
జీఎస్‌టీతో పన్నుల ఊరట!
♦ ఆర్‌బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్
♦ ఐటీ ఉద్యోగాలపై తీవ్ర నిరాశాధోరణి వద్దని హితవు
♦ స్టార్టప్‌లు ఆదుకుంటాయని భరోసా
ముంబై: వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) వల్ల దీర్ఘకాలంలో పన్ను భారం తగ్గుతుందని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ఉర్జిత్ పటేల్ పేర్కొన్నారు. జూలై 1 నుంచి నాలుగు అంచల్లో అమల్లోకి రానున్న జీఎస్‌టీ వల్ల దేశవ్యాప్త ఒకే మార్కెట్ ఏర్పాటవడంతోపాటు, పన్ను పరమైన ప్రయోజనాలు దీర్ఘకాలంలో ఉంటాయన్నారు. కాగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ)లో ఉపాధి అవకాశాల పట్ల తీవ్ర నిరాశావాదం పనికిరాదని పేర్కొన్న ఆయన, ఇక్కడ ఏమైనా సవాళ్లు ఎదురైతే, ఈ లోటును స్టార్టప్‌లు భర్తీ చేస్తాయన్న భరోసాను ఆయన వ్యక్తం చేశారు. ఇండస్ట్రీ లాబీ ఐఎంసీ చాంబర్ ఆఫ్ అండ్ ఇండస్ట్రీ ఇక్కడ నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆర్‌బీఐ గవర్నర్ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగంలో ముఖ్యాంశాలు చూస్తే...
♦ జీఎస్‌టీలో ఒక ముఖ్యమైన అంశం ఏమిటంటే, పన్ను ప్రక్రియ, నిర్వహణ సంబంధించి పారదర్శకత దిశలో ఒక సంస్కరణ ఇది.
♦ దీనివల్ల పన్ను పరిధి విస్తరిస్తుంది.
♦ రాష్ట్రాల మధ్య, రాష్ట్రంలో వస్తువుల సరఫరాల సమయంలో అసమగ్రతలను జీఎస్‌టీ తొలగిస్తుంది.
♦ ఫైనాన్షియల్ సేవల్లో సాంకేతిక అభివృద్ధి అంశాలు ఫైనాన్షియల్ సెక్టార్‌కు కష్టాలతో పాటు, నష్టాలనూ తెచ్చిపెడుతుంది. ఈ సమస్యలను ఎదుర్కొనడానికి విధాన నిర్ణేతలు, రెగ్యులేటర్లు, సూపర్‌వైజర్లు తగిన చర్యలను తీసుకోవాలి.
♦ 2008 ఆర్థిక సంక్షోభం నుంచి ఇంకా పూర్తిస్థాయిలో ప్రపంచం కోలుకోవాల్సి ఉన్నందున ప్రతి ఆర్థిక అంశం, నిర్ణయం పట్లా జాగరూకతగా వ్యవహరిస్తూ... ప్రయోజనాలు, ప్రతికూలాంశాల పట్ల ఎప్పటికప్పుడు పూర్తి మదింపును చేసుకోవాల్సి ఉంటుంది.
♦ కొన్ని ప్రతికూల ఫలితాలు ఎదురవుతున్నప్పటికీ, భారత్ ఫైనాన్షియల్ పరిశ్రమ 2013 నుంచీ భారీగా అభివృద్ధి చెందింది. అప్పటినుంచీ మూడు రెట్లు పెరిగి ఇప్పటికే 30 బిలియన్ డాలర్లకు చేరింది.
♦ డిజిటల్ బ్యాంకింగ్ ఏర్పాటు దిశలో ఆర్‌బీఐ పలు చర్యలు తీసుకుంటోంది.
♦ 2016–17లో 8.6 శాతం ఉన్న 160 బిలియన్ డాలర్ల ఐటీ వృద్ధి రేటు 2017–18లో 7.8 శాతానికి తగ్గిపోతుందన్న నాస్కామ్ గైడింగ్‌ను ఆయన ప్రస్తావిస్తూ... ఈ రంగంలో ఉద్యోగాలపై మరో ఆందోళన అక్కర్లేదని వివరించారు. ఒకవేళ అలా జరిగినా స్టార్టప్‌లు ఈ లోటును భర్తీ చేస్తాయని అన్నారు. నివేదికలు చెబుతున్న అంశాలు, పరిశ్రమలు పేర్కొంటున్న అంశాల మధ్య వ్యత్యాసం ఉంటుందని అన్నారు.
♦ మార్కెట్ ఎక్సే్ఛంజ్ రేటు వద్ద 2.3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా ప్రపంచ వేదికపై మన అభిప్రాయాల పట్ల పూర్తి విశ్వాసం ఉంటుందని, ఓపెన్ ట్రేడింగ్ వ్యవస్థ పట్ల మనం భారీగా ప్రయోజనం పొందవచ్చనీ ఆయన వివరించారు.
ఎన్‌పీఏలపై కమిటీలో మరో ముగ్గురు...
బ్యాంకింగ్ రంగంలో పేరుకుపోయిన మొండిబకాయిల (ఎన్‌పీఏ) సమస్యను పరిష్కరించడంపై సూచనలు ఇవ్వడానికి ఉద్దేశించిన కమిటీ (ఓవర్‌సైట్)లో కొత్తగా మరో ముగ్గురిని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) నియమించింది. దీనితో కమిటీ సభ్యుల సంఖ్య ఐదుకు పెరిగింది. మాజీ చీఫ్ విజిలెన్స్ కమిషనర్ ప్రదీప్ కుమార్ ఈ కమిటీకి చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహిస్తారని ఆర్‌బీఐ ప్రకటన ఒకటి తెలిపింది. బ్యాంకింగ్ రెగ్యులేషన్ (సవరణ) ఆర్డినెన్స్, 2017 ప్రకారం తాజా నియామకాలు జరిగాయి.
కుమార్‌తో పాటు ఎస్‌బీఐ మాజీ చైర్మన్ జానకీ వల్లభ్, కెనరాబ్యాంక్ మాజీ చైర్మన్ ఎంబీఎన్ రావు, ఎల్ అండ్ టీ ఫైనాన్స్ మాజీ చైర్మన్ ఎండీ ఎం దేవస్థలి, సెబీ సభ్యుడు ఎస్ రామన్ కమిటీలో సభ్యులుగా ఉంటారు. అయితే సెబీలో బాధ్యతలు పూర్తయిన తర్వాత రామన్ 2017, సెప్టెంబర్ 7 నుంచీ కమిటీలో సభ్యునిగా చేరతారు. దేశంలో బ్యాంకింగ్ మొండి బకాయిలు దాదాపు రూ.8,00,000 కోట్లను దాటిన సంగతి తెలిసిందే.