incubators
-
నీతిఆయోగ్ టాప్ పెర్ఫార్మెన్స్లో ‘విశాఖ ఏఎంటీజెడ్ ఇంక్యుబేషన్’కు చోటు
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో స్టార్టప్‌లను ప్రోత్సహించడానికి ఏర్పాటు చేసిన ఇంక్యుబేషన్ సెంటర్లు అద్భుతమైన పనితీరుతో జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాయి. విశాఖ మెడ్‌టెక్ జోన్లో, అనంతపురం జిల్లా శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన ఇంక్యుబేషన్ సెంటర్లు నీతిఆయోగ్ ప్రకటించిన సర్వేలో అగ్రస్థానాలను దక్కించుకున్నాయి. 2021కి సంబంధించి నీతిఆయోగ్ 68 అటల్ ఇంక్యుబేషన్ సెంటర్స్ పనితీరును అధ్యయనం చేసి.. వచ్చిన మార్కుల ఆధారంగా నాలుగు కేటగిరీలుగా విభజించి నివేదిక విడుదల చేసింది. పదికి 7.5 కంటే ఎక్కువ మార్కులు సాధించిన వాటిని టాప్ పెర్ఫార్మ్స్గా నీతి ఆయోగ్ ప్రకటించింది. ఈ విభాగంలో దేశవ్యాప్తంగా 12 ఇంక్యుబేటర్స్‌కు స్థానం లభించగా.. విశాఖకు చెందిన ఏఎంటీజెడ్(మెడ్‌టెక్ జోన్) మెడ్‌వ్యాలీ ఇంక్యుబేషన్ సెంటర్‌కు స్థానం లభించింది. ఒకే రంగంపై అత్యధికంగా దృష్టిసారించడం, అనేక రకాల గ్రాంట్ ఇన్ ఎయిడ్స్ పొందడం, సీడ్ ఫండ్ గ్రాండ్స్ ఫండ్స్‌లో మంచి పనితీరు కనపర్చిన వాటిని ఈ విభాగం కింద ఎంపిక చేసింది. అదే విధంగా 6.5–7.5 మధ్య మార్కులు పొందిన వాటిని ఫ్రంట్ రన్నర్స్‌గా కేటాయించింది. ఈ విభాగంలో దేశవ్యాప్తంగా 22 ఇంక్యుబేటర్స్ ఎంపికకాగా, రాష్ట్రానికి చెందిన ఎస్కేయూ కాన్ఫడరేషన్ ఇంక్యుబేషన్ సెంటర్ చోటు దక్కించుకుంది. ఈ విభాగంలో ఎంపికైన ఇంక్యుబేటర్స్‌కు ఇన్పుట్స్, ప్రాసెస్‌లన్నీ ఉన్నాయని, కానీ భాగస్వాములను పెంచుకోవాల్సిన అవ సరం ఉందని నీతి ఆయోగ్ తన నివేదికలో సూచించింది. అటల్ ఇంక్యుబేటర్స్‌తో 35,000 మందికి ఉపాధి దేశవ్యాప్తంగా పరిశోధనలను నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి 2016లో 68 అటల్ ఇంక్యుబేషన్ సెంటర్స్‌ను ఏర్పాటుచేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు వీటి ద్వారా 3,200కు పైగా యాక్టివ్ స్టార్టప్స్ అభివృద్ధి చెందినట్టు నీతి ఆయోగ్ తన నివేదికలో పేర్కొంది. ఇందులో 30 శాతం స్టార్టప్స్ మహిళల నాయకత్వంలో ఉండటం గమనార్హం. ఈ అటల్ ఇంక్యుబేషన్ సెంటర్స్ ద్వారా 30,000 మందికి ఉపాధి అవకాశాలు కల్పించినట్టు నీతి ఆయోగ్ పేర్కొంది. దేశవ్యాప్తంగా 700 ఇంక్యుబేటర్స్ ఉండగా.. వాటిలో 450 ఇంక్యుబేటర్స్‌కు వివిధ మంత్రిత్వ శాఖల నుంచి, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రూ.2,100 కోట్ల వరకు ఆరి్థక మద్దతు లభించినట్టు వెల్లడించింది. ఇందులో 70 శాతం అంటే 1,500 కోట్లు ప్రభుత్వం నుంచే వస్తే, ప్రైవేటు రంగం నుంచి కేవలం 18 శాతం అంటే సుమారు రూ.400 కోట్లు మాత్రమే వచ్చింది. సీఎస్ఆర్ నిధుల కింద మరో 12 శాతం లభించింది. ఈ గణాంకాలు ప్రైవేటు రంగ పెట్టుబడులు మరింత పెరగాల్సిన ఆవశ్యకతను సూచిస్తోందని నీతి ఆయోగ్ తెలిపింది. -
పార్లమెంటే అత్యుత్తమం: ఉపరాష్ట్రపతి
న్యూఢిల్లీ: దేశంలో పార్లమెంటే అత్యుత్తమమని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ తేల్చిచెప్పారు. రాజ్యాంగం మన పార్లమెంట్‌లోనే పురుడు పోసుకుందని గుర్తుచేశారు. రాజ్యాంగ రచనలో న్యాయ, కార్యనిర్వాహక వ్యవస్థ తదితరాల పాత్ర ఎంతమాత్రం లేదన్నారు. ప్రజల తీర్పును పార్లమెంట్ ప్రతిబింబిస్తుందని చెప్పారు. రాజ్యాంగ రూపశిల్పి పార్లమెంటేనని వివరించారు. తమిళనాడు మాజీ గవర్నర్ పీఎస్ రామ్మోహన్రావు జీవిత చరిత్ర గ్రంథాన్ని జగదీప్ ధన్‌ఖడ్ ఆదివారం పార్లమెంట్ ప్రాంగణంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా ధన్‌ఖడ్ మాట్లాడారు. సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో న్యాయమూర్తుల నియామకంపై కేంద్ర ప్రభుత్వం, న్యాయ వ్యవస్థ నడుమ వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో జగదీప్ ధన్‌ఖడ్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మరోవైపు, దేశాభివృద్ధిని చూసి ఓర్వలేకే కొందరు విదేశాలకు వెళ్లి మన దేశంపై విషం చిమ్ముతున్నారని, మన ప్రజాస్వామ్యంపై బురదజల్లడమే పనిగా పెట్టుకున్నారని ధన్‌ఖడ్ విమర్శించారు! అలాంటి వారికి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. భారత ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందంటూ కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ ఇటీవల బ్రిటన్‌లో చేసిన వ్యాఖ్యలపై ప్రస్తుతం పార్లమెంటులో దుమారం రేగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాహుల్ పేరు ప్రస్తావించకుండా ధన్‌ఖడ్ ఈ వ్యాఖ్యలు చేశారు. -
అస్పైర్.. ఆవిష్కరణలకు ఇన్స్పైర్
సాక్షి, హైదరాబాద్: కేంద్రం ప్రవేశపెట్టిన అస్పైర్(ఏ స్కీమ్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇన్నోవేషన్, రూరల్ ఇండస్ట్రీస్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్) ప్రభుత్వ పారిశ్రామికశిక్షణ సంస్థ(ఐటీఐ)లకు బాసటగా నిలవనుంది. గ్రామీణ యువతను సరికొత్త ఆవిష్కరణల బాటపట్టించడమే ఈ పథకం ఉద్దేశం. దీని కింద ఎంపికైన ఐటీఐలను అత్యాధునిక వసతులతో తీర్చిదిద్ది ఇక్కడ శిక్షణ పొందుతున్నవారికి సరికొత్త కార్యక్రమాలను పరిచయం చేయనుంది. అస్పై ర్ కింద సిరిసిల్ల, వనపర్తి, ఖమ్మం, నిజామాబాద్, మేడ్చల్, కరీంనగర్ ప్రభుత్వ ఐటీఐలు ఎంపికయ్యాయి. ఒక్కో ఐటీఐ ఖాతాలోకి రూ.50 లక్షల చొప్పున కేంద్రం జమ చేసింది. ఈ నిధులతో ఐటీఐల్లో లైవ్లీవుడ్ బిజినెస్ ఇంక్యుబేటర్(ఎల్బీఐ)లను కార్మిక, ఉపాధి కల్పన శాఖ ఏర్పాటు చేయనుంది. ఈ ఐటీఐలు సమీపంలోని పరిశ్రమలతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుని స్థానిక నేపథ్యంతో కూడిన సరికొత్త ఆవిష్కరణలు చేయనున్నాయి. త్వరలో మరిన్ని ఐటీఐలు ఈ పథకం పరిధిలోకి వచ్చే అవకాశముంది. ►సిరిసిల్ల ఐటీఐ: ఇక్కడ ఏర్పాటు చేయనున్న ఎల్బీఐ ప్రధానంగా చేనేత పరిశ్రమ ఆధారంగా పనిచేయనుంది. ఈ పరిశ్రమ ఉత్పత్తులు, మార్కెట్ సవాళ్లు, లక్ష్యాలు తదితర అంశాలను అధిగమించి ఆవిష్కరణలు చేసే అవకాశం ఉంది. ►వనపర్తి ఐటీఐ: స్థానిక రైతులకు సులభతర వ్యవసాయం, మార్కెటింగ్ అంశాలపై ఐటీఐ పనిచేయనుంది. స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహిస్తూ విత్తనోత్పత్తి, ఎరువులు, విత్తనాల తయారీపై దృష్టి పెట్టనుంది. ►ఖమ్మం ఐటీఐ: వెదురుకు ప్రసిద్ధమైన ఖమ్మం ప్రాంతంలో వెదురు దిగుబడుల ప్రాసెసింగ్‌తోపాటు వీటిపై ఆధారపడిన చేతివృత్తిదారులకు మెరుగైన వసతులు సమకూర్చేదిశగా ఈ ఐటీఐ పనిచేయనుంది. ►నిజామాబాద్ ఐటీఐ: వ్యవసాయ రంగానికి కేంద్రంగా ఉన్న నిజామాబాద్ ప్రాంత రైతాంగం కోసం శిక్షణ కార్యక్రమాలు ఇవ్వనుంది. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ, పుట్టగొడుగుల పెంపకం తదితర వాటిపై ఈ ఐటీఐలోని ఎల్బీఐ పనిచేయనుంది. ►మేడ్చల్ ఐటీఐ: నగరానికి చేరువలోని ఈ ప్రాంతంలో ఎక్కువగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఉన్నాయి. వీటిపై మరింత అవగాహన కలిగించడం, స్థానిక యువతకు ప్రాసెసింగ్ రంగంలో ఉపాధి అవకాశాలపై అవగాహన పెంచడం, వీటికి అనుబంధంగా శిక్షణ తరగతులు నిర్వహించడం వంటి వాటిని ఈ ఎల్బీఐ పర్యవేక్షిస్తుంది. ►కరీంనగర్ ఐటీఐ: ఇక్కడ వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు ఉన్నప్పటికీ, కుటీర పరిశ్రమల సంఖ్య కూడా గణనీయంగా ఉంది. వ్యవసాయ రంగంతో ముడిపడి ఉన్న కుటీర పరిశ్రమల ఏర్పాటుపై ఎల్బీఐ పనిచేస్తుంది. ఫుట్‌వేర్, ఆర్నమెంట్, అత్తరు పరిశ్రమలను ప్రోత్సహించే కార్యాచరణతో ముందుకు వెళ్లనుంది. పనితీరు పర్యవేక్షణకు ప్రత్యేక కమిటీలు అస్పైర్ పథకం అమలుతోపాటు ఎల్బీఐల పనితీరును పర్యవేక్షించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా రాష్ట్ర సలహాకమిటీ, పాలకమండలిని ఏర్పాటు చేసింది. రాష్ట్రస్థాయి సలహా కమిటీకి కార్మికమంత్రి చైర్మన్‌గా, స్పెషల్ చీఫ్ సెక్రటరీ సభ్యుడిగా, కమిషనర్ ఎంప్లాయిమెంట్ అండ్ ట్రైనింగ్ మెంబర్ కన్వీనర్‌గా, ఎంఎస్ఎంఈ డైరెక్టర్ జనరల్, ఉపాధి, శిక్షణ శాఖ జాయింట్ డైరెక్టర్ సభ్యులుగా కొనసాగుతారు. పాలక మండలి(గవర్నింగ్ బాడీ) చైర్మన్‌గా ఉపాధి శిక్షణా విభాగం కమిషనర్, కొనసాగుతారు. ఈ శాఖ జాయింట్ డైరెక్టర్ మెంబర్ కన్వీనర్‌గా, ఎన్ఎస్ఐసీ చీఫ్ మేనేజర్, ఎంఎస్ఎంఈ ప్రతినిధి, ఉపాధి, శిక్షణ డిప్యూటీ డైరెక్టర్లు సభ్యులుగా ఉంటారు. ఈ మేరకు కమిటీలను ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాణికుముదిణి ఉత్తర్వులు జారీ చేశారు. -
ఇంక్యుబేటర్లు, వార్మర్లు ఉన్నా.. సేవలు మాత్రం సున్నా
తణుకు, న్యూస్‌లైన్ : సుబ్బారావు భార్య లలితమ్మకు నెలలు నిండకుండానే బిడ్డ పుట్టాడు. వెంకట్రావు చెల్లెలు దుర్గమ్మ బిడ్డ తగిన బరువు లేదు. వాళ్లిద్దరూ తణుకు ఏరియూ ఆసుపత్రిలో పురుడు పోసుకున్నారు. ఆ శిశువుల్ని ఇంక్యుబేటర్స్‌లో పెట్టాలన్నారు. ఇందుకోసం ఆ ఆసుపత్రికి రెండు ఇంక్యుబేటర్లను ప్రభుత్వం సమకూర్చింది. ప్రసాద్, పద్మ దంపతుల బిడ్డకు కామెర్లు సోకారుు. వెంటనే వార్మర్లో పెట్టకపోతే బిడ్డ దక్కే పరిస్థితి ఉండదని డాక్టర్లు చెప్పారు. ప్రభుత్వాసుపత్రిలో ఇందుకోసం 8 వార్మర్లు ఉన్నారుు. కానీ.. వాటిని వినియోగించే నిపుణులు లేరు. వెంటనే ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లాలని సిబ్బంది హెచ్చరించారు. ఆ ముగ్గురూ తమ బిడ్డల్ని తీసుకుని ప్రైవేటు ఆసుపత్రులకు పరుగులు తీశారు. బిడ్డను ఇంక్యుబేటర్‌లో పెట్టాలన్నా.. వార్మర్లో ఉంచాలన్నా రోజుకు రూ.రెండు వేలు ఖర్చవుతుందని, బిడ్డను కనీసం మూడు నాలుగు రోజులపాటు వాటిలో ఉంచాలని వైద్యులు చెప్పారు. అప్పు తెచ్చిన సొమ్ములో రూ.500 సుబ్బారావు వద్ద మిగిలాయి. వెంకట్రావు దగ్గర రూ.200 ఉండగా, ప్రసాద్ వద్ద ఆటో ఖర్చుల కోసం తెచ్చుకున్న రూ.60 మాత్రమే ఉన్నారుు. ఏంచేయూలో ఆ ముగ్గురికీ తోచలేదు. తల తాకట్టు పెట్టరుునా డబ్బు తెస్తామని.. ఏదో రకంగా తమ బిడ్డలను బతికించాలని వైద్యుల కాళ్లావేళ్లా పడ్డారు. వారు సరేననడంతో ఆ ముగ్గురూ అప్పు కోసం తలో దిక్కుకు వెళ్లారు. తణుకు ఏరియూ ఆసుపత్రిలో రోజు ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నారుు. ప్రభుత్వం లక్షలాది రూపాయలను వెచ్చించి ఇంక్యుబేటర్లు, వార్మర్లను సమకూర్చినా చంటి బిడ్డలకు అక్కరకు రావడం లేదు. ఈ ఆసుపత్రికి తణుకు పరిసర ప్రాంతాల్లోని సుమారు 100 గ్రామాలకు చెందిన పేదలు వైద్యం కోసం వస్తుంటారు. సిద్ధాంతం, తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంతోపాటు తాడేపల్లిగూడెం తదితర ప్రాంతాల నుంచి వచ్చే రోగులు, గర్భిణుల సంఖ్య కూడా అధికమే. సత్వర వైద్య సేవలందిస్తారని ఈ ఆసుపత్రికి పేరుంది. ఇక్కడి సేవలను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం ఐదుసార్లు ఉత్తమ సేవా పురస్కారాలను ఈ ఆసుపత్రికి అందించింది. అరుునా.. ఇంక్యుబేటర్, వార్మర్ సేవలు ఇక్కడ అందటం లేదు. ఈ ఆసుపత్రిలో నెలకు సగటున 300నుంచి 350 మంది శిశువులు జన్మిస్తుంటారు. గతంలో చంటిపిల్లల వైద్యుడు ఉన్నా, అత్యవసర వైద్య పరికరాలు ఉండేవి కావు. ఇప్పుడు వైద్యపరికరాలతోపాటు పిల్లల వైద్యుడిని సమకూర్చినా చిన్నారులకు అత్యవసర వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురాలేకపోయారు. ఫలితంగా చంటిపిల్లలకు అత్యవసర వైద్యం అవసరమైతే పేదలు వేలాది రూపాయలు అప్పుచేసి ప్రైవేటు ఆసుపత్రులకు పరుగెట్టాల్సి వస్తోంది. ఈ విషయమై ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎం.వీరాస్వామిని వివరణ కోరగా.. చంటిపిల్లల వైద్య అత్యవసర పరికరాల విభాగంలో నిపుణుల్ని నియమించాల్సి ఉందన్నారు. అవసరమైన చర్యలు తీసుకుని నెల రోజుల్లో చంటి పిల్లల విభాగంలో అత్యవసర వైద్య సేవలను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెస్తామని చెప్పారు.