యూరోపియన్‌ సంస్థతో...హెరిటేజ్‌ ఫుడ్స్‌ జట్టు | Heritage Foods Limited to enter into joint venture with an European dairy firm | Sakshi
Sakshi News home page

యూరోపియన్‌ సంస్థతో...హెరిటేజ్‌ ఫుడ్స్‌ జట్టు

Published Tue, Apr 25 2017 12:18 AM | Last Updated on Thu, Jul 11 2019 8:00 PM

యూరోపియన్‌ సంస్థతో...హెరిటేజ్‌ ఫుడ్స్‌ జట్టు - Sakshi

యూరోపియన్‌ సంస్థతో...హెరిటేజ్‌ ఫుడ్స్‌ జట్టు

నెల రోజుల్లో ఒప్పందం ఖరారు
► విపణిలోకి కొత్త బేవరేజెస్‌ ఉత్పత్తులు
► ఐదేళ్లలో 6 వేల కోట్ల ఆదాయం లక్ష్యం
► రూ.150 కోట్లతో కొత్తగా 5 పాల ప్రాసెసింగ్‌ ప్లాంట్లు
► హెరిటేజ్‌ ఫుడ్స్‌ ఈడీ నారా బ్రాహ్మణి  


హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబానికి చెందిన హెరిటేజ్‌ ఫుడ్స్‌ లిమిటెడ్‌.. యూరప్‌నకు చెందిన ప్రముఖ డెయిరీ సంస్థతో సంయుక్త భాగస్వామ్య (జేవీ) ఒప్పందం కుదుర్చుకోనుంది. ఒప్పంద చర్చలు ముగింపు దశలో ఉన్నాయని.. నెల లేదా 6 వారాల్లో ఒప్పందం ఖరారవుతుందని హెరిటేజ్‌ ఫుడ్స్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఎఫ్‌ఎల్‌) ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ (ఈడీ) నారా బ్రాహ్మణి తెలిపారు. ఈ కొత్త భాగస్వామ్యం సాంకేతికత, బ్రాండింగ్, మార్కెటింగ్‌ మూడు విభాగాల్లోనూ ఉంటుందని, అలాగే ప్రస్తుతమున్న హెరిటేజ్‌ ఫుడ్స్‌ ఉత్పత్తులతో పాటు విపణిలోకి కొత్తగా బేవరేజెస్‌ ఉత్పత్తులను పరిచయం చేస్తామని తెలియజేశారు.

హెరిటేజ్‌ ఫుడ్స్‌ ఈ మధ్యే రిలయన్స్‌ డెయిరీని కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. మరిన్ని కొనుగోళ్లకు తాము సిద్ధంగా ఉన్నామని, సంస్థను మరింత విస్తరిస్తామని చెప్పారామె. హెరిటేజ్‌ ఫుడ్స్‌ ఏర్పాటై 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా బ్రాహ్మణితో కలసి హెరిటేజ్‌ ఫుడ్స్‌ వైస్‌ చైర్‌పర్సన్, చంద్రబాబు నాయుడి సతీమణి నారా భువనేశ్వరి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హెరిటేజ్‌ ఫుడ్స్‌ కొత్త లోగో, ప్యాకేజింగ్‌లను విడుదల చేశారు. బ్రాహ్మణి మాట్లాడుతూ.. ‘‘ఈ ఆర్ధిక సంవత్సరం ఫలితాలింకా వెల్లడించాల్సి ఉంది. 2015–16 ఆర్ధిక సంవత్సరంలో రూ.2,380 కోట్ల టర్నోవర్‌ను చేరుకున్నాం.

వచ్చే ఐదేళ్లలో మూడింతల వృద్ధితో రూ.6 వేల కోట్ల టర్నోవర్‌ను లక్ష్యించాం’’ అని చెప్పారు. ప్రస్తుతం హెరిటేజ్‌ ఫుడ్స్‌ నుంచి విపణిలో పాలు, పెరుగు, నెయ్యి, పన్నీరు, ఐస్‌క్రీమ్, బటర్‌ మిల్క్, ఫ్లేవర్డ్‌ మిల్క్‌ తదితర ఉత్పత్తులున్నాయి. మా మొత్తం ఆదాయంలో 10–12 శాతం వాటా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలది. ఉత్పత్తుల పరంగా చూస్తే పెరుగు వాటానే అత్యధికం. గత ఐదేళ్లుగా ఏటా 18 శాతం వృద్ధి రేటును సా«ధించాం. అంతర్జాతీయ కంపెనీతో భాగస్వామ్యం, ఇతర పెట్టుబడులతో వచ్చే ఐదేళ్లలో 25 శాతం వార్షిక వృద్ధి రేటును సాధిస్తామని బ్రాహ్మణి ధీమా వ్యక్తం చేశారు.

రూ.150 కోట్లతో 5 ప్రాసెసింగ్‌ యూనిట్లు..
ప్రస్తుతం హెచ్‌ఎఫ్‌ఎల్‌ ఉత్పత్తులు దక్షిణ, ఉత్తరాదిలోని 15 రాష్ట్రాల్లో అందుబాటులో ఉన్నాయి. తాజాగా దేశవ్యాప్తంగా విస్తరించాలని లక్ష్యంచింది. ఇందులో భాగంగానే మరో 5 రాష్ట్రాల్లో 5 పాల ప్రాసెసింగ్‌ ప్లాంట్లను నెలకొల్పనుంది. ఒక్కో ప్లాంట్‌పై రూ.25–30 కోట్లు చొప్పున.. మొత్తం రూ.150 కోట్లతో ఈ ప్లాంట్లను ఏర్పాటు చేయనుంది. దీంతో ప్రస్తుతం రోజుకు 3.5 లక్షల మంది రైతుల నుంచి 14 లక్షల లీటర్ల పాలను సేకరిస్తున్న హెచ్‌ఎఫ్‌ఎల్‌ సామర్థ్యం.. కొత్త యూనిట్ల అనంతరం 25–30 లక్షల లీటర్లకు చేరుతుందని బ్రాహ్మణి వివరించారు. కార్యక్రమంలో హెరిటేజ్‌ ఫుడ్స్‌ లిమిటెడ్‌ చైర్మన్‌ సీతారామయ్య, ప్రెసిడెంట్‌ సాంబశివరావు, డైరెక్టర్‌ నాగరాజా నాయుడు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement