
ఈ రోబో సూట్ తొడుక్కుంటే..
ప్రముఖ హాలీవుడ్ సూపర్‌హిట్ సినిమా 'ఐరన్ మ్యాన్' గుర్తుందా? సూపర్ మ్యాన్ హీరో చేసే విన్యాసాలు గుర్తున్నాయా? సూపర్ మ్యాన్ లా మీరు కూడా భారీ బరువుల్ని సునాయాసంగా ఎత్తి పడేయాలనుకుంటున్నారా.... గాల్లో చక్కర్లు కొట్టాలనుకుంటున్నారా. అయితే హ్యుందాయ్ విడుదల చేసిన ఐరన్ మ్యాన్ రోబో సూట్ గురించి తెలుసుకోవాల్సిందే.. అచ్చం చొక్కా తొడుక్కున్నట్టు.. ఏదో కోటు వేసుకున్నంత ఈజీగా ధరించే ఆసక్తికరమైన 'ఐరన్ మ్యాన్ సూట్' ను ప్రముఖ ఆటో దిగ్గజం హ్యుందాయ్ విడుదల చేసింది. ఈ అధునాతనమైన ఈ రోబో సూట్ ధరించి ఇక రియల్ లైఫ్ లో కూడా హాలివుడ్ సూపర్‌హిట్ సినిమా ఐరన్ మ్యాన్ లా వెలిగిపోవచ్చన్నమాట.
మిలిటరీ సహా విభిన్న ప్రాంతాల్లో దీన్ని ధరించి ప్రయోజనాలు పొందొచ్చని దక్షిణ కొరియా ఆటో దిగ్గజం హ్యుందాయ్ మోటార్ గ్రూప్ వెల్లడించింది. దీనిని ధరించినవారు వస్తువులపై ప్రయోగించే బలానికి పదిరెట్ల బలాన్ని జతచేసి ప్రయోగిస్తుందని సంస్థ చెబుతోంది. ఈ సూట్ సాయంతో ఒంటి చేత్తోనే 60 కిలోల బరువుల్ని సునాయాసంగా ఎత్తేయొచ్చనీ, మెట్లు ఎక్కడంలో కూడా ఇది సాయం చేస్తుందని కంపెనీ చెబుతోంది. వికలాంగులకు, వృద్ధులకు తమ రోజువారీ కార్యక్రమాల్లో కూడా ఇది సహకరిస్తుందని సంస్థ ప్రతినిధి తెలిపారు.
వాణిజ్య ప్రయోజనాల కనుగుణంగా ఈ రోబో మరింత అభివృద్ధి చేయడానికి ప్రయత్నిస్తున్నామని కంపెనీ అధికారి తెలిపారు. ప్రజలు, లేదా వస్తువులు ఫ్రీ మొబిలిటీని దృష్టిలో పెట్టుకుని హ్యుండాయ్ మోటార్ గ్రూప్ దీన్ని అభివృద్ధి చేసిందన్నారు. తమ విజన్ లో భాగంగా ఇది సాధ్యమైందని తెలిపారు.