సైకిల్ 'హీరో' ఇక లేరు
ప్రముఖ పారిశ్రామికవేత్త, హీరో సైకిల్స్ అధినేత ఓం ప్రకాష్ ముంజాల్ (86) గుండెపోటుతో గురువారం కన్నుమూశారు. సైకిల్ తయారీ సంస్థలకు ఆయనే ఆద్యుడు. ఒక విధంగా సైకిళ్ల వ్యాపారానికి పితామహుడి లాంటివారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన లూథియానాలోని దయానంద్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ఆయనకు ఒక కొడుకు నలుగురు కుమార్తెలు ఉన్నారు.
హీరో సైకిల్స్ వ్యవస్థాపక ఛైర్మన్ కూడా అయిన ముంజాల్.. సంస్థను అభివృద్ధి పథంలో పరుగులు పెట్టించారు. అనేక సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. పేదవారి కోసం పాఠశాలలు, ఆసుపత్రి నిర్వహించడంలో ఆయనకు మంచిపేరు ఉంది.
1956లో పంజాబ్లోని లూథియానాలో మొదలుపెట్టిన ఈ సంస్థ దినాదినాభివృద్ధి చెందుతూ వచ్చింది. రికార్డ్ అమ్మకాలతో, దేశంలో అత్యధిక మార్కెట్ షేర్ సాధించి 1986 సంవత్సరంలో గిన్నిస్ బుక్ లోకి కూడా ఎక్కింది. రోజుకు 25 సైకిళ్లను తయారీతో మొదలు పెట్టిన తన ప్రస్థానాన్ని ప్రస్తుతం 19 వేల సైకిళ్ల తయారీతో కొనసాగిస్తోంది. కాగా ముంజాల్ మృతిపై పలువురు పారిశ్రామికవేత్తలు విచారం వ్యక్తం చేశారు. ముంజాల్ అంత్యక్రియలను శుక్రవారం నిర్వహించనున్నామని కుటుంబసభ్యులు తెలిపారు.