సోదాలు జరిగిన మైత్రీ కార్యాలయం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నిన్నటివరకు రియల్ ఎస్టేట్ సంస్థలు, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి విద్యా సంస్థల్లో దాడులు నిర్వహించిన ఆదాయ పన్ను శాఖ తాజాగా సినీ నిర్మాతలపై దృష్టి సారించింది. ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ కార్యాలయాలపై సోమవారం జీఎస్టీ అధికారులతో కలిసి దాడులకు దిగింది. ఏకకాలంలో ప్రారంభమైన సోదాలు మొత్తం 15 చోట్ల కొనసాగుతున్నాయి.
ఈ చిత్ర నిర్మాణ సంస్థలో యలమంచిలి రవిశంకర్, ఎర్నేనీ నవీన్ భాగస్వాములుగా ఉన్నారు. ప్రముఖ సినీ హీరోలతో భారీ బడ్జెట్ సినిమాలు నిర్మించే మైత్రీ మూవీ మేకర్స్.. భారీ లాభాలు ఆర్జించినా ఆ మేరకు పన్నులు చెల్లించకుండా ఎగవేసిందనే అనుమానాలతో ఐటీ తనిఖీ లకు దిగినట్లు తెలిసింది. ఈ సంస్థకు చెందిన తాజా చిత్రాలు వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి వచ్చే సంక్రాంతికి విడుదలకు సిద్ధమవుతున్నాయి. మంచి లాభాలు ఆర్జించిన పుష్ప సినిమా సీక్వెల్‌గా వస్తు న్న పుష్ప–2, వస్తాద్ భగత్‌సింగ్‌తో పాటు, మరో మూడు సినిమాలు లైన్‌లో ఉన్నట్టు సమాచారం.
ఫైనాన్షియర్ల ఇళ్లల్లోనూ..
నిర్మాతల ఇళ్లు, కార్యాలయాలతో పాటు ఉద్యోగులు, వీరికి ఫైనాన్స్ చేస్తున్నారన్న అనుమానం ఉన్న వారి ఇళ్లల్లోనూ ఐటీ, జీఎస్టీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. సోమవారం ఉదయం ప్రారంభమైన ఈ సోదాలు రాత్రి వరకు కొనసాగాయి. ప్రస్తుతం లైన్‌లో ఉన్న సినిమాల బడ్జెట్ ఆరేడు వందల కోట్ల వరకు ఉంటుందని అంచనా. కాగా ఇందుకు అవసరమైన భారీ మొత్తం నిధులు ఏ విధంగా సమకూరాయి?
ఎక్కడ నుంచి ఫైనాన్స్ తీసుకున్నారు? అందుకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు సక్రమంగానే ఉన్నాయా.? పన్నుల చెల్లింపులు ఎలా ఉన్నాయి? చిత్రాల నిర్మాణానికి ఎంతెంత ఖర్చు చేస్తున్నారు.? అందుకు సంబంధించి జీఎస్టీ చెల్లింపులు చేశారా? లేదా? అన్న అంశాలపై దృష్టి పెట్టినట్లు సమాచారం. ఈ భారీ బడ్జెట్ సినిమాల్లో నటించే వారికి పారితోషికాలు ఏ విధంగా చెల్లిస్తున్నారు?
పూర్తి పారదర్శకంగా ఉన్నాయా? లేదా? హవాలా లావాదేవీలు ఏమైనా ఉన్నాయా.? అన్న కోణంలోనూ కూలంకషంగా ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఈ నిర్మాణ సంస్థకు వచ్చిన లాభాలకు, చెల్లించిన పన్నుల్లో భారీ వ్యత్యాసాలు ఉన్నట్లుగా వచ్చిన సమాచారం ఆధారంగానే అధికారులు దాడులు నిర్వహిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ మేరకు వ్యత్యాసాలు బయటపడినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. అయితే దీనికి సంబంధించి ఐటీ శాఖ నుంచి అధికారిక సమాచారం ఏదీ విడుదల కాలేదు.
తలసాని శ్రీనివాస్‌యాదవ్ పీఏ విచారణ
కేసినో కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణ కొనసాగుతూనే ఉంది. సోమవారంమంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ వ్యక్తిగత సహాయకుడు అశోక్‌ను విచారించారు. కేసినో ఆడించడానికి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ప్రత్యేక విమానాల్లో నేపాల్, శ్రీలంకతో పాటు గోవాలకు తీసుకెళ్లిన చీకోటి ప్రవీణ్‌పై ఇదివరకే కేసులు నమోదైన సంగతి విదితమే. ఈ కేసులోనే అశోక్‌ను కూడా విచారణకు పిలిచారు. అయితే ఇప్పటివరకు ఈడీ అధికారులు ఎలాంటి అధికారిక ప్రకటన జారీ చేయలేదు.
Comments
Please login to add a commentAdd a comment