13 కోట్ల చ.అ. 310 గ్రీన్‌ బిల్డింగ్స్‌ | IGBC recognizes 17 metro stations | Sakshi
Sakshi News home page

13 కోట్ల చ.అ. 310 గ్రీన్‌ బిల్డింగ్స్‌

Published Sat, Oct 27 2018 1:54 AM | Last Updated on Sat, Oct 27 2018 1:54 AM

IGBC recognizes 17 metro stations - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సాధ్యమైనంత వరకూ సహజ సిద్ధమైన ఇంధన వనరులను వినియోగిస్తూ.. జీవ వైవిధ్యాన్ని కాపాడే నిర్మాణాలకు ఇండియన్‌ గ్రీన్‌ బిల్డింగ్‌ కౌన్సిల్‌ (ఐజీబీసీ) హరిత భవనాలుగా గుర్తిస్తుంది. నిర్వహణ వ్యయాన్ని తగ్గించడం, జీవన కాల పరిమితిని పెంచడమే గ్రీన్‌ బిల్డింగ్స్‌ ప్రధాన ఉద్దేశం. ఐజీబీసీ రేటింగ్స్‌ ప్లాటినం, గోల్డ్, సిల్వర్‌తో పాటూ బేసిక్‌ సర్టిఫికేషన్‌ కూడా ఉంటుంది. ఆయా భవనాల్లో విద్యుత్, నీటి వినియోగం, నిర్మాణ సామగ్రి ఎంపిక, ల్యాండ్‌ స్కేపింగ్‌ మీద ఆధారపడి రేటింగ్స్‌ ఉంటాయి.

విద్యుత్, నీటి వినియోగంలో తేడా..
అందుబాటు గృహాలతో పోలిస్తే ప్లాటినం, గోల్డ్‌ రేటింగ్‌ గ్రీన్‌ బిల్డింగ్స్‌ నిర్మాణ వ్యయం 2 శాతం ఎక్కువవుతుంది కానీ, హరిత భవనాల్లో ఇంధన వనరుల వినియోగం మాత్రం గణనీయంగా తగ్గుతుంది. సాధారణ భవనాలతో పోలిస్తే గ్రీన్‌ బిల్డింగ్స్‌లో విద్యుత్‌ వినియోగం 40 శాతం, నీటి వినియోగం 30 శాతం వరకు తక్కువగా ఉంటుంది. పర్యావరణం పరంగా చూస్తే.. 10 లక్షల చ.అ. గ్రీన్‌ బిల్డింగ్స్‌తో 15 వేల మెగావాట్ల (ఎండబ్ల్యూహెచ్‌) విద్యుత్, 45 వేల కిలో లీటర్ల (కేఎల్‌) నీటి వినియోగం, 12 వేల టన్నుల కార్బన్‌ డయాక్సైడ్, 450 టన్నుల నిర్మాణ వ్యర్థాల విడుదల తగ్గుతుంది.  

17 ఐజీబీసీ మెట్రో స్టేషన్లు..
ప్రస్తుతం మన దేశంలో 633 కోట్ల చ.అ.ల్లో 4,794 హరిత భవనాలున్నాయి. 2022 నాటికి వెయ్యి కోట్ల చ.అ.లకు చేర్చాలన్నది లక్ష్యం. విభాగాల వారీగా పరిశీలిస్తే.. 12.50 లక్షల నివాస భవనాలు, 250 ఫ్యాక్టరీలు, 1,600 కార్యాలయాలు, 45 టౌన్‌షిప్స్, 335 ట్రాన్సిట్స్, 13 గ్రామాలు, 8 నగరాలు గ్రీన్‌ బిల్డింగ్స్‌గా గుర్తింపు పొందాయి. తెలంగాణలో 13 కోట్ల చ.అ.ల్లో 310, ఆంధ్రప్రదేశ్‌లో 73  ఐజీబీసీ ప్రాజెక్ట్స్‌ ఉన్నాయి. అసెండస్‌ వీఐటీ పార్క్, హెచ్‌ఎంఆర్‌ఎల్, ఐసీఐసీఐ బ్యాంక్, ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్, ఆర్‌బీఐ సీనియర్‌ ఆఫీసర్స్‌ క్వార్టర్స్‌ వంటివి వీటిల్లో కొన్ని. ఇటీవలే ట్రాన్సిట్‌ విభాగంలో 17 హైదరాబాద్‌ మెట్రో స్టేషన్లు గ్రీన్‌ బిల్డింగ్‌ సర్టిఫికేషన్‌ పొందాయి. ఇతర నగరాల్లో ఐజీబీసీ గణాంకాలను పరిశీలిస్తే.. మహారాష్ట్రలో 1,362, ఉత్తర్‌ ప్రదేశ్‌లో 468, కర్ణాటకలో 414, చెన్నైలో 412, వెస్ట్‌ బెంగాల్‌లో 308 ప్రాజెక్ట్‌లున్నాయి.  

300 బిలియన్‌ డాలర్లకు పరిశ్రమ..
ఫ్లయాష్‌ బ్రిక్స్, వాల్‌ అండ్‌ రూఫ్‌ ఇన్సులేషన్, లో వీఓసీ పెయింట్స్, సీఆర్‌ఐ సర్టిఫైడ్‌ కార్పెట్స్, ఎఫ్‌ఎస్‌సీ సర్టిఫైడ్‌ వుడ్, గ్లాస్‌ వంటివి హరిత భవనాల నిర్మాణ సామగ్రి. వాటర్‌లెస్‌ యూరినల్స్, సీఓ2 సెన్సార్, విండ్‌ టవర్స్‌ వంటివి గృహ ఉత్పత్తుల కిందికి వస్తాయి. 90 శాతం హరిత భవనాల నిర్మాణ సామగ్రి మన దేశంలోనే లభ్యమవుతున్నాయి. 2025 నాటికి దేశంలో హరిత భవనాల నిర్మాణ సామగ్రి పరిశ్రమ 300 బిలియన్‌ డాలర్లకు చేరుతుందని పరిశ్రమ వర్గాల అంచనా.

నవంబర్‌ 1 నుంచి గ్రీన్‌ బిల్డింగ్‌ కాంగ్రెస్‌
ఇండియన్‌ గ్రీన్‌ బిల్డింగ్‌ కౌన్సిల్‌ ఆధ్వర్యంలో నవంబర్‌ 1– 3 తేదీల్లో మాదాపూర్‌లోని హెచ్‌ఐసీసీలో 16వ గ్రీన్‌ బిల్డింగ్‌ కాంగ్రెస్‌–2018 జరుగనుంది. ఈ కార్యక్రమంలో 2 వేల మంది దేశ, విదేశీ ప్రతినిధులు పాల్గొంటారు. ప్రపంచ దేశాల నుంచి 25 మంది స్పీకర్స్‌ ఉంటారు. ముఖ్య అతిథిగా పట్టణ, గృహ మంత్రిత్వ శాఖ కేంద్ర మంత్రి హర్దీప్‌సింగ్‌ పురీ పాల్గొననున్నారు.


తెలంగాణలో ప్రోత్సాహకాలెన్నడో?
తెలంగాణలోనూ ఐజీబీసీ గుర్తింపు పొందిన భవనాలకు రాయితీలు, ప్రోత్సాహకాలు అందించాలని ఐజీబీసీ హైదరాబాద్‌ చాప్టర్‌ ప్రెసిడెంట్‌ సీ శేఖర్‌ రెడ్డి సూచిస్తున్నారు.
♦  డెవలపర్లు హరిత నిర్మాణాల వైపు మొగ్గు చూపేలా పర్మిట్‌ ఫీజులో 20 శాతం, ఇంపాక్ట్‌ ఫీజులో 20 శాతం తగ్గించాలి.
♦  రూఫ్‌టాప్‌ సోలార్‌ వ్యవస్థను ఏర్పాటు చేసుకునేలా ప్రోత్సహించాలి. ఇప్పటికే ఉన్న భవనాల మీద రూఫ్‌టాప్‌ ఏర్పాటు చేసుకునేలా అదనపు అంతస్తు నిర్మించుకుంటే ఆయా భవనాలను క్రమబద్ధీకరించాలి. ఒకవేళ కొత్త భవనాలపై రూఫ్‌టాప్‌ ఏర్పాటు చేసుకుంటే సెట్‌బ్యాక్‌లో మినహాయింపునివ్వాలి.
♦  ఐజీబీసీ గుర్తింపు పొందిన ప్రాజెక్ట్‌లకు మూడేళ్ల పాటు వాటర్‌ అండ్‌ సీవరేజ్‌ టారిఫ్‌ను 10 శాతం తగ్గించాలి.  
♦  ఆంధ్రప్రదేశ్‌లో ఐజీబీసీ గుర్తింపు పొందిన భవనాలకు పర్మిట్‌ ఫీజులో 20 శాతం, స్టాంప్‌ డ్యూటీ సర్‌చార్జీలో 20 శాతం తగ్గుదల ఉంది. అలాగే ఎంఎస్‌ఎంఈ, భారీ పరిశ్రమలకు మూలధన పెట్టుబడి మీద 25 శాతం సబ్సిడీ కూడా ఉంది. ఇతర రాష్ట్రాల్లో గమనిస్తే.. రాజస్థాన్, ఉత్తర్‌ప్రదేశ్‌ 5 శాతం అదనపు ఫ్లోర్‌ ఏరియా రేషియో (ఎఫ్‌ఏఆర్‌), మహారాష్ట్ర, జార్ఖండ్‌లో 3–7 శాతం, హరియాణాలో 9–15 శాతం, హిమాచల్‌ ప్రదేశ్, వెస్ట్‌ బెంగాల్‌లో 10 శాతం ఎఫ్‌ఏఆర్‌ ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement