న్యూఢిల్లీ: సమాచారం కోసం ఒకప్పుడు తెలిసిన వారిని అడిగే వాళ్లం. ఇంటర్నెట్ అందరికీ చేరువ అయిన తర్వాత గూగుల్ సెర్చింజన్ సమాచార వారధిగా మారిపోయింది. ఫలానా రెస్టారెంట్‌లో రుచులు ఎలా ఉంటాయి? ఫలానా హాస్పిటల్‌లో ఏ విధమైన స్పెషలిస్ట్ వైద్యులు ఉన్నారు, వైద్యం ఎలా ఉంటుంది? ఫలానా సూపర్ మార్కెట్లో అన్నీ లభిస్తాయా? ఇలా ఒక్కటని కాదు ఏది అడిగినా సమాచారాన్ని ముందుంచుతుంది గూగుల్. కానీ, గూగుల్ ప్లాట్‌ఫామ్ అందించే రివ్యూల్లో నిజం పాళ్లు ఎంత? ఇదే తెలుసుకుందామని లోకల్ సర్కిల్స్ దేశవ్యాప్తంగా ఒక సర్వే నిర్వహించింది. 357 జిల్లాల పరిధిలో నివసించే 56,000 మంది అభిప్రాయాలను తెలుసుకుంది.
♦ 45 శాతం మంది గూగుల్‌లో రివ్యూలు కచ్చితమైనవి కావని తేల్చి చెప్పారు.
♦ మరో 37 శాతం మంది రివ్యూలు ఎక్కువగా సానుకూలంగా ఉంటున్నట్టు తెలిపారు.
♦ గూగుల్ రివ్యూలను, రేటింగ్‌లను తాము పూర్తిగా విశ్వసిస్తామని చెప్పిన వారు కేవలం 3 శాతం మందే ఉన్నారు.
♦ 7% మంది గూగుల్ రివ్యూలు, రేటింగ్‌లను ఎంత మాత్రం నమ్మబోమని స్పష్టం చేశారు.
♦ హోటల్, రెస్టారెంట్, స్టోర్, సర్వీస్ గురించి గూగుల్‌కు వెళ్లిన సమయంలో కనిపించే రివ్యూల్లో నిజం ఎంత? అని సర్వేలో పాల్గొన్న వారిని అడగ్గా పై విధంగా చెప్పారు.
♦ సమాచార అన్వేషణకు గూగుల్‌కు వెళుతున్న వారిలో 88 శాతం మంది రివ్యూలను చూస్తూ, రేటింగ్ గురించి తెలుసుకుంటున్నట్టు ఈ సర్వే గుర్తించింది.
♦ సర్వేలో భాగంగా 67 శాతం మంది పురుషులు, 33 శాతం మంది మహిళలు తమ అభిప్రాయాలు తెలియజేశారు.
♦ ఇందులో 47 శాతం మంది టైర్–1, 33% మంది టైర్–2, మిగిలిన 20% మంది ఇతర పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల నుంచి ఉన్నారు.
నకిలీ రివ్యూలపై నిషేధం: గూగుల్
ఈ సర్వే చివరిగా గూగుల్ అభిప్రాయాలను కూడా తెలుసుకుంది.యూజర్ల వాస్తవిక అనుభవం ఆధారంగా వారు అందించే సమాచారం ఇతరులకు సాయంగా ఉండాలన్నదే గూగుల్ రివ్యూల ఉద్దేశ్యమని గూగుల్ అధికార ప్రతినిధి తెలిపారు. ‘‘నకిలీ, మోసపూరిత కంటెంట్‌ను అందించే, ఉద్దేశపూర్వకమైన, కచ్చితత్వం లేని కంటెంట్‌ను నిషేధించే విధానాలు అమల్లో ఉన్నాయి. యూజర్ల నుంచి హెచ్చరికలకు తోడు, రోజులో అన్ని వేళలా ఆపరేటర్లు ఆటోమేటెడ్ సిస్టమ్‌లను పర్యవేక్షిస్తూ ఉంటారు.
అనుమానిత ప్రవర్తనను గమనిస్తుంటారు. ఎవరైనా యూజర్ ఏదైనా రివ్యూ/కంటెంట్‌ను మా దృష్టికి తీసుకొస్తే సంబంధిత రివ్యూలను కనిపించకుండా నిలిపివేసే చర్యలు అమల్లో ఉన్నాయి. గూగుల్‌పై విశ్వసనీయ సమాచారం అందించేందుకు టెక్నాలజీపై మా పెట్టుబడులు కొనసాగిస్తాం’’అని గూగుల్ అధికార ప్రతినిధి వెల్లడించారు. తాజాగా ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లలో రివ్యూలకు సంబంధించి భారతీయ ప్రమాణాల మండలి (బీఐఎస్) ‘ఐఎస్ 19000:2022’ను అమల్లోకి తీసుకురావడం గమనార్హం. రివ్యూలు తీసుకోవడం, వాటిని ప్రచురించడం, రివ్యూలు రాయడం అన్నది నిర్ధేశిత ప్రమాణాల ప్రకారం ఉండాలని ఇది సూచిస్తోంది. సరిగ్గా ఇదే తరుణంలో లోకల్ సర్కిల్స్ సర్వే ఫలితాలు విడుదల కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.
Comments
Please login to add a commentAdd a comment