డీఐపీపీ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానం | Gujarat is the best place for startups | Sakshi
Sakshi News home page

డీఐపీపీ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానం

Published Fri, Dec 21 2018 1:14 AM | Last Updated on Fri, Dec 21 2018 1:14 AM

Gujarat is the best place for startups - Sakshi

న్యూఢిల్లీ: కొత్త ఎంటర్‌ప్రెన్యూర్లు స్టార్టప్స్‌ స్థాపించుకునేందుకు కావలసిన వసతుల కల్పనలో గుజరాత్‌ నంబర్‌వన్‌గా నిలిచింది. ఆయా రాష్ట్రాల్లో స్టార్టప్‌ల ఏర్పాటుకున్న సానుకూల పరిస్థితులపై డీఐపీపీ (పారిశ్రామిక విధాన, ప్రోత్సాహక శాఖ) పరిశీలన జరిపి ర్యాంకింగ్స్‌ ఇచ్చింది. స్టార్టప్‌ పాలసీ, ఇంక్యుబేషన్‌ హబ్స్, ఇన్నోవేషన్స్, నియంత్రణా సవాళ్లు, ప్రొక్యూర్‌మెంట్, కమ్యూనికేషన్స్‌ తదితర విభాగాలకు సంబంధించి 27 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాలను పరిశీలించారు. పరిశీలన అనంతరం అత్యున్నతం, ఉన్నతం, అగ్రగామి, కాబోయే అగ్రగామి, వర్ధమాన రాష్ట్రం, ఆరంభకులు పేరిట రాష్ట్రాలకు ర్యాంకులు ఇచ్చారు. అన్ని విభాగాల్లో అగ్రస్థానంలో ఉన్న గుజరాత్‌ బెస్ట్‌ పెర్ఫామర్‌గా నిలిచింది. కర్ణాటక, కేరళ, ఒడిశా, రాజస్తాన్‌ టాప్‌ పెర్ఫామర్స్‌గా, ఏపీ, తెలంగాణ, బిహార్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌ లీడర్లుగా, హర్యానా, హిమాచల్‌ ప్రదేశ్, జార్ఖండ్, యూపీ, పశ్చిమబెంగాల్‌ రాష్ట్రాలు యాస్పైరింగ్‌ లీడర్లుగా, అసోమ్, ఢిల్లీ, గోవాతో పాటు 8 రాష్ట్రాలు ఎమర్జింగ్‌ స్టేట్స్‌గా, చండీగఢ్, మణిపూర్, మిజోరం, నాగాలాండ్, పుదుచ్చేరి, సిక్కిం, త్రిపుర రాష్ట్రాలు బిగినర్స్‌గా నిలిచాయి.  

ఈ తరహా ర్యాంకింగ్‌లు రాష్ట్రాల్లో స్టార్టప్స్‌కు కావాల్సిన సానుకూల వాతావరణం ఏర్పడేందుకు తోడ్పడతాయని డీఐపీపీ సెక్రటరీ రమేశ్‌ అభిషేక్‌ చెప్పారు. ఏ రాష్ట్రాన్ని తక్కువ చేయడానికి ఈ ప్రక్రియ చేపట్టలేదని, కేవలం ప్రోత్సహించడానికే ర్యాంకింగ్‌లిచ్చామని వివరించారు. విధానపరమైన మద్దతు, ఇంక్యుబేషన్‌ కేంద్రాలు, సీడ్‌ ఫండింగ్, ఏంజిల్, వెంచర్‌ ఫండింగ్, సరళమైన నియంత్రణలతో పాటు వివిధ అంశాలను పరిశీలించి ర్యాంకులను రూపొందించామన్నారు. ఆన్‌లైన్‌ సమాచార కల్పన, నియంత్రణలను సరళీకరించడం, పబ్లిక్‌ ప్రొక్యూర్‌మెంట్‌కు ప్రాధాన్య మివ్వడం తదితర అంశాలపై రాష్ట్రాలు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఆయన సూచించారు.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement