సారిడాన్ టాబ్లెట్ (ఫైల్ ఫోటో)
న్యూడిల్లీ : ఫిక్స్‌డ్ డోస్ కాంబినేషన్(ఎఫ్‌డీసీ) డ్రగ్స్ విషయంలో ఫార్మా కంపెనీలకు, ప్రభుత్వాలకు సాగుతున్న వివాదం మరింత ముదిరింది. 328 రకాల ఎఫ్‌డీసీ డ్రగ్స్‌ను వెంటనే తయారు చేయడం, విక్రయించడం ఆపివేయాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీచేసింది. సారిడాన్‌తో పాటు చర్మ వ్యాధులకు వాడే పాన్ డెర్మ్, ఆల్కెం ల్యాబోరేటరీస్‌కు చెందిన టాక్సిమ్ ఏజెడ్, మెక్లోడ్స్ ఫార్మా పండెమ్ ప్లస్ క్రీమ్‌లను కూడా ప్రభుత్వం నిషేధించింది. వీటితో పాటు మొత్తం 328 ఎఫ్‌డీసీ మందులను నిషేధిస్తున్నట్టు ప్రభుత్వం పేర్కొంది. వీటి తయారీని, అమ్మకాలను, పంపిణీని తక్షణం నిలిపివేస్తున్నట్టు వెల్లడించింది. వివిధ కంపెనీలు దాదాపు 6000 బ్రాండ్లతో ఈ ఔషధాలను అమ్ముతున్నారు. ప్రభుత్వ చర్యతో ఈ బ్రాండ్ల అమ్మకాలన్నీ ఆగిపోనున్నాయి. రూ.2000 కోట్ల నుంచి రూ.2500 కోట్ల వరకు వీటి మార్కెట్ సైజు ఉంటుంది.
2016లో మార్చి 10న కేంద్ర ప్రభుత్వం 349 ఎఫ్‌డీసీలను నిషేధించింది. డ్రగ్స్ అండ్ కాస్మొటిక్స్ యాక్ట్ 1940 చట్టంలోని సెక్షన్ 26A ప్రకారం వాటిపై నిషేధం విధించింది. ఐతే కేంద్రం నిర్ణయాన్ని ఫార్మా కంపెనీలు పలు హైకోర్టులతో పాటు సుప్రీంకోర్టులో సవాల్ చేశాయి. దీంతో గత ఏడాది డిసెంబరులో ఈ ఔషధాల విషయాన్ని పరిశీలించాల్సిందిగా డ్రగ్స్ టెక్నికల్ అడ్వయిజరీ బోర్డ్ (డీట్యాబ్)ను సుప్రీంకోర్టు కోరింది. ఆ మేరకు పరిశీలన జరిపిన కమిటీ ..వాటిలో 328 ఎఫ్‌డీసీ ఔషధాలు హానికరమని నివేదిక ఇచ్చింది. వాటిపై నిషేధించడం విధించడం సరేనని తేల్చింది. ఇవి వాడటం వల్ల ప్రజల ఆరోగ్యానికి మరింత నష్టం వాటిల్లుతుందని తెలిపింది. ప్రజా శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని, ఎఫ్‌డీసీల తయారీని, విక్రయాలను, పంపిణీని నిరోధించడం అవసరం అని డీట్యాబ్ ఓ ప్రకటన విడుదల చేసింది.
Comments
Please login to add a commentAdd a comment