న్యూయార్క్ : మహిళలు,పురుషులు సమానం.. ఇద్దరూ సమాన హక్కులు కలిగి ఉండాలి. ప్రతి నిర్ణయంలో ఇద్దరూ భాగస్వాములు అయితేనే ఏ పనైనా విజయవంతమవుతుందని అంటుంటారు. అయితే పెద్ద పెద్ద కార్పొరేట్ బోర్డులోనే లింగవివక్ష కొనసాగుతోంది. ఈ అసమానతలను పరిష్కరించడానికి సగం మంది మహిళలు కార్పొరేట్ బోర్డు డైరెక్టర్లుగా ఉండాలనే అభిప్రాయ సేకరణ సర్వేలో, కేవలం 10 శాతం మంది పురుషులే ఆమోదం తెలిపారు.
హార్వర్డ్ బిజినెస్ స్కూల్, మహిళల కార్పొరేట్ డైరెక్టర్స్ ఫౌండేషన్ సంయుక్తంగా ఈ సర్వే నిర్వహించింది. బోర్డు అపాయింట్ మెంట్లు ఎలా జరుగుతాయనే దానికి, జెండర్ నే ప్రధాన అంశంగా తీసుకుంటున్నారని 39 శాతం మహిళలు అభిప్రాయాలు వ్యక్తం చేశారు. కేవలం ఒక్క శాతం పురుషులు మాత్రమే మహిళలకు, పురుషులకు సమానహోదా కల్గిస్తున్నారని పేర్కొన్నారు. మహిళల బోర్డు సభ్యత్వం తక్కువగా ఉంటుందని ఈ సర్వేలో తేలింది.
మహిళల్లో తక్కువ నైపుణ్యాలు ఉండటం వల్లే బోర్డు డైరెక్టర్ పదవుల్లో ఉండటం లేదని వయస్సు పైబడిన పురుష డైరెక్టర్లు అంటున్నారు. కానీ బోర్డు ప్రాధాన్యత ప్రకారం నుంచి బోర్డు డైరెక్టర్ పదవులు ఇవ్వడం లేదని, పాత కాలం నుంచి వస్తున్న పురుష ఆధిక్య సమాజం వల్లే బోర్డులో మహిళలకు ప్రాతినిధ్యం కల్పించడం లేదని సర్వేల్లో తేలింది. 49 శాతం మంది మహిళా డైరెక్టర్లు బోర్డు వైవిధ్యాన్ని ప్రోత్సహిస్తున్నారని, కానీ 9శాతం మందే దీనికి మద్దతిస్తున్నారని సర్వే పేర్కొంది.
ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఎనిమిది కార్పొరేట్ బోర్డు సీట్లలో కేవలం ఒక్కరే మహిళ ఉంటున్నారని గ్లోబల్ రీసెర్చింగ్ సంస్థ డెలాయిట్ తెలిపింది. 49 దేశాల్లో బోర్డు సభ్యత్వంపై డెలాయిట్ సర్వే జరిపింది. పలు యూరోపియన్ దేశాల్లో వచ్చే నాలుగేళ్లలో 40 శాతం మహిళలు కార్పొరేట్ బోర్డులో ప్రాతినిధ్యం వహించేలా యూరోపియన్ కమిషన్ బోర్డు కోటాలు నిర్ణయించింది.