పన్ను ఆదాకు ఏం చేద్దాం! | How o do with tax savings! | Sakshi
Sakshi News home page

పన్ను ఆదాకు ఏం చేద్దాం!

Published Mon, Dec 18 2017 1:35 AM | Last Updated on Mon, Dec 18 2017 1:35 AM

How o do with tax savings! - Sakshi

ఈ ఆర్థిక సంవత్సరం మరో ఐదు నెలల్లో ముగిసిపోతోంది. చివరి నిమిషంలో పన్ను ఆదాకోసం పరుగులు పెట్టే కంటే ముందుగానే స్పందిస్తే మెరుగైన పెట్టుబడి సాధనాన్ని ఎంచుకోవచ్చన్నది నిపుణుల మాట. ఎందుకంటే ఎంచుకునే అవకాశం, సమయం చేతిలో ఉంటాయి. సెక్షన్‌ 80సీ కింద వార్షికంగా రూ.1.50 లక్షల పెట్టుబడులపై పన్ను మినహాయింపులున్న విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 80సీ పరిధిలో పెట్టుబడి సాధనాలు చాలానే ఉన్నాయి. ఏదో ఒకదానిలో పెట్టేయకుండా సరైన పథకాన్ని ఎంచుకోవడం వల్ల కాస్త మెరుగైన రాబడులు అందుకోవచ్చు. ఇందుకోసం అందుబాటులో ఉన్న సాధనాలు, వాటి రాబడులు ఏ విధంగా ఉంటాయన్నది తెలియజేసేదే ఈ కథనం. – సాక్షి, పర్సనల్‌ ఫైనాన్స్‌ విభాగం


ఈఎల్‌ఎస్‌ఎస్‌
ఈక్విటీ లింక్డ్‌ సేవింగ్స్‌ స్కీమ్‌. ఇవి మ్యూచువల్‌ ఫండ్‌ పథకాలు. సెక్షన్‌ 80సీ కింద అనుమతించిన మేర గరిష్టంగా ఏడాదికి రూ.1.5 లక్షల మేర వీటిల్లో ఇన్వెస్ట్‌ చేసి పన్ను మినహాయింపు పొందే అవకాశం ఉంది. ఇతర ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్‌ పథకాల్లానే ఈఎల్‌ఎస్‌ఎస్‌లలో కూడా రాబడులకు హామీ ఉండదు. దీర్ఘకాలంలో 12 నుంచి 18 శాతం మధ్యలో రాబడులను పొందడానికి అవకాశం ఉంటుందని గణాంకాల ఆధారంగా అర్థం చేసుకోవచ్చు. పన్ను ఆదా చేసే పథకాల్లో అతి తక్కువ లాకిన్‌ పీరియడ్‌... అంటే మూడేళ్లున్నది ఈఎల్‌ఎస్‌ఎస్‌లోనే.

పెట్టుబడి పెట్టిన తర్వాత మూడేళ్ల వరకు వెనక్కి తీసుకునే వీలుండదు. ఈఎల్‌ఎస్‌ఎస్‌లో చేసిన పెట్టుబడులపై ఆదాయం కోరుకుంటే డివిడెండ్‌ ఆప్షన్‌ ఎంచుకోవచ్చు. దీంతో లాకిన్‌ పీరియడ్‌ కాలంలోనూ రాబడుల నుంచి మీకు డివిడెండ్‌ చేతికి అందుతుంది. ఈఎల్‌ఎస్‌ఎస్‌లోనే నెలవారీ సిప్‌ రూపంలో ఇన్వెస్ట్‌ చేయడం వల్ల ఒకేసారి పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాల్సిన ఇబ్బంది తప్పుతుంది. పైగా నెలవారీగా ఇన్వెస్ట్‌ చేయడం వల్ల మార్కెట్‌ ఆటుపోట్లను తట్టుకుని దీర్ఘకాలంలో అధిక రాబడులకు అవకాశం ఉంటుంది.

మూడేళ్ల లాకిన్‌ పీరియడ్‌ అన్నది ప్రతీ వాయిదా ఇన్వెస్ట్‌మెంట్‌కు వేర్వేరుగా అమలవుతుంది. ఉదాహరణకు నవంబర్‌లో సిప్‌ చేశారనుకోండి. ఆ సిప్‌ మొత్తం 2020 అక్టోబర్‌తో గడువు తీరుతుంది. అదే ఈ ఏడాది డిసెంబర్‌లో ప్రారంభిస్తే 2020 నవంబర్‌తో ఆ సిప్‌ గడువు ముగుస్తుంది. ఈఎల్‌ఎస్‌ఎస్‌ పథకాల్లో  పెట్టుబడులపై వచ్చే రాబడులకు పూర్తిగా పన్ను మినహాయింపు ఉంది. గత చరిత్రను బట్టి చూస్తే... వీటిలో మంచి పనితీరు గల పథకాలుగా యాక్సిస్‌ లాంగ్‌టర్మ్‌ ఈక్విటీ ఫండ్, రిలయన్స్‌ ట్యాక్స్‌ సేవర్‌ ఫండ్, డీఎస్‌పీ బ్లాక్‌రాక్‌ ట్యాక్స్‌ సేవర్‌ ఫండ్‌లను చెప్పుకోవచ్చు.


రాజీవ్‌ గాంధీ ఈక్విటీ సేవింగ్స్‌ స్కీమ్‌
ఈక్విటీల్లో కొత్తగా ఇన్వెస్ట్‌ చేయాలనుకునే వారు పన్ను ఆదా చేసుకునేందుకు రాజీవ్‌ గాంధీ ఈక్విటీ సేవింగ్‌ పథకం ఓ మంచి ఆప్షన్‌. వార్షికంగా రూ.12 లక్షల్లోపు ఆదాయం ఉన్న అందరూ దీనికి అర్హులు. కాకపోతే ఇంతకుముందు స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌ చేసి ఉండకూడదు.

పెట్టుబడి ఎంత..
ఆర్‌జీఈఎస్‌ఎస్‌ కింద వార్షికంగా ఈక్విటీల్లో రూ.50,000 ఇన్వెస్ట్‌ చేయడానికి అనుమతి ఉంది. బీఎస్‌ఈ 100 స్టాక్స్‌ లేదా ఆర్‌జీఈఎస్‌ఎస్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌లో అయినా ఇన్వెస్ట్‌ చేయవచ్చు. ఈ విధంగా చేసిన పెట్టుబడుల్లో సగం మేర అంటే రూ.25,000 మొత్తానికి సెక్షన్‌ 80సీ కింద పన్ను ప్రయోజనం పొందొచ్చు. ఉదాహరణకు మీరు 30 శాతం పన్ను పరిధిలో ఉన్నారనుకోండి రూ.25,000పై రూ.7,725 పన్ను భారాన్ని ఆదా చేసుకోవచ్చు. ఇలా మూడేళ్ల పాటే పన్ను మినహాయింపు పొందేందుకు అనుమతి ఉంది. గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే ఈక్విటీల్లో పెట్టుబడులు కనుక రాబడులకు ఎటువంటి హామీ ఉండదు. మార్కెట్లు, ఆయా స్టాక్స్, ఫండ్స్‌ పనితీరుపైనే రాబడులు ఆధారపడి ఉంటాయి.


పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌
పన్ను ఆదాకు ఆకర్షణీయమైన సాధనాల్లో ఇదీ ఒకటి. కానీ, కేంద్రంలో మోదీ సర్కారు కొలువు తీరిన తర్వాత చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లను క్రమంగా తగ్గిస్తూ వస్తోంది. ప్రస్తుత వడ్డీ రేటు (2017 అక్టోబర్‌–డిసెంబర్‌) 7.8 శాతం. అయినా ఇతర సంప్రదాయ సాధనాలతో పోలిస్తే పన్ను ఆదా పరంగా పీపీఎఫ్‌ ఇప్పటికీ మెరుగైన సాధనమే. ఇందులో వార్షికంగా 1.50 లక్షల పెట్టుబడులకు సెక్షన్‌ 80సీ కింద పన్ను మినహాయింపు పొందొచ్చు. అంతేకాదు గడువు తీరిన తర్వాత వచ్చే రాబడులు, అసలు మొత్తంపైనా పన్ను లేదు.

పీపీఎఫ్‌ ఖాతా నుంచి అరుదైన సందర్భాల్లో తప్ప 15 ఏళ్లలోపు ముందుగా వైదొలిగే అవకాశం లేదు. అయితే, ప్రారంభించిన అనంతరం ఆరో ఆర్థిక సంవత్సరం నుంచి రుణం పొందేందుకు అవకాశం ఉంటుంది. అలాగే, ఖాతాలో బ్యాలెన్స్‌ పై మూడో ఆర్థిక సంవత్సరం నుంచి ఐదో ఆర్థిక సంవత్సరం లోపు అవసరమైతే రుణం కూడా పొందొచ్చు. ఆరో ఏట నుంచి పాక్షిక ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. ప్రవాస భారతీయులు పీపీఎఫ్‌ ప్రారంభించేందుకు అవకాశం లేదు. ఈ పథకంలో ఏటా కనీసం రూ.500 ఇన్వెస్ట్‌ చేయాల్సి ఉంటుంది.

ప్రతీ నెలా 5వ తేదీన ఇన్వెస్ట్‌ చేస్తే ఆ నెలలో మిగిలి ఉన్న రోజులకు వడ్డీ లభిస్తుంది. 5 తర్వాత ఇన్వెస్ట్‌ చేస్తే మరుసటి నెల నుంచే ఆ మొత్తంపై వడ్డీ దక్కుతుంది. ప్రతీ నెలా కాకుండా ఏడాదికోసారి ఇన్వెస్ట్‌ చేస్తున్నట్టయితే ఏప్రిల్‌ 5లోపు చేసినట్టయితే ఆ ఆర్థిక సంవత్సరం మొత్తానికి వడ్డీ గిట్టుబాటు అవుతుంది. దాంతో 15 ఏళ్ల కాలంలో అధిక రాబడులకు అవకాశం ఉంటుంది. పన్ను ఆదాతోపాటు దీర్ఘకాలిక అవసరాలైన పిల్లల విద్య, వివాహాలు, ఇల్లు, రిటైర్మెంట్‌ అవసరాల కోసం ఈ పథకం అనువైనది. రిస్క్‌ వద్దనుకునేవారికి నప్పే పథకం.


సుకన్య సమృద్ధి యోజన
పన్ను ఆదాకు సుకన్య సమృద్ధి యోజన కూడా ఉపయోగపడే పథకమే. కుమార్తెల పేరిట ఇన్వెస్ట్‌ చేసేందుకు ఉద్దేశించిన పథకం ఇది. వారి వివాహం, ఉన్నత విద్యావసరాలకు ఉపయోగపడుతుంది. ఇందులో వార్షికంగా గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు ఇన్వెస్ట్‌ చేయవచ్చు. దీనిపై ప్రస్తుతం 8.8 శాతం వడ్డీ రేటు అమల్లో ఉంది. తల్లిదండ్రులు లేదా సంరక్షకులు ఆడపిల్ల వయసు 15 ఏళ్లు వచ్చే వరకు ఆమె పేరిట డిపాజిట్‌ చేయవచ్చు. 21 ఏళ్లు రాగానే కాల వ్యవధి తీరిపోతుంది. అమ్మాయి వయసు 16వ సంవత్సరం నుంచి 21వ సంవత్సరం వరకు డిపాజిట్‌ చేయాల్సిన అవసరం లేదు. దీనిపై వచ్చే రాబడులు పూర్తిగా పన్ను రహితం.

బ్యాంకు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు
బ్యాంకు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు కూడా సెక్షన్‌ 80సీ కింద పన్ను మినహాయింపునకు అర్హత కలిగినవే. ఎఫ్‌డీ రేట్లు ప్రస్తుతం సగటున 6–7 శాతం మధ్యలో ఉన్నాయి. వార్షికంగా రూ.1.50 లక్షల వరకు బ్యాంకులో ఎఫ్‌డీ చేసి పన్ను మినహాయింపు పొందొచ్చు. ఐదేళ్లు, అంతకుమించిన కాల వ్యవధి కలిగిన డిపాజిట్లకే ఇది వర్తిస్తుంది. ఐదేళ్లలోపు డిపాజిట్లకు పన్ను మినహాయింపు లేదు. పైగా ఇందులో పెట్టుబడులకే పన్ను మినహాయింపు ప్రయోజనం. అంటే డిపాజిట్‌పై వచ్చే వడ్డీ ఆదాయం పన్ను పరిధిలోకి వస్తుంది. సీనియర్‌ సిటిజన్స్‌ అయితే అరశాతం ఎక్కువ వడ్డీ రేటు అందుకోవచ్చు.


నేషనల్‌ పెన్షన్‌ సిస్టమ్‌
సెక్షన్‌ 80సీ పన్ను ప్రయోజనం రూ.1.5 లక్షలకు అదనంగా సెక్షన్‌ 80సీసీడీ కింద మరో రూ.50,000 పన్ను ఆదా చేసుకునేందుకు ఉన్న చక్కని ఆప్షన్‌ ఎన్‌పీఎస్‌. అంటే రెండూ కలిపి బేసిక్‌ పన్ను మినహాయింపు రూ.2.5 లక్షలకు అదనంగా రూ.2 లక్షలు మొత్తం రూ.4.5 లక్షల ఆదాయానికి పన్ను లేకుండా చేసుకోవచ్చు. ఉద్యోగ విరమణ తర్వాత వృద్ధాప్యంలో పెన్షన్‌ సదుపాయం లేని వారు స్వచ్ఛందంగా ఈ పథకంలో ఇన్వెస్ట్‌ చేసుకోవడం ద్వారా ఆ విధమైన రక్షణ ఏర్పాటు చేసుకోవచ్చు.

నెలకు కనీసం రూ.500, ఏడాదిలో కనీసం రూ.6,000 ఇన్వెస్ట్‌ చేయాల్సి ఉంటుంది. గరిష్ట పరిమితి లేదు. ఎన్‌పీఎస్‌లో రాబడులు స్థిరంగా ఉండవు. ఎందుకంటే ఇందులో పెట్టుబడులకు సంబంధించి ఈక్విటీ, గిల్ట్స్, కార్పొరేట్‌ బాండ్లు అంటూ మూడు విభాగాలున్నాయి. ఇన్వెస్టర్లు తమ రిస్క్‌ స్థాయిలకు అనుగుణంగా ఒక్కో విభాగానికి నిర్ణీత మొత్తాన్ని కేటాయించుకోవచ్చు.

అయితే ఈక్విటీలకు గరిష్టంగా 50 శాతమే అనుమతి ఉంది. ఎన్‌పీఎస్‌లో ఈక్విటీ పోర్షన్‌తో కూడిన రాబడులు 10 నుంచి 15 శాతం మధ్య ఉన్నాయి. పెట్టుబడుల పరంగా తక్కువ చార్జీలు ఉన్నటువంటి సాధనం ఇది. ఇందులో ఫండ్‌ నిర్వహణ చార్జీలు పెట్టుబడుల విలువపై కేవలం 0.0009 శాతమే. పథకం కాల వ్యవధి ముగిసిన తర్వాత వచ్చే రాబడుల్లో 60 శాతంపై పన్ను పడుతుంది. ఆన్‌లైన్‌లోనే సులభంగా ఎన్‌పీఎస్‌ ఖాతాను ప్రారంభించుకోవచ్చు.


వాలంటరీ ప్రావిడెంట్‌ ఫండ్‌
ఉద్యోగులు ప్రతీ నెలా తమ వేతనంలో 12 శాతాన్ని ఈపీఎఫ్‌లో ఇన్వెస్ట్‌ చేయడం తప్పనిసరి. ఈపీఎఫ్‌ సదుపాయం ఉన్న ఉద్యోగులు అదనంగా ప్రావిడెంట్‌ ఫండ్‌లో ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటే అందుకు వీలు కల్పించేది వీపీఎఫ్‌. తమ బేసిక్‌ వేతనం, డీఏ మొత్తానికి సమాన స్థాయిలో వీపీఎఫ్‌లో గరిష్టంగా ఇన్వెస్ట్‌ చేయవచ్చు. ఈపీఎఫ్‌పై ఎంత వడ్డీ రేటు అమల్లో ఉంటే అదే వీపీఎఫ్‌ పెట్టబడులకూ అమలవుతుంది. 2016–17 ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్‌ వడ్డీ రేటు 8.65 శాతంగా ఉంది. ఈ వడ్డీ రేటు 2017–18 ఆర్థిక సంవత్సరానికి ఇంకా నిర్ణయించాల్సి ఉంది. వీపీఎఫ్‌లో చేసే పెట్టుబడులను రిటైర్మెంట్‌ సమయంలోనే వెనక్కి తీసుకోగలుగుతారు. పన్ను ఆదా చేసుకునేందుకు ఉన్న సాధనాల్లో ఇది కూడా ఒకటి. రాబడులన్నీ పన్ను రహితం.


నేషనల్‌ సేవింగ్స్‌ సర్టిఫికెట్‌
కేంద్ర ప్రభుత్వ హామీతో పోస్టాఫీసులు జారీ చేసేవి ఇవి. పూర్తి భద్రత ఉంటుంది. పెట్టుబడుల కాల వ్యవధి ఐదేళ్లు. కనీసం రూ.500 ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చు. గరిష్ట పరిమితి లేదు. దీనిపై వార్షిక వడ్డీ రేటు 2017 అక్టోబర్‌–డిసెంబర్‌ క్వార్టర్‌కు 7.8 శాతం అమల్లో ఉంది. ప్రతీ ఆరు నెలలకు ఓసారి వడ్డీ అసలుకు కలుస్తుంది. దీనిపై వచ్చే వడ్డీ రేటును ఇతర ఆదాయం కింద ఆదాయపన్ను రిటర్నుల్లో చూపించాలి. ఇలా చూపించడం ద్వారా సెక్షన్‌ 80సీ కింద రూ.1.5 లక్షల వరకు పన్ను ఆదా చేసుకోవచ్చు. కనుక పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు.


జీవిత బీమా పాలసీలు
జీవిత బీమా పాలసీల్లో యూనిట్‌ లింక్డ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌ ఒక రకం. ప్రీమియంలో బీమా రక్షణ చార్జీలు పోను మిగిలిన మొత్తాన్ని ఈక్విటీల్లో ఇన్వెస్ట్‌ చేస్తాయి. వచ్చిన రాబడులను ఫండ్‌ చార్జీలు, ఇతర వ్యయాలు మినహాయించుకుని ఇన్వెస్టర్లకు పంచుతాయి. ఒకవైపు జీవిత రక్షణ, మరోవైపు పెట్టుబడులపై రాబడులను అందించే పథకం యులిప్‌.

ఇందులో రాబడులకు హామీ లేదు. పథకం పనితీరును బట్టి 5 నుంచి 11 శాతం మధ్య రాబడులను ఇవ్వొచ్చు. దీర్ఘకాలం పాటు (10 ఏళ్లు ఆపైన) పాలసీని కొనసాగించినట్టయితేనే మెరుగైన రాబడులకు వీలుంటుంది. అలాగే, సంప్రదాయ జీవిత బీమా పాలసీ కూడా పన్ను ప్రయోజనంతో కూడిన పెట్టుబడి సాధనమే. బీమా పాలసీ ఏదైనా చెల్లించే ప్రీమియంపై ఆదాయపన్ను చట్టం కింద పన్ను మినహాయింపు లభిస్తుంది. సమ్‌ అష్యూరెన్స్‌లో గరిష్టంగా 10 శాతానికే ఇది పరిమితం.


ఇంటి రుణం
అద్దింట్లో ఉండేవారికి రుణం తీసుకుని సొంతిల్లు  సమకూర్చుకోవడం వల్ల బహుళ ప్రయోజనాలున్నాయి. ఒకటి సొంతంగా ఇల్లు సమకూర్చుకోవడం. రెండోది పన్ను ఆదా చేసుకోవడం. పన్ను పరంగా కూడా రెండు ప్రయోజనాలున్నాయి. రుణంలో అసలుకు చేసే జమలు సెక్షన్‌ 80సీ కింద రూ.1.50 లక్షలకు పన్ను మినహాయింపు పొందొచ్చు. దీనికి అదనంగా ఇంటి రుణంపై ఓ ఆర్థిక సంవత్సరంలో చెల్లించిన వడ్డీ ఆదాయం రూ.2 లక్షలకు రాయితీ పొందేందుకు ఆదాయ పన్ను చట్టం వెసులుబాటు కల్పిస్తోంది. ఇల్లును అద్దెకు ఇవ్వకుండా సొంతంగా నివాసం ఉంటేనే ఈ ప్రయోజనం. మొదటి సారిగా ఇంటిని రుణంపై తీసుకుని ఓ ఆర్థిక సంవత్సరంలో రూ.2.5 లక్షల వడ్డీ చెల్లించారనుకోండి. రూ.2 లక్షల రాయితీపై అదనంగా మరో రూ.50,000కూ సెక్షన్‌ 24 కింద పన్ను ప్రయోజనం పొందొచ్చు.

హెచ్‌ఆర్‌ఏ అయితే...
ఒకవేళ మీరు ఇంటి అద్దె చెల్లిస్తుంటే దాని నుంచి కూడా పన్ను ప్రయోజనాలను పొందవచ్చు. ఈ ప్రయోజనం పొందాలంటే మీరు పనిచేసే సంస్థ హౌస్‌ రెంట్‌ అలవెన్స్‌ (హెచ్‌ఆర్‌ఏ) ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే అద్దెను చెక్‌ రూపంలో చెల్లించి, దానికి సంబంధించిన రశీదులను దగ్గర పెట్టుకోండి. మీ ఇంటి అద్దె ఏడాదికి రూ.లక్ష దాటితే ఓనర్‌ పాన్‌ నంబర్‌ను కూడా ఇవ్వాల్సి ఉంటుంది.

హెచ్‌ఆర్‌ఏ పన్ను ప్రయోజనాలను లెక్కించడానికి మూడు అంశాలను పరిగణనలోకి తీసుకొని వీటిలో ఏది తక్కువైతే ఆ మొత్తాన్ని ఆదాయం నుంచి తగ్గించి చూపిస్తారు. వీటిలో 1. కంపెనీ ఇస్తున్న వాస్తవ హెచ్‌ఆర్‌ఏ అలవెన్స్‌. 2. చెల్లిస్తున్న అద్దెలోంచి బేసిక్‌ శాలరీలో 10% తీసివేయగా వచ్చే మొత్తం. 3. మెట్రోలో నివసిస్తుంటే బేసిక్‌ శాలరీలో 50%, ఇతర పట్టణాల్లో అయితే 40%. ఒకవేళ సొంతిల్లు ఉండి, అది పనిచేస్తున్న కార్యాలయానికి దూరంగా ఉండటం వల్ల అద్దె ఇంట్లో ఉంటే కూడా హెచ్‌ఆర్‌ఏ ప్రయోజనాన్ని ఉపయోగించుకోవచ్చు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement