయోజనాలు లభిస్తాయని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ 2016–17 బడ్జెట్‌లో పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ నిబంధన సెజ్‌ల అబివృద్ధిపై ప్రతికూల ప్రభావం చూపెడుతుందని, దీన్ని రద్దు చేయాలన్నది వాణిజ్య శాఖ డిమాండ్. లేకుంటే పెట్టుబడులపై ప్రభావం పడుతుందని లేఖలో వివరించింది. ప్రస్తుతం సెజ్‌ల నుంచి ఎగుమతులపై మొదటి ఐదేళ్లలో పూర్తిగా ఆదాయపన్ను మినహాయింపు ఉంది. ఆ తర్వాత ఐదేళ్ల పాటు 50 శాతం పన్ను రాయితీ పొందొచ్చు.
ద్రవ్యలోటుకు చెక్ పెట్టాలి
ద్రవ్యలోటు లక్ష్యాన్ని చేరుకునే విషయంలో మరింత పటిష్ట చర్యల్ని కేంద్ర ఆర్థిక బడ్జెట్‌లో భాగంగా ప్రకటించాలని ప్రముఖ ఆర్థిక నిపుణుడు టీఎన్ శ్రీనివాసన్ సూచించారు. యేల్ యూనివర్సిటీలో గౌరవ ఎకనమిక్స్ ప్రొపెసర్‌గా పనిచేస్తున్న శ్రీనివాసన్ మాట్లాడుతూ... ఉద్యోగాల క్షీణతకు డీమోనిటైజేషన్, జీఎస్‌టీతో ముడిపెట్టడంలో అర్థరహితమని చెప్పారు.
‘‘ద్రవ్యలోటును ఆర్థిక మంత్రి తనకు సాధ్యమైనంత వరకు కళ్లెం వేయాలి. అలాగే, ప్రాజెక్టులు సకాలంలో, సమర్థవంతంగా నిర్వహించేందుకు కూడా చర్యలు అవసరం’’ అని శ్రీనివాసన్ సూచించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2017–18)లో ద్రవ్యలోటును జీడీపీలో 3.2 శాతానికి పరిమితం చేయాలన్నది కేంద్ర సర్కారు విధించుకున్న లక్ష్యం.
Comments
Please login to add a commentAdd a comment