ట్యాక్స్ ఫ్రీ బాండ్ల ద్వారా రూ.40,000 కోట్లు!
ఏడు ప్రభుత్వ రంగ సంస్థలకు కేంద్రం అనుమతి
న్యూఢిల్లీ : పన్ను రహిత బాండ్ల ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2015-16) రూ.40,000 కోట్లు సమీకరించుకోడానికి కేంద్రం ఏడు ప్రభుత్వ రంగ సంస్థలకు అనుమతి ఇచ్చింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డెరైక్ట్ ట్యాక్సెస్ (సీబీడీటీ) ఒక నోటిఫికేషన్‌లో ఈ విషయాలను వెల్లడించింది. ఆ ఏడు సంస్థలు...
నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) రూ.24,000 కోట్ల సమీకరణకు అనుమతి ఉంది.
ఇండియన్ రైల్వేస్ ఫైనాన్స్ కార్పొరేషన్ (ఐఆర్‌ఎఫ్‌సీ) రూ.6,000 కోట్లు సమీకరించుకోవచ్చు.
హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (హెచ్‌యూడీసీ) రూ.5,000 కోట్లు సమీకరించుకునే వీలుంది.
ఇండియన్ రిన్యూవబుల్ ఎనర్జీ డెవలప్‌మెంట్ అథారిటీ విషయంలో ఈ పరిమితి రూ.2,000 కోట్లు.
ఎన్‌టీపీసీ, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్‌లు రూ. 1,000 కోట్లు చొప్పున సమీకరించుకోవచ్చని నోటిఫికేషన్ వెల్లడించింది. బాండ్లకు కాలపరిమితి 10,15,20 ఏళ్లుగా ఉంటుంది. గవర్నమెంట్ సెక్యూరిటీస్ రేట్లకు అనుగుణంగా వడ్డీరేట్లుంటాయి. రిటైల్ ఇండివిడ్యువల్ ఇన్వెస్టర్లు, కార్పొరేట్లు, ట్రస్టీలు, పార్ట్‌నర్‌షిప్ సంస్థలు, లిమిటెడ్ లయబులిటీ పార్ట్‌నర్‌షిప్ సంస్థలు, సహకార బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, ఇతర చట్టబద్ద సంస్థలు బాండ్లు కొనుగోలు చేయవచ్చు.