(న్యూఢిల్లీ నుంచి డి.శాయి ప్రమోద్) :దేశీయ ఆటో రంగం రాబోయే పండుగ సీజన్‌పై కోటి ఆశలు పెట్టుకుందని, ఈ సీజన్‌లో విక్రయాలు ఊపందుకుంటాయని భావిస్తున్నామని హోండా మోటర్‌సైకిల్స్, స్కూటర్ ఇండియా సీఈఓ మినోరు కాటో చెప్పారు. ఈ ఏడాది కూడా రుతుపవనాలు ఫెయిలైతే ఆటో కంపెనీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటాయన్నారు. గత సెప్టెంబర్ నుంచి ఆటో మొబైల్ కంపెనీల విక్రయాలు క్షీణిస్తూ వస్తున్నాయని, గ్రామీణ ఆర్థికవ్యవస్థలో సంక్షోభమే ఇందుకు ప్రధాన కారణమని అభిప్రాయపడ్డారు. పండుగసీజన్ బాగున్నా ప్రథమార్ధంలో మందగమనం కారణంగా 2019–20లో ఆటో విక్రయాల్లో పెద్దగా వృద్ధి ఉండకపోవచ్చని అంచనా వేస్తున్నట్లు చెప్పారాయన. పరిస్థితులు బాగాలేకున్నా, పండుగ సీజన్‌పై ఆశలతో కొత్త వాహనాన్ని తీసుకువచ్చామని తెలియజేశారు. జీడీపీ వృద్ధి, విద్యుత్ వాహనాలు, ప్రభుత్వ పాలసీలు, కొత్త పెట్టుబడులు, నూతన వాహనాల విడుదల తదితర అంశాలపై సంస్థ వైస్‌ప్రెసిడెంట్ యద్వీందర్ సింగ్ గులేరియాతో కలిసి ‘సాక్షి’ బిజినెస్ బ్యూరో ప్రతినిధితో ఆయన మాట్లాడారు. విశేషాలివీ...
‘బీఎస్–6’ అమలు ఇబ్బందికరమే...
2025 నుంచి ద్విచక్ర వాహనాలకు సంబంధించి 150 సీసీ దిగువ విభాగాల్లో విద్యుత్ వాహనాలను మాత్రమే విక్రయించాలని కేంద్రం ప్రతిపాదిస్తోంది. అంటే ఇప్పటివరకు బాగా పాపులరైన 100, 110, 125 సీసీ పెట్రోల్ ఇంజిన్ వాహనాల ఉత్పత్తిని పూర్తిగా నిలిపివేయాల్సి ఉంటుంది. దీంతోపాటు 2020 ఏప్రిల్ 1 నుంచి బీఎస్–6 నిబంధనలకు అనుగుణంగా ఉండే ద్విచక్రవాహనాలనే ఉత్పత్తి చేయాల్సి ఉంది. ఈ డెడ్‌లైన్‌ను అందుకునేందుకు ఆటో కంపెనీలు ఉత్పత్తి ప్లాట్‌ఫామ్‌లను మార్చుకుంటున్నాయి. ఒకపక్క విక్రయాలు బాగా దెబ్బతిన్న ఈ సందర్భంలో ఇంత హడావుడిగా కొత్త నిబంధనలను అమలు చేయడం చాలా ఇబ్బందికరమే. యూరప్ దేశాల్లో యూరో 5 నిబంధనలకు మారేందుకు చాలా గడువిచ్చారు. కానీ ఇక్కడ కేవలం మూడునాలుగేళ్లలో మారాల్సి వస్తోంది. ఈ మార్పు కారణంగా వాహనాల ధరలు పెంచాల్సి వస్తుంది. ఇది విక్రయాలపై మరింత ప్రభావం చూపవచ్చు. ఈ విషయమై ఎస్‌ఐఏఎంతో కలిసి ప్రభుత్వాన్ని సంప్రతిస్తాం. ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ భారత్‌లో చాలా బలహీనంగా ఉంది. తక్కువ దూరాలు తిరిగే మార్కెట్లలో ఈవీలకు ఉన్నంత ఆదరణ ఇక్కడ ఉండదు. దేశీయ మార్కెట్లో ఈవీలను ప్రవేశపెట్టడం చాలా పెద్ద సవాలు, ఈ విషయమై ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
బీఎస్–4 ఉత్పత్తిని కొనసాగిస్తాం...
క్రమంగా కంపెనీ ఉత్పత్తులన్నింటినీ బీఎస్–6 నిబంధనలకు అనుగుణంగా మారుస్తాం. అయితే బీఎస్ 4 ప్లాట్‌ఫామ్‌పై ఉత్పత్తిని కొనసాగిస్తూనే ఉంటాం. ఈ వాహనాలను ఇతర దేశాలకు ఎగుమతి చేస్తాం. ప్రభుత్వ హడావుడి, విక్రయాల మందగమనం కారణంగా ఉత్పత్తి సామర్ధ్య విస్తరణపై పునరాలోచిస్తాం. కొత్త మోడళ్లు, ఆర్‌అండ్‌డీపై మాత్రం కొత్త పెట్టుబడులు కొనసాగిస్తాం. ఇప్పటికే ఆరంభించిన గుజరాత్ ప్లాంట్ విస్తరణ పనులు పూర్తిచేస్తాం.
తెలుగురాష్ట్రాల్లో అగ్రస్థానం
దక్షిణాదిన, ప్రధానంగా ఏపీ, తెలంగాణాల్లో స్కూటర్ల అమ్మకాల పరంగా అగ్రస్థానంలో ఉన్నాం. రెండు రాష్ట్రాల్లో అమ్మకాలు పెంచేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నాం. హైదరాబాద్‌లో రోడ్‌సేఫ్టీ అవగాహనా కార్యక్రమాన్ని రెండేళ్లుగా కొనసాగిస్తున్నాం. తాజాగా విడుదల చేసిన బీఎస్6 అనుకూల యాక్టివా 125సీసీ విక్రయాలను రెండో త్రైమాసికంలో ఆరంభిస్తాం. దీని ధర ఇప్పటి హోండా 125 సీసీ కన్నా 10– 15 శాతం అధికంగా ఉంటుంది. బీఎస్6 వాహనాలతో 2020 చివరకు తమ వాహనాల ద్వారా ఉత్పత్తయ్యే కార్బన్‌డైఆక్సైడ్‌ను 30 శాతం మేర తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.
వర్షాలు బాగుంటేనే రికవరీ...
దేశీయ ఎకానమీ కీలక సంధి దశలో ఉంది. ఈ దఫా వర్షపాతం సరిగ్గా ఉంటే గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో రికవరీ వస్తుంది, ఇప్పటివరకు తీసుకువచ్చిన సంస్కరణలు సత్ఫలితాలిస్తాయి. జీడీపీ అంచనాల కన్నా తక్కువ నమోదవుతోంది, నిజానికి అసలు వృద్ధి అంతకన్నా తక్కువ, 5–6 శాతమే ఉండొచ్చు. కానీ ఇతర వర్ధమాన దేశాలతో పోలిస్తే భారత ఎకానమీ నెమ్మదిగానైనా వృద్ధి బాటలోనే పయనిస్తోంది. ఇది మరింత జోరందుకోవాలంటే వినియోగంలో ఊపు రావాల్సి ఉంది. సమీప భవిష్యత్‌లో జీఎస్‌టీ శ్లాబుల తగ్గింపు ఉండకపోవచ్చు. ఎన్‌బీఎఫ్‌సీ సంక్షోభం రూరల్ అమ్మకాలను బాగా దెబ్బతీసింది. ప్రభుత్వం ఈ సంక్షోభాన్ని పరిష్కరించకుంటే ఎకానమీలో మరిన్ని రంగాలకు విస్తరించే ప్రమాదం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment