సాక్షి, అమరావతి : రాష్ట్రంలో స్టార్టప్‌లను ప్రోత్సహించడానికి ఏర్పాటు చేసిన ఇంక్యుబేషన్ సెంటర్లు అద్భుతమైన పనితీరుతో జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాయి. విశాఖ మెడ్‌టెక్ జోన్‌లో, అనంతపురం జిల్లా శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన ఇంక్యుబేషన్ సెంటర్లు నీతిఆయోగ్ ప్రకటించిన సర్వేలో అగ్రస్థానాలను దక్కించుకున్నాయి.
2021కి సంబంధించి నీతిఆయోగ్ 68 అటల్ ఇంక్యుబేషన్ సెంటర్స్ పనితీరును అధ్యయనం చేసి.. వచ్చిన మార్కుల ఆధారంగా నాలుగు కేటగిరీలుగా విభజించి నివేదిక విడుదల చేసింది. పదికి 7.5 కంటే ఎక్కువ మార్కులు సాధించిన వాటిని టాప్ పెర్ఫార్మ్స్‌గా నీతి ఆయోగ్ ప్రకటించింది. ఈ విభాగంలో దేశవ్యాప్తంగా 12 ఇంక్యుబేటర్స్‌కు స్థానం లభించగా.. విశాఖకు చెందిన ఏఎంటీజెడ్(మెడ్‌టెక్ జోన్) మెడ్‌వ్యాలీ ఇంక్యుబేషన్ సెంటర్‌కు స్థానం లభించింది.
ఒకే రంగంపై అత్యధికంగా దృష్టిసారించడం, అనేక రకాల గ్రాంట్ ఇన్ ఎయిడ్స్ పొందడం, సీడ్ ఫండ్ గ్రాండ్స్ ఫండ్స్‌లో మంచి పనితీరు కనపర్చిన వాటిని ఈ విభాగం కింద ఎంపిక చేసింది. అదే విధంగా 6.5–7.5 మధ్య మార్కులు పొందిన వాటిని ఫ్రంట్ రన్నర్స్‌గా కేటాయించింది. ఈ విభాగంలో దేశవ్యాప్తంగా 22 ఇంక్యుబేటర్స్ ఎంపికకాగా, రాష్ట్రానికి చెందిన ఎస్‌కేయూ కాన్ఫడరేషన్ ఇంక్యుబేషన్ సెంటర్ చోటు దక్కించుకుంది. ఈ విభాగంలో ఎంపికైన ఇంక్యుబేటర్స్‌కు ఇన్‌పుట్స్, ప్రాసెస్‌లన్నీ ఉన్నాయని, కానీ భాగస్వాములను పెంచుకోవాల్సిన అవ సరం ఉందని నీతి ఆయోగ్ తన నివేదికలో సూచించింది.
అటల్ ఇంక్యుబేటర్స్‌తో 35,000 మందికి ఉపాధి
దేశవ్యాప్తంగా పరిశోధనలను నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి 2016లో 68 అటల్ ఇంక్యుబేషన్ సెంటర్స్‌ను ఏర్పాటుచేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు వీటి ద్వారా 3,200కు పైగా యాక్టివ్ స్టార్టప్స్ అభివృద్ధి చెందినట్టు నీతి ఆయోగ్ తన నివేదికలో పేర్కొంది. ఇందులో 30 శాతం స్టార్టప్స్ మహిళల నాయకత్వంలో ఉండటం గమనార్హం. ఈ అటల్ ఇంక్యుబేషన్ సెంటర్స్ ద్వారా 30,000 మందికి ఉపాధి అవకాశాలు కల్పించినట్టు నీతి ఆయోగ్ పేర్కొంది.
దేశవ్యాప్తంగా 700 ఇంక్యుబేటర్స్ ఉండగా.. వాటిలో 450 ఇంక్యుబేటర్స్‌కు వివిధ మంత్రిత్వ శాఖల నుంచి, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రూ.2,100 కోట్ల వరకు ఆరి్థక మద్దతు లభించినట్టు వెల్లడించింది. ఇందులో 70 శాతం అంటే 1,500 కోట్లు ప్రభుత్వం నుంచే వస్తే, ప్రైవేటు రంగం నుంచి కేవలం 18 శాతం అంటే సుమారు రూ.400 కోట్లు మాత్రమే వచ్చింది. సీఎస్‌ఆర్ నిధుల కింద మరో 12 శాతం లభించింది. ఈ గణాంకాలు ప్రైవేటు రంగ పెట్టుబడులు మరింత పెరగాల్సిన ఆవశ్యకతను సూచిస్తోందని నీతి ఆయోగ్ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment