ఫ్యాప్సీ ఇంక్యుబేషన్ సెంటర్లు
♦ హైదరాబాద్, వైజాగ్‌లో ఏర్పాటు
♦ ఔత్సాహికులకు పూర్తిగా ఉచితం
♦ ఫ్యాప్సీ ప్రెసిడెంట్ రవీంద్ర మోడీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : శతాబ్ది ఉత్సవాలను జరుపుకుంటున్న ఫ్యాప్సీ చరిత్రలో కీలక అధ్యాయానికి బీజం పడింది. ఔత్సాహిక యువతను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఇంకుబేషన్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఫ్యాప్సీ నిర్ణయించింది. ఈ మేరకు నీతి ఆయోగ్‌కు దరఖాస్తు చేసుకుంది. మూడు నాలుగు నెలల్లో అనుమతి రావొచ్చని ఫెడరేషన్ భావిస్తోంది. 10,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో రానున్న ఒక్కో సెంటర్‌కు కేంద్ర ప్రభుత్వం ఏటా రూ.2 కోట్లు చొప్పున అయిదేళ్లపాటు గ్రాంటు సమకూరుస్తుందని ఫ్యాప్సీ ప్రెసిడెంట్ రవీంద్ర మోడీ చెప్పారు. అంతే మొత్తంలో మ్యాచింగ్ గ్రాంటు అందించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాలను కోరతామన్నారు. 2017లో ఇంకుబేషన్ కేంద్రాలు కార్యరూపం దాలుస్తాయనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఫ్యాప్సీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ గౌర శ్రీనివాస్, వైస్ ప్రెసిడెంట్ అరుణ్ లుహారుకాతో కలిసి శుక్రవారమిక్కడ మీడియా ప్రతినిధులతో ఆయన ఈ విషయాలు చెప్పారు.
స్టార్టప్స్‌లో పెట్టుబడులు..
హైదరాబాద్‌లో ఏర్పాటయ్యే ఇంక్యుబేషన్ కేంద్రం తయారీ, ఇంజనీరింగ్ రంగాలను ప్రోత్సహిస్తుంది. అలాగే వైజాగ్ లేదా విజయవాడలో రానున్న కేంద్రం వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాల్లోకి అడుగిడేవారికి తోడ్పాటు అందిస్తుంది. ఇక ఇంక్యుబేషన్ కేంద్రంలో ఔత్సాహికుల నుంచి ఎటువంటి అద్దె వసూలు చేయరు. ఇంటర్నెట్ వంటి సౌకర్యాలన్నీ ఉచితంగా కల్పిస్తారు. ఫ్యాప్సీలో రెండు రాష్ట్రాల్లో కలిపి వివిధ రంగాలకు చెందిన 3,200కు పైగా సభ్య కంపెనీలున్నాయి. విశేష అనుభవం కలిగిన పారిశ్రామికవేత్తలు... ఔత్సాహికుల వ్యాపార ఆలోచనలు కార్యరూపంలోకి వచ్చేందుకు వెన్నంటి ఉంటారు. అంతేగాక అత్యుత్తమ ఆలోచనల్లో ఫ్యాప్సీ సభ్యులు పెట్టుబడులు పెట్టే అవకాశం కూడా ఉంది. అంతేగాక స్టార్టప్స్‌కు బ్యాంకు నుంచి రుణం సమకూర్చేందుకు ఫ్యాప్సీ సహాయపడుతుంది.
సహాయం కోసం హెల్ప్ డెస్క్..
మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకునేలా ఔత్సాహికులకు అవగాహన, శిక్షణ కార్యక్రమాలను చేపట్టాలని ఫ్యాప్సీ నిర్ణయించింది. ఇంటి వద్ద నుంచి పనిచేయగలిగే వ్యాపార అవకాశాలు, ఈ-కామర్స్ వంటి సమాచారాన్ని అందించనుంది. ఇక ఇప్పటికే ఫ్యాప్సీ కార్యాలయంలో ఉన్న హెల్ప్ డెస్క్‌ను పటిష్టం చేయనుంది. వివిధ వ్యాపారాల్లోకి అడుగిడేవారికి అవసరమైన సమగ్ర సమాచారాన్ని రంగాల వారీగా నిక్షిప్తం చేయనుంది. నిపుణులతో అధ్యయనం చేసి రూపొందించిన ఈ సమాచారాన్ని అందుబాటులో ఉంచుతుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చొరవతో వ్యాపారంలోకి వచ్చేవారికి రుణ లభ్యత సమస్య లేదని రవీంద్ర మోడీ అన్నారు. సమాచారం లేకపోవటమే అతిపెద్ద సమస్యగా పేర్కొన్నారు. విద్యా సంస్థలు, పరిశ్రమకు మధ్య ఉన్న అంతరాలను తొలగించేందుకు యూనివర్సిటీలతో కలిసి పనిచేస్తున్నట్టు చెప్పారు.