తణుకు, న్యూస్‌లైన్ : సుబ్బారావు భార్య లలితమ్మకు నెలలు నిండకుండానే బిడ్డ పుట్టాడు. వెంకట్రావు చెల్లెలు దుర్గమ్మ బిడ్డ తగిన బరువు లేదు. వాళ్లిద్దరూ తణుకు ఏరియూ ఆసుపత్రిలో పురుడు పోసుకున్నారు. ఆ శిశువుల్ని ఇంక్యుబేటర్స్‌లో పెట్టాలన్నారు. ఇందుకోసం ఆ ఆసుపత్రికి రెండు ఇంక్యుబేటర్లను ప్రభుత్వం సమకూర్చింది. ప్రసాద్, పద్మ దంపతుల బిడ్డకు కామెర్లు సోకారుు. వెంటనే వార్మర్‌లో పెట్టకపోతే బిడ్డ దక్కే పరిస్థితి ఉండదని డాక్టర్లు చెప్పారు. ప్రభుత్వాసుపత్రిలో ఇందుకోసం 8 వార్మర్లు ఉన్నారుు. కానీ.. వాటిని వినియోగించే నిపుణులు లేరు.
వెంటనే ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లాలని సిబ్బంది హెచ్చరించారు. ఆ ముగ్గురూ తమ బిడ్డల్ని తీసుకుని ప్రైవేటు ఆసుపత్రులకు పరుగులు తీశారు. బిడ్డను ఇంక్యుబేటర్‌లో పెట్టాలన్నా.. వార్మర్‌లో ఉంచాలన్నా రోజుకు రూ.రెండు వేలు ఖర్చవుతుందని, బిడ్డను కనీసం మూడు నాలుగు రోజులపాటు వాటిలో ఉంచాలని వైద్యులు చెప్పారు. అప్పు తెచ్చిన సొమ్ములో రూ.500 సుబ్బారావు వద్ద మిగిలాయి. వెంకట్రావు దగ్గర రూ.200 ఉండగా, ప్రసాద్ వద్ద ఆటో ఖర్చుల కోసం తెచ్చుకున్న రూ.60 మాత్రమే ఉన్నారుు. ఏంచేయూలో ఆ ముగ్గురికీ తోచలేదు. తల తాకట్టు పెట్టరుునా డబ్బు తెస్తామని.. ఏదో రకంగా తమ బిడ్డలను బతికించాలని వైద్యుల కాళ్లావేళ్లా పడ్డారు. వారు సరేననడంతో ఆ ముగ్గురూ అప్పు కోసం తలో దిక్కుకు వెళ్లారు. తణుకు ఏరియూ ఆసుపత్రిలో రోజు ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నారుు.
ప్రభుత్వం లక్షలాది రూపాయలను వెచ్చించి ఇంక్యుబేటర్లు, వార్మర్లను సమకూర్చినా చంటి బిడ్డలకు అక్కరకు రావడం లేదు. ఈ ఆసుపత్రికి తణుకు పరిసర ప్రాంతాల్లోని సుమారు 100 గ్రామాలకు చెందిన పేదలు వైద్యం కోసం వస్తుంటారు. సిద్ధాంతం, తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంతోపాటు తాడేపల్లిగూడెం తదితర ప్రాంతాల నుంచి వచ్చే రోగులు, గర్భిణుల సంఖ్య కూడా అధికమే. సత్వర వైద్య సేవలందిస్తారని ఈ ఆసుపత్రికి పేరుంది. ఇక్కడి సేవలను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం ఐదుసార్లు ఉత్తమ సేవా పురస్కారాలను ఈ ఆసుపత్రికి అందించింది. అరుునా.. ఇంక్యుబేటర్, వార్మర్ సేవలు ఇక్కడ అందటం లేదు. ఈ ఆసుపత్రిలో నెలకు సగటున 300నుంచి 350 మంది శిశువులు జన్మిస్తుంటారు. గతంలో చంటిపిల్లల వైద్యుడు ఉన్నా, అత్యవసర వైద్య పరికరాలు ఉండేవి కావు. ఇప్పుడు వైద్యపరికరాలతోపాటు పిల్లల వైద్యుడిని సమకూర్చినా చిన్నారులకు అత్యవసర వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురాలేకపోయారు.
ఫలితంగా చంటిపిల్లలకు అత్యవసర వైద్యం అవసరమైతే పేదలు వేలాది రూపాయలు అప్పుచేసి ప్రైవేటు ఆసుపత్రులకు పరుగెట్టాల్సి వస్తోంది. ఈ విషయమై ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎం.వీరాస్వామిని వివరణ కోరగా.. చంటిపిల్లల వైద్య అత్యవసర పరికరాల విభాగంలో నిపుణుల్ని నియమించాల్సి ఉందన్నారు. అవసరమైన చర్యలు తీసుకుని నెల రోజుల్లో చంటి పిల్లల విభాగంలో అత్యవసర వైద్య సేవలను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెస్తామని చెప్పారు.
ఇంక్యుబేటర్లు, వార్మర్లు ఉన్నా.. సేవలు మాత్రం సున్నా
Published Wed, Dec 11 2013 1:15 AM | Last Updated on Sat, Sep 2 2017 1:27 AM
Advertisement