హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: భాగ్యనగరిలో ఇళ్ల ధరలు పైపైకి వెళ్తున్నాయి. 2013తో పోలిస్తే 26 శాతం ధర అధికమైందని ప్రాపర్టీ కన్సల్టింగ్ కంపెనీ అనరాక్ తన నివేదికలో వెల్లడించింది. గతంలో ఇన్వెస్టర్లలో సెంటిమెంటు బలహీనంగా ఉన్నా, ప్రత్యేక తెలంగాణ ఉద్యమం జరిగినప్పటికీ ధరల్లో పెరుగుదల ఉందని తెలియజేసింది. ‘జనాభాతోపాటు ఐటీ, ఐటీ సర్వీసుల కంపెనీలకు హైదరాబాద్ కేంద్రం. నివాసయోగ్యం కూడా. మెగాసిటీగా త్వరితగతిన అవతరణ చెందుతోంది. ఔటర్ రింగ్ రోడ్డు కారణంగా నగరం వెలుపల అభివృద్ధి ఊపందుకుంది. ఈ ప్రయోజనాలను భాగ్యనగరి అందిపుచ్చుకుంది. విభిన్న మార్గాల్లో అభివృద్ధికి ఆస్కారం ఏర్పడింది’ అని అనరాక్ చైర్మన్ అనుజ్ పూరీ వెల్లడించారు.
ఏటా 5 శాతం వృద్ధి..: నివేదిక ప్రకారం 2012–17 కాలంలో హైదరాబాద్‌లో రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్‌లో సగటు ధరలు ఏటా 5 శాతం పెరిగాయి. ఐటీలో ఉద్యోగాలు అధికం కావడంతో మార్కెట్ సెంటిమెంటు బలపడింది. దీని కారణంగా ప్రధానంగా వెస్ట్ జోన్లో ఇళ్ల అమ్మకాలు జోరందుకున్నాయి. 2016తో పోలిస్తే 2017లో ఇళ్ల విక్రయాల్లో 21 శాతం వృద్ధి నమోదైంది. అమ్మకానికి నోచుకోని (ఇన్వెంటరీ) ఇళ్ల సంఖ్య 2017 నుంచి తగ్గుముఖం పట్టింది.
ఈ విషయంలో దేశంలో ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే భాగ్యనగరి ఉత్తమంగా ఉంది. 2016 రెండో త్రైమాసికంలో ఇన్వెంటరీ 35,560 యూనిట్లు నమోదైంది. 2017 వచ్చేసరికి ఇది 14 శాతం తగ్గింది. 2018 రెండో త్రైమాసికం వచ్చేసరికి మరో 13 శాతం తగ్గింది. 2016 తర్వాత గృహ అమ్మకాల్లో మంచి వృద్ధి సుస్పష్టంగా ఉంది. భారీ పెట్టుబడుల రాక, మౌలిక వసతులు మెరుగు పడడంతో హైదరాబాద్‌కు పునరుజ్జీవం వచ్చిందని నివేదిక పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment