Incubation centers
-
ఇన్క్యుబేషన్ సెంటర్ల ఏర్పాటులో రామ్ఇన్ఫో
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెక్నాలజీ సొల్యూషన్స్ అందించే లిస్టెడ్ సంస్థ రామ్ఇన్ఫో వచ్చే మూడేళ్లలో టాప్ 5 మధ్య స్థాయి టెక్ కంపెనీల్లో ఒకటిగా ఎదగాలని నిర్దేశించుకుంది. ఇందులో భాగంగా అమెరికాలో కూడా కార్యకలాపాలు విస్తరిస్తోంది. అంకుర సంస్థలకోసం అమెరికాలో రెండు, భారత్‌లో ఒకటి చొప్పున ఇన్క్యుబేషన్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు కంపెనీ ఎండీ ఎల్ శ్రీనాథ్‌రెడ్డి బుధవారమిక్కడ తెలిపారు. హైదరాబాద్ కేంద్రంగా 1994లో ఏర్పాటైన రామ్ఇన్ఫో .. ఈసేవ, మీసేవ, సువిధా వంటి సొల్యూషన్స్‌తో అటు ప్రభుత్వాలు, ఇటు కంపెనీలకు ఐటీ, డిజిటల్ పరివర్తన సేవలు అందిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం 9 రాష్ట్రాల్లో సాగిస్తున్న కార్యకలాపాలను 2024–25లో 15 రాష్ట్రాలకు విస్తరించనున్నట్లు శ్రీనాథ్‌రెడ్డి వివరించారు. 135 మిలియన్ డాలర్ల ఆదాయం నిర్దేశించుకున్నట్లు చెప్పారు. -
నీతిఆయోగ్ టాప్ పెర్ఫార్మెన్స్లో ‘విశాఖ ఏఎంటీజెడ్ ఇంక్యుబేషన్’కు చోటు
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో స్టార్టప్‌లను ప్రోత్సహించడానికి ఏర్పాటు చేసిన ఇంక్యుబేషన్ సెంటర్లు అద్భుతమైన పనితీరుతో జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాయి. విశాఖ మెడ్‌టెక్ జోన్లో, అనంతపురం జిల్లా శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన ఇంక్యుబేషన్ సెంటర్లు నీతిఆయోగ్ ప్రకటించిన సర్వేలో అగ్రస్థానాలను దక్కించుకున్నాయి. 2021కి సంబంధించి నీతిఆయోగ్ 68 అటల్ ఇంక్యుబేషన్ సెంటర్స్ పనితీరును అధ్యయనం చేసి.. వచ్చిన మార్కుల ఆధారంగా నాలుగు కేటగిరీలుగా విభజించి నివేదిక విడుదల చేసింది. పదికి 7.5 కంటే ఎక్కువ మార్కులు సాధించిన వాటిని టాప్ పెర్ఫార్మ్స్గా నీతి ఆయోగ్ ప్రకటించింది. ఈ విభాగంలో దేశవ్యాప్తంగా 12 ఇంక్యుబేటర్స్‌కు స్థానం లభించగా.. విశాఖకు చెందిన ఏఎంటీజెడ్(మెడ్‌టెక్ జోన్) మెడ్‌వ్యాలీ ఇంక్యుబేషన్ సెంటర్‌కు స్థానం లభించింది. ఒకే రంగంపై అత్యధికంగా దృష్టిసారించడం, అనేక రకాల గ్రాంట్ ఇన్ ఎయిడ్స్ పొందడం, సీడ్ ఫండ్ గ్రాండ్స్ ఫండ్స్‌లో మంచి పనితీరు కనపర్చిన వాటిని ఈ విభాగం కింద ఎంపిక చేసింది. అదే విధంగా 6.5–7.5 మధ్య మార్కులు పొందిన వాటిని ఫ్రంట్ రన్నర్స్‌గా కేటాయించింది. ఈ విభాగంలో దేశవ్యాప్తంగా 22 ఇంక్యుబేటర్స్ ఎంపికకాగా, రాష్ట్రానికి చెందిన ఎస్కేయూ కాన్ఫడరేషన్ ఇంక్యుబేషన్ సెంటర్ చోటు దక్కించుకుంది. ఈ విభాగంలో ఎంపికైన ఇంక్యుబేటర్స్‌కు ఇన్పుట్స్, ప్రాసెస్‌లన్నీ ఉన్నాయని, కానీ భాగస్వాములను పెంచుకోవాల్సిన అవ సరం ఉందని నీతి ఆయోగ్ తన నివేదికలో సూచించింది. అటల్ ఇంక్యుబేటర్స్‌తో 35,000 మందికి ఉపాధి దేశవ్యాప్తంగా పరిశోధనలను నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి 2016లో 68 అటల్ ఇంక్యుబేషన్ సెంటర్స్‌ను ఏర్పాటుచేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు వీటి ద్వారా 3,200కు పైగా యాక్టివ్ స్టార్టప్స్ అభివృద్ధి చెందినట్టు నీతి ఆయోగ్ తన నివేదికలో పేర్కొంది. ఇందులో 30 శాతం స్టార్టప్స్ మహిళల నాయకత్వంలో ఉండటం గమనార్హం. ఈ అటల్ ఇంక్యుబేషన్ సెంటర్స్ ద్వారా 30,000 మందికి ఉపాధి అవకాశాలు కల్పించినట్టు నీతి ఆయోగ్ పేర్కొంది. దేశవ్యాప్తంగా 700 ఇంక్యుబేటర్స్ ఉండగా.. వాటిలో 450 ఇంక్యుబేటర్స్‌కు వివిధ మంత్రిత్వ శాఖల నుంచి, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రూ.2,100 కోట్ల వరకు ఆరి్థక మద్దతు లభించినట్టు వెల్లడించింది. ఇందులో 70 శాతం అంటే 1,500 కోట్లు ప్రభుత్వం నుంచే వస్తే, ప్రైవేటు రంగం నుంచి కేవలం 18 శాతం అంటే సుమారు రూ.400 కోట్లు మాత్రమే వచ్చింది. సీఎస్ఆర్ నిధుల కింద మరో 12 శాతం లభించింది. ఈ గణాంకాలు ప్రైవేటు రంగ పెట్టుబడులు మరింత పెరగాల్సిన ఆవశ్యకతను సూచిస్తోందని నీతి ఆయోగ్ తెలిపింది. -
డీఐపీపీ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానం
న్యూఢిల్లీ: కొత్త ఎంటర్ప్రెన్యూర్లు స్టార్టప్స్ స్థాపించుకునేందుకు కావలసిన వసతుల కల్పనలో గుజరాత్ నంబర్‌వన్‌గా నిలిచింది. ఆయా రాష్ట్రాల్లో స్టార్టప్‌ల ఏర్పాటుకున్న సానుకూల పరిస్థితులపై డీఐపీపీ (పారిశ్రామిక విధాన, ప్రోత్సాహక శాఖ) పరిశీలన జరిపి ర్యాంకింగ్స్ ఇచ్చింది. స్టార్టప్ పాలసీ, ఇంక్యుబేషన్ హబ్స్, ఇన్నోవేషన్స్, నియంత్రణా సవాళ్లు, ప్రొక్యూర్మెంట్, కమ్యూనికేషన్స్ తదితర విభాగాలకు సంబంధించి 27 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాలను పరిశీలించారు. పరిశీలన అనంతరం అత్యున్నతం, ఉన్నతం, అగ్రగామి, కాబోయే అగ్రగామి, వర్ధమాన రాష్ట్రం, ఆరంభకులు పేరిట రాష్ట్రాలకు ర్యాంకులు ఇచ్చారు. అన్ని విభాగాల్లో అగ్రస్థానంలో ఉన్న గుజరాత్ బెస్ట్ పెర్ఫామర్‌గా నిలిచింది. కర్ణాటక, కేరళ, ఒడిశా, రాజస్తాన్ టాప్ పెర్ఫామర్స్‌గా, ఏపీ, తెలంగాణ, బిహార్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ లీడర్లుగా, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, యూపీ, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలు యాస్పైరింగ్ లీడర్లుగా, అసోమ్, ఢిల్లీ, గోవాతో పాటు 8 రాష్ట్రాలు ఎమర్జింగ్ స్టేట్స్‌గా, చండీగఢ్, మణిపూర్, మిజోరం, నాగాలాండ్, పుదుచ్చేరి, సిక్కిం, త్రిపుర రాష్ట్రాలు బిగినర్స్‌గా నిలిచాయి. ఈ తరహా ర్యాంకింగ్‌లు రాష్ట్రాల్లో స్టార్టప్స్‌కు కావాల్సిన సానుకూల వాతావరణం ఏర్పడేందుకు తోడ్పడతాయని డీఐపీపీ సెక్రటరీ రమేశ్ అభిషేక్ చెప్పారు. ఏ రాష్ట్రాన్ని తక్కువ చేయడానికి ఈ ప్రక్రియ చేపట్టలేదని, కేవలం ప్రోత్సహించడానికే ర్యాంకింగ్లిచ్చామని వివరించారు. విధానపరమైన మద్దతు, ఇంక్యుబేషన్ కేంద్రాలు, సీడ్ ఫండింగ్, ఏంజిల్, వెంచర్ ఫండింగ్, సరళమైన నియంత్రణలతో పాటు వివిధ అంశాలను పరిశీలించి ర్యాంకులను రూపొందించామన్నారు. ఆన్లైన్ సమాచార కల్పన, నియంత్రణలను సరళీకరించడం, పబ్లిక్ ప్రొక్యూర్‌మెంట్‌కు ప్రాధాన్య మివ్వడం తదితర అంశాలపై రాష్ట్రాలు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఆయన సూచించారు. -
ఫ్యాప్సీ ఇంక్యుబేషన్ సెంటర్లు
♦ హైదరాబాద్, వైజాగ్‌లో ఏర్పాటు ♦ ఔత్సాహికులకు పూర్తిగా ఉచితం ♦ ఫ్యాప్సీ ప్రెసిడెంట్ రవీంద్ర మోడీ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : శతాబ్ది ఉత్సవాలను జరుపుకుంటున్న ఫ్యాప్సీ చరిత్రలో కీలక అధ్యాయానికి బీజం పడింది. ఔత్సాహిక యువతను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఇంకుబేషన్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఫ్యాప్సీ నిర్ణయించింది. ఈ మేరకు నీతి ఆయోగ్‌కు దరఖాస్తు చేసుకుంది. మూడు నాలుగు నెలల్లో అనుమతి రావొచ్చని ఫెడరేషన్ భావిస్తోంది. 10,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో రానున్న ఒక్కో సెంటర్‌కు కేంద్ర ప్రభుత్వం ఏటా రూ.2 కోట్లు చొప్పున అయిదేళ్లపాటు గ్రాంటు సమకూరుస్తుందని ఫ్యాప్సీ ప్రెసిడెంట్ రవీంద్ర మోడీ చెప్పారు. అంతే మొత్తంలో మ్యాచింగ్ గ్రాంటు అందించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాలను కోరతామన్నారు. 2017లో ఇంకుబేషన్ కేంద్రాలు కార్యరూపం దాలుస్తాయనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఫ్యాప్సీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ గౌర శ్రీనివాస్, వైస్ ప్రెసిడెంట్ అరుణ్ లుహారుకాతో కలిసి శుక్రవారమిక్కడ మీడియా ప్రతినిధులతో ఆయన ఈ విషయాలు చెప్పారు. స్టార్టప్స్‌లో పెట్టుబడులు.. హైదరాబాద్‌లో ఏర్పాటయ్యే ఇంక్యుబేషన్ కేంద్రం తయారీ, ఇంజనీరింగ్ రంగాలను ప్రోత్సహిస్తుంది. అలాగే వైజాగ్ లేదా విజయవాడలో రానున్న కేంద్రం వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాల్లోకి అడుగిడేవారికి తోడ్పాటు అందిస్తుంది. ఇక ఇంక్యుబేషన్ కేంద్రంలో ఔత్సాహికుల నుంచి ఎటువంటి అద్దె వసూలు చేయరు. ఇంటర్నెట్ వంటి సౌకర్యాలన్నీ ఉచితంగా కల్పిస్తారు. ఫ్యాప్సీలో రెండు రాష్ట్రాల్లో కలిపి వివిధ రంగాలకు చెందిన 3,200కు పైగా సభ్య కంపెనీలున్నాయి. విశేష అనుభవం కలిగిన పారిశ్రామికవేత్తలు... ఔత్సాహికుల వ్యాపార ఆలోచనలు కార్యరూపంలోకి వచ్చేందుకు వెన్నంటి ఉంటారు. అంతేగాక అత్యుత్తమ ఆలోచనల్లో ఫ్యాప్సీ సభ్యులు పెట్టుబడులు పెట్టే అవకాశం కూడా ఉంది. అంతేగాక స్టార్టప్స్‌కు బ్యాంకు నుంచి రుణం సమకూర్చేందుకు ఫ్యాప్సీ సహాయపడుతుంది. సహాయం కోసం హెల్ప్ డెస్క్.. మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకునేలా ఔత్సాహికులకు అవగాహన, శిక్షణ కార్యక్రమాలను చేపట్టాలని ఫ్యాప్సీ నిర్ణయించింది. ఇంటి వద్ద నుంచి పనిచేయగలిగే వ్యాపార అవకాశాలు, ఈ-కామర్స్ వంటి సమాచారాన్ని అందించనుంది. ఇక ఇప్పటికే ఫ్యాప్సీ కార్యాలయంలో ఉన్న హెల్ప్ డెస్క్‌ను పటిష్టం చేయనుంది. వివిధ వ్యాపారాల్లోకి అడుగిడేవారికి అవసరమైన సమగ్ర సమాచారాన్ని రంగాల వారీగా నిక్షిప్తం చేయనుంది. నిపుణులతో అధ్యయనం చేసి రూపొందించిన ఈ సమాచారాన్ని అందుబాటులో ఉంచుతుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చొరవతో వ్యాపారంలోకి వచ్చేవారికి రుణ లభ్యత సమస్య లేదని రవీంద్ర మోడీ అన్నారు. సమాచారం లేకపోవటమే అతిపెద్ద సమస్యగా పేర్కొన్నారు. విద్యా సంస్థలు, పరిశ్రమకు మధ్య ఉన్న అంతరాలను తొలగించేందుకు యూనివర్సిటీలతో కలిసి పనిచేస్తున్నట్టు చెప్పారు. -
తెలుగు రాష్ట్రాల్లో ఫాక్స్‌కాన్ యూనిట్లు
- హైదరాబాద్‌లో డేటా సెంటర్, ఏపీలో తయారీ యూనిట్ - ఐదేళ్లలో పది లక్షల ఉద్యోగాలు - వెల్లడించిన కంపెనీ చీఫ్ టెర్రీ న్యూఢిల్లీ: ఫాక్స్‌కాన్ టెక్నాలజీ గ్రూప్ హైదరాబాద్‌లో డేటా సెంటర్‌ను, ఇంక్యూబేటర్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నది. హైదరాబాద్‌తో పాటు ఢిల్లీ, ముంబై, బెంగళూరుల్లో వీటిని ఏర్పాటు చేస్తామని ఈ గ్రూప్ హెడ్ టెర్రీ గౌ చెప్పారు. ఫాక్స్‌కాన్ కంపెనీ యాపిల్ కోసం ఐఫోన్లను, ఐప్యాడ్లను, అమెజాన్ కోసం కిండిల్ ట్యాబ్‌లను, ఇతర కంపెనీలకు ట్యాబ్‌లను, తదితర ఎలక్ట్రానిక్ వస్తువులను కాంట్రాక్ట్ మాన్యుఫాక్చరింగ్ చేస్తోంది. 2020 కల్లా భారత్‌లో 10-12 తయారీ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నామని, కనీసం పది లక్షల ఉద్యోగాలను ఇవ్వనున్నామని భారత్‌లో స్వల్పకాల పర్యటన సందర్భంగా ఆయన వెల్లడించారు. ముందుగా ఆంధ్రప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్రల్లో తయారీ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని వివరించారు. యాపిల్, సిస్కో, డెల్, మైక్రోసాఫ్ట్, హ్యులెట్-ప్యాకార్డ్ తదితర కంపెనీలకు తైవాన్‌కు చెందిన ఈ సంస్థ కాంట్రాక్ట్ మాన్యుఫాక్చరర్‌గా వ్యవహరిస్తోంది. భారత్‌లో మొబైల్సే కాకుండా ట్యాబ్‌లు, టీవీలు, బ్యాటరీలు, రూటర్లు తదితర వస్తువులను ఉత్పత్తి చేయాలని యోచిస్తోంది.