ఇటీవలే రూ.7000 కోట్లను విరాళంగా ప్రకటించిన భారతీ ఎయిర్‌టెల్ చైర్మన్ సునిల్ మిట్టల్, ఒకానొక సమయంలో రూ.5000 కోసం అభ్యర్థించే దీన స్థితిలోకి వెళ్లిన పరిస్థితులు ఉన్నాయి. సైకిల్ విడిభాగాల వ్యాపారాలకు ఓనర్‌గా ఉండే సునిల్ మిట్టల్, ప్రస్తుతం భారతీ ఎయిర్‌టెల్‌తో టెలికమ్యూనికేషన్ ప్రపంచాన్నే మార్చేశారు. ఒకానొక సమయంలో తన వద్ద డబ్బే ఉండేది కాదంటూ ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న రోజుల్ని గుర్తుచేసుకున్నారు. రూ.5000 కోసం బ్రిజ్‌మోహన్ లాల్ ముంజల్‌ను ఆశ్రయించానని తెలిపారు. '' అంకుల్ నాకు రూ.5000 కావాలి'' అని కోరానని, తన ఇన్‌వాయిస్‌లు తీసుకుని, అవసరమైన మొత్తాన్ని ఇచ్చారని పేర్కొన్నారు. సరిగ్గా ఆ సమయంలో బ్రిజ్‌మోహన్ చెప్పిన మాటలు తన హృదయాన్ని తాకాయని.. వెళ్లి పోయే సమయాన్ని తనని ఆపిన బ్రిజ్‌మోహన్...ఇదే అలవాటుగా మార్చుకోకు అంటూ గట్టి సలహా ఇచ్చారని తెలిపారు.
ఢిల్లీలో జరిగిన టైకాన్ సదస్సులో మాట్లాడుతూ ఆయన తన వ్యాపార ప్రయాణంలో ఎదుర్కొన్న సవాళ్లను, ఇబ్బందులను గుర్తు చేసుకున్నారు. అదేవిధంగా ఆఫ్రికాలో అడుగుపెట్టాలనుకోవడం కూడా తప్పయిందని పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. ఆఫ్రికాలో అడుగుపెట్టాలన్నది కొంత తొందరపాటు నిర్ణయమేననీ, దీనివల్ల వ్యాపారాన్ని దారిలో పెట్టేందుకు కొన్ని సంవత్సరాల పాటు తాను భారీ స్థాయిలో నిధులను తన వ్యక్తిగత సమయాన్నీ ఖర్చుచేయాల్సి వచ్చిందని సునిల్ మిట్టల్ చెప్పారు. ''తప్పు చేయడం మానవ సహజం. అందరూ చేస్తూనే ఉంటారు. వెనుదిరిగి చూసుకుంటే, అప్పుడలా చేసి ఉండాల్సి కాదు.. మరింత ఆలోచించి ఉంటే బాగుండేది.. అనిపించే సందర్భాలు అందరి జీవితాల్లోనూ ఉంటాయి'' అని మిట్టల్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment