google search engine
-
వేల కోట్ల రూపాయల ఫైన్!
లండన్: యూరోపియన్ కమిషన్ విధించిన 2.4 బిలియన్ యూరో(రూ.22 వేలకోట్లు)ల జరిమానాను సవాల్ చేస్తూ గూగుల్ దాఖలు చేసిన కేసు వీగిపోయింది. గూగుల్ సెర్చ్‌లో గూగుల్ సొంతంగా షాపింగ్ సిఫారసులు చేయడం ద్వారా చట్టవిరుద్ధమైన ప్రయోజనం పొందిందంటూ.. 2.4 బిలియన్ యూరోల జరిమానా చెల్లిచాలంటూ 2017లో యూరోపియన్ కమిషన్ ఆదేశించింది. విజిటర్లను అనుచితంగా తన సొంత షాపింగ్ సేవల వైపు మళ్లించడం పోటీదారులకు నష్టం కలిగించడమేనని పేర్కొంది. ఈ ఆదేశాలను యూరోపియన్ యూనియన్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ తాజాగా సమర్థించింది.గూగుల్ ఈ అప్పీల్‌ను తిరస్కరించింది. కోర్టు నిర్ణయం తమను నిరాశపరిచినట్టు, ఈ తీర్పు కేవలం కొన్ని వాస్తవాల ఆధారంగానే ఉన్నట్టు గూగుల్ ప్రకటన విడుదల చేసింది. పోటీదారులను సమానంగా చూడాలన్న యూరోపియన్ కమిషన్ నిర్ణయానికి అనుగుణంగా తాము 2017లో ఎన్నో మార్పులను అమల్లోకి తీసుకొచ్చినట్టు తెలిపింది. షాపింగ్ సెర్చ్ లిస్టింగ్‌లకు సంబంధించి వేలం నిర్వహించినట్టు వివరించింది. ఆండ్రాయిడ్ మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్, యాడ్సెన్స్ అడ్వర్టైజింగ్ ప్లాట్‌ఫామ్‌లకు సంబంధించి మరో రెండు ఈయూ యాంటీట్రస్ట్ కేసుల్లోనూ గూగుల్‌కు వ్యతిరేకంగా ఆదేశాలు రాగా, వీటిపై అప్పీల్‌కు గూగుల్‌కు ఇప్పటికీ అవకాశం మిగిలే ఉంది.ఇదీ చదవండి: పీపీఎఫ్ ఖాతాలు క్లోజ్ చేయాల్సిందేనా..?ఇదిలాఉండగా, గూగుల్‌లో యాడ్ ఇవ్వాలనుకునే ప్రకటన ఏజెన్సీలు కీవర్డ్‌లకు సంబంధించిన బిడ్‌ను వేలంలో గెలుపొందాల్సి ఉంటుంది. వినియోగదారులు సెర్చింజన్లో ఏదైనా సమాచారాన్ని తెలుసుకుంటున్నప్పుడు సెర్చ్ కీవర్డ్‌లకు అనుగుణంగా యాడ్స్ వచ్చేలా ఏర్పాటు చేస్తారు. అలా సెర్చ్ చేసేవారి అభిరుచులకు తగిన యాడ్స్ డిస్ప్లే అవుతుంటాయి. గూగుల్ సెర్చ్ ఇంజిన్‌లో సెర్చ్ యాడ్స్, డిస్ప్లే యాడ్స్, వీడియో యాడ్స్, షాపింగ్ యాడ్స్.. వంటి వివిధ రూపాల్లో ప్రకటనలు ఇస్తూంటారు. -
గూగుల్‌పై కన్నెర్ర!
అతిథిగా వచ్చి అడిగినవన్నీ గుక్క తిప్పుకోకుండా చెబుతున్న సిద్ధుణ్ణి చూసి సంభ్రమాశ్చర్యాలకు లోనయిన ప్రవరాఖ్యుడు ‘సృష్టికర్త బ్రహ్మకైనా నేర్వశక్యంగాని ఇన్ని సంగతులు తమరికెలా సాధ్య మయ్యాయ’ని ఎంతో వినయంగా అడుగుతాడు ‘మనుచరిత్ర’ కావ్యంలో. ఈ ఆధునాతన యుగంలో ఆ సిద్ధుణ్ణి మించిపోయి, అడిగిన అరక్షణంలో అన్నిటినీ గూగుల్ ఏకరువు పెడుతోంది. అసలు గూగుల్ లేకపోతే మనకు చాలా విషయాలు తెలిసేవికాదని, మన జ్ఞానానికి ఎన్నో పరిమితులుండేవని ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది విశ్వసిస్తారు. అంతటి గూగుల్‌పై అమెరికా ఫెడరల్ న్యాయ స్థానం రూపంలో పిడుగుపడింది. ఈ సంస్థ గుత్తాధిపత్య పోకడలు పోతోందని న్యాయ స్థానం తీర్పునిచ్చింది. పోటీదారులందరికీ సమానావకాశాలు ఉండితీరాలన్న స్వేచ్ఛా మార్కెట్ సూత్రాలకు తిలోదకాలిచ్చి, చట్ట ఉల్లంఘనలకు పాల్పడి వక్రమార్గంలో లాభార్జనకు పాల్పడుతున్నదని తేల్చి చెప్పింది. సంస్థపై ఏ చర్యలు తీసుకోవాలన్నది న్యాయస్థానం ఇంకా చెప్పలేదు. అయితే దాన్ని భిన్న సంస్థలుగా విభజించాలని ఆదేశించటంతో సహా ఎలాంటి చర్యలనైనా సూచించే అవకాశం ఉంది. అసలు ఒక టెక్ దిగ్గజంగా, మహాసంస్థగా వెలిగిపోతున్న గూగుల్ ఏడెనిమిదేళ్ల క్రితం ఒక పెద్ద కార్పొరేట్ సంస్థ ‘ఆల్ఫాబెట్’లో ఒదిగి చిన్నబోయింది. ఇప్పటికే అమెజాన్, మెటా, యాపిల్ వగైరా భారీ కార్పొరేట్ కంపెనీలపై నడుస్తున్న వ్యాజ్యాలకు తాజా తీర్పు ప్రమాణంగా మారుతుందన్నది గుత్తాధిపత్య నిరోధక చట్టాల నిపుణులంటున్న మాట. నిజానికి మైక్రోసాఫ్ట్‌పై 2000 సంవత్సరంలో వెలువడిన యాంటీట్రస్ట్ తీర్పు ప్రస్తుత గూగుల్ కేసును ప్రభావితం చేసింది. ఈ కేసు పరిష్కారానికి ఏం చేయాలన్న అంశంపై ప్రభుత్వమూ, గూగుల్ మాట్లాడుకోవాలని, వచ్చే నెల 6 నాటికి నిర్ణయం తెలపాలని న్యాయమూర్తి చెప్పారు. ఈ తీర్పుపై గూగుల్ ఎటూ అప్పీల్‌కి పోతుంది.గూగుల్‌పై వచ్చిన ఆరోపణలు కొట్టివేయదగ్గవి కాదు. తన సెర్చ్ ఇంజన్‌ను సెల్ఫోన్లలో, బ్రౌజర్లలో అమర్చేలా యాపిల్‌తో సహా అనేక స్మార్ట్ ఫోన్ కంపెనీలకూ, బ్రౌజర్ కంపెనీలకూ గూగుల్ ఒక్క 2021లోనే 2,600 కోట్ల డాలర్లు చెల్లించిందని, ఇందువల్ల ఇతర సంస్థలు భారీగా నష్టపోయాయని ఆ అభియోగాల సారాంశం. ఒక అంచనా ప్రకారం ప్రపంచవ్యాప్తంగా వినియోగ దారుల్లో 90 శాతం మంది గూగుల్ సెర్చ్ ఇంజన్‌పైనే ఆధారపడుతున్నారు. అయితే వినియోగదారులను తాము నియంత్రించటమో, నిర్బంధించటమో చేయటం లేదని... ఎందులో మెరుగైన ఫలితా లొస్తాయో తేల్చుకుని స్వచ్ఛంగా తమను ఎంచుకుంటున్నారని గూగుల్ వాదించింది. వర్తమానంలో ఇంటర్నెట్ తెరిచాక సాగే అత్యంత ప్రధాన వ్యాపకం శోధించటమే. అయితే సెల్‌ఫోన్ తయారీ దార్లకూ, బ్రౌజర్ కంపెనీలకూ భారీ చెల్లింపులు చేసి గూగుల్ సెర్చ్ ఇంజన్‌ను చేర్చాక వాటిని వినియోగించేవారికి అంతకన్నా గత్యంతరం ఏముంటుందని న్యాయమూర్తి వేసిన ప్రశ్న సహేతుక మైనది. నిజానికి గూగుల్‌తోపాటు బింజ్‌తో సహా డజను వరకూ సెర్చ్ ఇంజన్ సంస్థలున్నాయి. కానీ అనేక ఏళ్లుగా గూగుల్ తెరచాటుగా సాగిస్తున్న గుత్తాధిపత్యం పర్యవసానంగా వాటికంత ప్రాధాన్యం లేకుండా పోయింది. ఆసక్తికరమైన విషయాన్నీ, అవసరమైన సమాచారాన్నీ సేకరించటానికి వినియోగదారుల్లో అత్యధికులు యధాలాపంగా ఆధారపడేది గూగులే. దాంతో పోలిస్తే వ్యక్తిగత గోప్యత మొదలుకొని అనేక అంశాల్లో ఇతర సంస్థల తీరు ఎంతో మెరుగ్గా ఉన్నదని టెక్ నిపుణులు చెబుతున్న మాట. వినియోగదారులు ఎలాంటి అంశాల గురించి ఆరా తీస్తున్నారన్న డేటా అత్యంత కీలకమైనది. ఈ క్రమంలో వినియోగదారుల ఇష్టానిష్టాలూ... వారి అలవాట్లు, ఆసక్తులకు సంబంధించిన సమాచారం వివిధ ఉత్పాదక సంస్థలకు చాలా అవసరం. వినియోగదారులకు తెలియకుండా ఈ వివరాలన్నీ గూగుల్ అమ్ముకుంటున్నదని చాన్నాళ్లుగా వినబడుతోంది. దాంతోపాటు ఈ రంగంలో గుత్తాధిపత్యం ఉండటాన్ని ఆసరా చేసుకుని వాణిజ్య ప్రకటనకర్తలు చెల్లించే రుసుమును అపారంగా పెంచుతోంది. వివిధ విషయాలూ, పదాలూ ఆధారంగా సెర్చ్ ఇంజన్లకు వినియోగించే క్రమసూత్రాలు (అల్గారిథమ్స్) ఏమిటన్నది గూగుల్ అత్యంత రహస్యంగా ఉంచుతోంది. అమెరికాలో దాఖలైన ఈ కేసులో ఆసక్తికరమైన అంశం ఉంది. మున్ముందు ఎన్నో సంస్థల భవితవ్యాన్ని ప్రభావితం చేసే ఈ కేసులో వ్యాజ్యాన్ని ఎదుర్కొన్న గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ మాదిరే తీర్పునిచ్చిన న్యాయమూర్తి అమిత్ మెహతా కూడా భారతీయుడే. యాంటీట్రస్ట్ చట్టం నిజానికి 19వ శతాబ్దం నాటిది. పారిశ్రామికరంగం భిన్నరంగాల్లో ఎదగటానికి గుత్తాధిపత్యం పెను అవరోధమని భావించి అప్పట్లో యాంటీట్రస్ట్ చట్టాన్ని తీసుకొచ్చారు. 1970లలో ఐబీఎం మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్లు, ఆ తర్వాత 1990లలో మైక్రోసాఫ్ట్ ఆపరేటింగ్ వ్యవస్థ పైనా ఇలాంటి వ్యాజ్యాలే పడ్డాయి. అవి భారీగా పరిహారాలు చెల్లించుకున్నాయి. మెయిన్‌ఫ్రేమ్ మార్కెట్ ఇప్పుడు దాదాపు లేదు. గూగుల్ రాకతో మైక్రోసాఫ్ట్ గుత్తాధిపత్యం కూడా అంతరించింది. అలాగే ప్రాసెసర్ల మార్కెట్లో వెలుగులీనిన ఇంటెల్ ప్రభ కూడా మరోపక్క క్షీణిస్తోంది. మారిన పరిస్థితులను అందిపుచ్చుకోలేకపోవటం, కొత్త రంగాలకు విస్తరించటానికి బద్ధకించటం లాంటివి వీటి వర్తమాన అవస్థకు ప్రధానంగా చెప్పుకోవాల్సిన కొన్ని కారణాలు. గూగుల్ వ్యవహారాన్ని కూడా మార్కెట్ శక్తులకే వదిలేస్తే కాగల కార్యం అవే తీరుస్తాయనీ, గత కాలపు చట్టాలతో నియంత్రించటం వ్యర్థమనీ వాదించేవారికి కూడా కొదవ లేదు. అయితే నియంత్రణ వ్యవస్థలు లేకపోతే కొత్త సంస్థల ఆవిర్భావం సాధ్యమేనా? ఏది ఏమైనా తాజా తీర్పు పర్యవసానాలు ప్రపంచవ్యాప్తంగా ఉంటాయన్నది వాస్తవం. -
గూగుల్ రేటింగ్లను నమ్మలేం
న్యూఢిల్లీ: సమాచారం కోసం ఒకప్పుడు తెలిసిన వారిని అడిగే వాళ్లం. ఇంటర్నెట్ అందరికీ చేరువ అయిన తర్వాత గూగుల్ సెర్చింజన్ సమాచార వారధిగా మారిపోయింది. ఫలానా రెస్టారెంట్లో రుచులు ఎలా ఉంటాయి? ఫలానా హాస్పిటల్లో ఏ విధమైన స్పెషలిస్ట్ వైద్యులు ఉన్నారు, వైద్యం ఎలా ఉంటుంది? ఫలానా సూపర్ మార్కెట్లో అన్నీ లభిస్తాయా? ఇలా ఒక్కటని కాదు ఏది అడిగినా సమాచారాన్ని ముందుంచుతుంది గూగుల్. కానీ, గూగుల్ ప్లాట్‌ఫామ్ అందించే రివ్యూల్లో నిజం పాళ్లు ఎంత? ఇదే తెలుసుకుందామని లోకల్ సర్కిల్స్ దేశవ్యాప్తంగా ఒక సర్వే నిర్వహించింది. 357 జిల్లాల పరిధిలో నివసించే 56,000 మంది అభిప్రాయాలను తెలుసుకుంది. ♦ 45 శాతం మంది గూగుల్‌లో రివ్యూలు కచ్చితమైనవి కావని తేల్చి చెప్పారు. ♦ మరో 37 శాతం మంది రివ్యూలు ఎక్కువగా సానుకూలంగా ఉంటున్నట్టు తెలిపారు. ♦ గూగుల్ రివ్యూలను, రేటింగ్లను తాము పూర్తిగా విశ్వసిస్తామని చెప్పిన వారు కేవలం 3 శాతం మందే ఉన్నారు. ♦ 7% మంది గూగుల్ రివ్యూలు, రేటింగ్లను ఎంత మాత్రం నమ్మబోమని స్పష్టం చేశారు. ♦ హోటల్, రెస్టారెంట్, స్టోర్, సర్వీస్ గురించి గూగుల్‌కు వెళ్లిన సమయంలో కనిపించే రివ్యూల్లో నిజం ఎంత? అని సర్వేలో పాల్గొన్న వారిని అడగ్గా పై విధంగా చెప్పారు. ♦ సమాచార అన్వేషణకు గూగుల్‌కు వెళుతున్న వారిలో 88 శాతం మంది రివ్యూలను చూస్తూ, రేటింగ్ గురించి తెలుసుకుంటున్నట్టు ఈ సర్వే గుర్తించింది. ♦ సర్వేలో భాగంగా 67 శాతం మంది పురుషులు, 33 శాతం మంది మహిళలు తమ అభిప్రాయాలు తెలియజేశారు. ♦ ఇందులో 47 శాతం మంది టైర్–1, 33% మంది టైర్–2, మిగిలిన 20% మంది ఇతర పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల నుంచి ఉన్నారు. నకిలీ రివ్యూలపై నిషేధం: గూగుల్ ఈ సర్వే చివరిగా గూగుల్ అభిప్రాయాలను కూడా తెలుసుకుంది.యూజర్ల వాస్తవిక అనుభవం ఆధారంగా వారు అందించే సమాచారం ఇతరులకు సాయంగా ఉండాలన్నదే గూగుల్ రివ్యూల ఉద్దేశ్యమని గూగుల్ అధికార ప్రతినిధి తెలిపారు. ‘‘నకిలీ, మోసపూరిత కంటెంట్‌ను అందించే, ఉద్దేశపూర్వకమైన, కచ్చితత్వం లేని కంటెంట్‌ను నిషేధించే విధానాలు అమల్లో ఉన్నాయి. యూజర్ల నుంచి హెచ్చరికలకు తోడు, రోజులో అన్ని వేళలా ఆపరేటర్లు ఆటోమేటెడ్ సిస్టమ్‌లను పర్యవేక్షిస్తూ ఉంటారు. అనుమానిత ప్రవర్తనను గమనిస్తుంటారు. ఎవరైనా యూజర్ ఏదైనా రివ్యూ/కంటెంట్‌ను మా దృష్టికి తీసుకొస్తే సంబంధిత రివ్యూలను కనిపించకుండా నిలిపివేసే చర్యలు అమల్లో ఉన్నాయి. గూగుల్‌పై విశ్వసనీయ సమాచారం అందించేందుకు టెక్నాలజీపై మా పెట్టుబడులు కొనసాగిస్తాం’’అని గూగుల్ అధికార ప్రతినిధి వెల్లడించారు. తాజాగా ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌లలో రివ్యూలకు సంబంధించి భారతీయ ప్రమాణాల మండలి (బీఐఎస్) ‘ఐఎస్ 19000:2022’ను అమల్లోకి తీసుకురావడం గమనార్హం. రివ్యూలు తీసుకోవడం, వాటిని ప్రచురించడం, రివ్యూలు రాయడం అన్నది నిర్ధేశిత ప్రమాణాల ప్రకారం ఉండాలని ఇది సూచిస్తోంది. సరిగ్గా ఇదే తరుణంలో లోకల్ సర్కిల్స్ సర్వే ఫలితాలు విడుదల కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. -
గూగుల్ సెర్చ్‌లో ఆ సినిమానే టాప్.. ఆర్ఆర్ఆర్ ఎక్కడంటే?
బాలీవుడ్ జంట అలియా భట్, రణ్‌బీర్ కపూర్ జంటగా తెరకెక్కిన చిత్రం 'బ్రహ్మస్త్ర-పార్ట్ 1'. ఈ చిత్రంలో టాలీవుడ్ కింగ్ నాగార్జున, బాలీవుడ్ సీనియర్ నటుడు అమితాబ్ బచ్చన్, మౌని రాయ్ ప్రత్యేక పాత్రల్లో నటించారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ సొంతం చేసుకుంది. విజువల్ వండర్‌గా ఈ సినిమా పలు రికార్డులు సాధించింది. అయితే ఈ ఏడాది అత్యధికంగా గూగుల్‌లో వెతికిన చిత్రంగా నిలిచింది. కేజీఎఫ్- 2, ది కాశ్మీర్ ఫైల్స్, కాంతారను వెనక్కినెట్టి 2022లో అత్యధికంగా గూగుల్ సెర్చ్ చేసిన భారతీయ చిత్రంగా రికార్డు సాధించింది. గూగుల్ సెర్చ్ ఇంజిన్ 'ఇయర్ ఇన్ సెర్చ్ 2022'ని ఆవిష్కరించింది. ఈ ఏడాది 11 నెలల్లో ఎక్కువగా ట్రెండింగ్‌లో ఉన్న జాబితాను ప్రకటించింది. అధిక బడ్జెట్‌తో తెరకెక్కిన ఫాంటసీ అడ్వెంచర్ మూవీ రూ.400 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ జాబితాలో రెండోస్థానంలో కేజీఎఫ్-2, మూడో స్థానంలో ది కశ్మీర్ ఫైల్స్, నాలుగో స్థానంలో ఆర్ఆర్ఆర్, ఐదో స్థానంలో కాంతార నిలిచాయి. ఆ తరువాత వరుసగా పుష్ప-ది రైజ్, విక్రమ్, లాల్ సింగ్ చద్ధా, దృశ్యం-2, థోర్-లవ్ అండ్ థండర్ సినిమాలు ఉన్నాయి. అల్లు అర్జున్ హిట్ మూవీ పుష్ప: ది రైజ్ గతేడాది విడుదలైనప్పటికీ 2022లోనూ ఆధిపత్యం చెలాయించింది. మొదటి పది స్థానాల్లో దక్షిణాదికి చెందిన ఐదు చిత్రాలు ఉండగా.. కేవలం నాలుగు హిందీ చిత్రాలు మాత్రమే చోటు ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాయి. -
గూగుల్‌లో సూపర్ ఫీచర్, ఇక ఇంగ్లీష్‌లో అదరగొట్టేయొచ్చు
ఇంగ్లీష్..! ప్రస్తుతం ఈ పోటీ ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ అవసరమైన లాంగ్వేజ్. ఎడ్యుకేషన్ లేకపోయినా, డిగ్రీలు చదవకపోయినా ఇంగ్లీష్ మాట్లాడడం, చదవడం, రాయడం వస్తే చాలు అవకాశాలు దానంతటే అవే మనల్ని వెతుక్కుంటూ వస్తుంటాయి. అందుకే ఇంగ్లీష్ నేర్పించేందుకు ఇనిస్టిట్యూట్లు, యాప్స్ పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. తాజాగా ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ సైతం యూజర్లకు ఉచితంగా ఇంగ్లీష్ నేర్పించేందుకు సిద్ధమైంది. ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకునే ఔత్సాహికులకు ఇంగ్లీష్ ల్వాంగేజ్ను నేర్పించాలనే ఉద్దేశంతో గూగుల్ కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫీచర్ సాయంతో ప్రతిరోజూ కొత్త ఇంగ్లీష్ అర్ధాన్ని నేర్చుకోవచ్చు. యూజర్లు తమ ఫోన్లలో ఈ ఫీచర్‌ను యాక్టివేషన్ చేసుకుంటే గూగుల్ ప్రతిరోజూ ఒక కొత్త అర్ధాన్ని నేర్పిస్తుంది. ఇందుకోసం సెర్చ్ ఇంజిన్ ఇంగ్లీష్‌లో ప్రావీణ్యులైన అధ్యాపకుల్ని నియమించినట్లు గూగుల్ తన బ్లాగ్ పోస్ట్‌లో పేర్కొంది. తద్వారా ఇంగ్లీష్ భాషపై పట్టుసాధించవచ్చని గూగుల్ అభిప్రాయం వ్యక్తం చేస్తుంది. ఇటీవల విడుదలైన ఓ రిపోర్ట్ ప్రకారం..ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో గూగుల్ ట్రెండ్స్‌లోని టాప్ సెర్చ్‌లో కొన్ని ఇంగ్లీష్ అర్ధాల్ని తెలుసుకునేందుకు ఎక్కువగా సెర్చ్ చేసినట్లు గూగుల్ తెలిపింది. వాటిలో ఇంట్రోవర్ట్, ఇంటిగ్రిటీ అనే పదాలు ఉన్నాయని, అందుకే యూజర్ల రోజూవారి జీవితాల్లో అవసరమైన ఇంగ్లీష్‌లో నైపుణ్యం సాధించేలా ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు గూగుల్ వెల్లడించింది. గూగుల్ ఫీచర్‌ను ఎలా యాక్టీవ్ చేసుకోవాలి గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తరువాత సెర్చ్బార్లో ఉదాహరణకు ఇంటిగ్రిటీ అనే పదం అర్ధం తెలుసుకోవాలని ఉంటే..ముందుగా define అని టైప్ చేయాలి. ఆ వర్డ్ పక్కనే ఇంటిగ్రిటీ (define integrity) అని టైప్ చేస్తే ఆ పదం అర్ధం వస్తుంది. పైన ఇమేజ్‌లో చూపించినట్లుగా సెర్చ్ బార్ పక్కనే బెల్ ఐకాన్ కనిపిస్తుంది. దాన్ని మీరు యాక్టివేషన్ చేసుకుంటే గూగుల్ ప్రతిరోజు ఓ కొత్త అర్ధాన్ని నేర్పించేలా మీ మొబైల్‌కి నోటిఫికేషన్ పంపిస్తుంది. చదవండి: Facebook: పేరు మారిస్తే ఫేస్బుక్ ఇమేజ్ దెబ్బతినదా? -
Google: వెతుకులాట.. అలా మొదలైంది
ఏ ప్రశ్నకైనా సమాధానం కావాలన్నా, ఎటువంటి విషయంలోనైనా అనుమానాల్ని నివృత్తి చేసుకోవాలన్నా.. గూగుల్‌ను ఆశ్రయించాల్సిందే అని ఫిక్స్ అయిపోతోంది మనిషి మెంటాలిటీ. అందుకే రోజూ లక్షల ప్రశ్నలతో సెర్చ్ పేజీలను క్రియేట్ చేసుకునేందుకు శ్రమిస్తోంది గూగుల్‌కి. ఇంతకీ ఈ ఇంటర్నెట్ సెర్చ్ ఇంజిన్‌లో మొట్టమొదటగా సెర్చ్ చేసిన పదం ఏదో తెలుసా? ఇంటర్నెట్లో మనం ఏదైనా వెతకాలంటే సెర్చ్ చేయడం అని కాకుండా.. ‘గూగుల్ ఇట్’ అంటున్నాం. అంటే.. సెర్చింజిన్‌తో మనిషి జీవితంలో అంతలా పాతుకుపోయింది గూగుల్ సెర్చ్. సుమారు 23 ఏళ్ల క్రితం ఆసక్తికరంగానే మొదలైంది. ల్యారీ పేజ్, సెర్గీ బ్రిన్లు ‘బ్యాక్‌రబ్’ పేరుతో సెర్చ్ సాఫ్ట్‌వేర్‌ను ఒకదానిని తయారు చేశారు. అప్పటికే ఆల్ట్విస్టా, లైకోస్, ఆస్క్ జీవ్స్ లాంటి సెర్చ్ ఇంజిన్లు ఉన్నాయి. అయితే అప్పటిదాకా పరిమితంగా ఇంటర్నెట్లో ఉన్న వెతుకులాటను.. ఆ పరిధిని దాటిపోయేలా రూపొందించారు వీళ్లిద్దరూ. 1998 సెప్టెంబర్ 5న బ్యాక్‌రబ్(ఇదే గూగుల్ అయ్యింది) స్టాన్ఫోర్డ్ ఇంజినీరింగ్ స్కూల్ డీన్ జాన్ హెన్నెస్సీకి చూపించారు. ఆయన అప్పటి యూనివర్సిటీ చైర్మన్ గెర్హెర్డ్ కాస్పర్ అనే పేరును టైప్ చేశాడు. ఆల్టావిస్టాలో అదే సెర్చ్ ‘కాస్పర్ ది ఫ్రెండ్లీ ఘోస్ట్’ అని చూపించగా.. వీళ్లు తయారు చేసిన సెర్చ్ ఇంజిన్‌లో మాత్రం సరైన రిజల్ట్(గెర్హర్డ్ కాస్సర్కు సంబంధించిన వివరాలే) వచ్చాయి. ఆ తర్వాత అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ పేరు వైట్‌హౌజ్ రాసలీలల వ్యవహారంతో ప్రపంచమంతా మారుమోగిపోగా.. గూగుల్‌లో సెర్చ్ కోసం బిల్ క్లింటన్ పేరుతో ప్రత్యేక పేజీని క్రియేట్ చేశారు. బ్యాక్‌రబ్.. కంప్యూటర్ గ్రాడ్యుయేట్స్ ల్యారీ పేజ్, సెర్గీ బ్రిన్‌ల బ్యాక్‌రబ్ సృష్టి.. కోడింగ్ అందించిన స్కాట్ హాసన్ 1998లో బ్యాక్బర్.. గూగుల్‌గా మార్పు గూగుల్ అనే పదం గూగోల్ నుంచి వచ్చింది. దాని విలువ టెన్ టుది పవర్ ఆఫ్ 100. దానర్థం.. అపరిమితం. అందుకే ఆ పేరు పెట్టారు. 2000లో ఇంటర్నేషనలైజేషన్ అయ్యింది. మొత్తం పదమూడు లాంగ్వేజ్‌ల్లో రిలీజ్ అయ్యింది. 2001 నుంచి గూగుల్ న్యూస్, గూగుల్ బుక్స్, గూగుల్ స్కాలర్ 2007లో సెర్చ్ ఇంజిన్‌ను వర్టికల్‌గా మార్చేసి.. యూనివర్సల్ సెర్చ్ ఇంజిన్‌గా మార్చేశారు. 2009లో గూగుల్ రియల్ టైంకి వెళ్లింది. తద్వారా లేటెస్ట్ ఆన్లైన్ అప్డేట్స్ కనిపించడం మొదలైంది 2010 నుంచి.. హౌ, వై, వేర్, వాట్.. ఇలాంటి పదాలతో సెర్చ్ వ్యవహారం మొదలైంది. 2012లో.. గూగుల్ వికీపీడియాకు వెళ్లింది. అప్పటి నుంచి జ్ఞానభాండాగారంగా మారిపోయింది. 2014లో.. పాత సెర్చ్ విషయాల్ని తొలగించే వెసులుబాటును తీసుకొచ్చింది చదవండి: ఫిక్స్డ్ డిపాజిట్ల ఆఫర్, గూగుల్ స్పందన -
మొరాయించిన గూగుల్ సేవలు
న్యూఢిల్లీ: జీమెయిల్‌తో సహా ఇతర గూగుల్ సేవల్లో సోమవారం సాయంత్రం 5.17 గంటలకు అంతరాయం ఏర్పడింది. గూగుల్ డాక్స్, క్యాలెండర్, డ్రైవ్, మీట్ వంటి వాటిలోకి లాగిన్ అయినవారికి స్క్రీన్‌పై టెంపరరీ ఎర్రర్ అంటూ మెసేజ్ దర్శనమిచ్చింది. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో ఇదే పరిస్థితి. దాదాపు 45 నిమిషాలపాటు గూగుల్ సేవలు నిలిచిపోయాయి. ‘ఇంటర్నల్ స్టోరేజీ కోటా’లో సమస్యల వల్లే ఈ పరిస్థితి తలెత్తినట్లు గూగుల్ సంస్థ అధికార ప్రతినిధి ప్రకటించారు. సాయంత్రం 6.02 గంటలకల్లా సేవలను పునరుద్ధరించగలిగామని తెలిపారు. అంతరాయం వల్ల ప్రపంచవ్యాప్తంగా 150 కోట్ల మంది ఇబ్బంది పడినట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. గూగుల్ సేవలు నిలిచిపోవడం పట్ల సోషల్ మీడియాలో సెటైర్లు పడ్డాయి. జీమెయిల్ డౌన్, యూట్యూబ్ డౌన్ అంటూ పలువురు నెటిజన్లు ట్విట్టర్లో షేర్ చేశారు. మరికొందరు ‘ఇది యుగాంతం’ అంటూ సరదాగా కామెంట్లు చేయడం విశేషం. -
గూగుల్ సెర్చ్ ఇంజిన్‌లో ఇకపై రీఛార్జ్‌లు కూడా..!
గూగుల్ సెర్చ్ ఇంజిన్‌లో దొరకనిదంటూ ఉండదని మనకు తెలిసిన విషయమే. ఏదైనా మనకు అనుమానం వస్తే వెంటనే గూగుల్ తల్లి ఉంది కదా అంటూ వెంటనే మొబైల్‌ను వాడుతున్న యూజర్లకు గూగుల్ ఇప్పుడు ఓ సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇకపై యూజర్లు గూగుల్ సెర్చ్ ద్వారానే తమ ప్రీపెయిడ్ మొబైల్‌ను రీచార్జ్ చేసుకోవచ్చు. అందుకు గాను గూగుల్ సంస్థ దేశంలోని టెలికాం ఆపరేటర్లయిన ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా, రిలయన్స్ జియో, బీఎస్ఎన్ఎల్ కంపెనీలతో భాగస్వామ్యం అయింది. ఈ క్రమంలో యూజర్లు గూగుల్ సెర్చ్‌లో ప్రీపెయిడ్ మొబైల్ రీచార్జ్ అని టైప్‌చేసి సెర్చ్ చేస్తే వచ్చే ఆప్షన్లలో తమ మొబైల్ నెంబర్, ఆపరేటర్, ప్లాన్ వివరాలను ఎంటర్ చేసి అక్కడి నుంచి నేరుగా తమ మొబైల్‌ను రీచార్జ్ చేసుకోవచ్చు. అందుకుగానూ.. పేటీఎం, ప్రీచార్జ్, గూగుల్ పే తదితర పేమెంట్ ఆప్షన్లను గూగుల్ అందిస్తున్నది. -
భారత్‌లో గూగుల్ నియామకాలు
న్యూఢిల్లీ: టెక్ దిగ్గజం గూగుల్.. ప్రపంచ వ్యాప్తంగా 3,800 మంది ఉద్యోగులను నియమించుకోనుంది. భారత్, అమెరికా, ఫిలిప్పీన్స్ దేశాల్లో ఈ నియామకాలు జరగనున్నాయని సంస్థ శుక్రవారం ప్రకటించింది. కస్టమర్, యూజర్ సపోర్ట్ ఉద్యోగాల్లో నేరుగా కంపెనీ ఉద్యోగాలు ఉండనున్నాయని వివరించింది. గతంలో థర్డ్‌పార్టీ సేవల ద్వారా ఈ నియామకాలు జరిగేవి. ప్రస్తుతం కస్టమర్ సపోర్ట్ విభాగంలో కంపెనీకి 1,000 మంది ఉద్యోగులు ఉన్నారని 2020 చివరినాటికి వీరి సంఖ్యను 4,800 మందికి పెంచనున్నామని ఆపరేషన్స్ సెంటర్ వైస్ ప్రెసిడెంట్ ట్రాయ్ డికెర్సన్ తెలిపారు. -
గూగుల్‌కు భారీ జరిమానా
పారిస్: ఆన్లైన్, వాణిజ్య ప్రకటనల మార్కెట్లో గూగుల్ సంస్థ ప్రదర్శిస్తున్న ఆధిపత్య ధోరణిపై ఫ్రాన్స్ మండిపడింది. గూగుల్‌లో వాణిజ్య ప్రకటనల్ని ఆమోదించడానికి అనుసరించే విధానాలు ఏ మాత్రం పారదర్శకంగా లేవని పేర్కొంటూ దాదాపు రూ. 1,180 కోట్ల జరిమానా విధించింది. గూగుల్ సెర్చ్ ఇంజిన్‌లో యాడ్స్ ఇచ్చే వారందరికీ ఒకే నియమ నిబంధనలు ఉండాలని స్పష్టం చేసింది. ఇప్పటికే ఎన్నో దేశాలు వివిధ కారణాలతో గూగుల్‌కు జరిమానాలు విధించాయి. ఇప్పడు ఆ జాబితాలో ఫ్రాన్స్ కూడా చేరింది. -
గూగులమ్మా..జవాబు చెప్పమ్మా!
సందేహం ఏదైనా.. ఎలాంటిదైనా.. గూగులమ్మ గూటి ముందు వాలడానికి అలవాటు పడిపోయాం. గూగుల్ సెర్చ్ ఇంజన్ లేకపోతే జీవితమే గడవని స్థితికి వచ్చేశాం. ముగ్గుల నుంచి మూంగ్ దాల్ రెసిపీ వరకు.. బిగ్ బాస్ దగ్గర నుంచి బిట్‌కాయిన్ వరకు.. ఎలాంటి సమాచారం కావాలన్నా గూగుల్‌ను ఆశ్రయించాల్సిందే! ‘హౌ టు’‘వాట్ ఈజ్’ట్రెండింగ్ లిస్ట్‌లో ఈ రెండూ టాప్‌లో నిలిచాయి. ముగ్గులు, ఆయుష్మాన్ భారత్ ‘హౌ టు’శోధన జాబితాలో మూడు, ఆరో స్థానాల్లో ఉన్నాయి. మొబైల్ నెట్‌వర్క్‌ను మార్చుకోవడం, బిట్కాయన్లో ఇన్వెస్ట్ చేయడం, హోలి రంగుల్ని కడుక్కోవడం, పదో తరగతి ఫలితాలు చూసుకోవడం, రూబిక్స్ క్యూబ్‌ను సాల్వ్ చేయడం, ఎన్ఆర్సీలో పేర్లను పరిశీలించుకోవడం ఎలాగో తెలుసుకునేందుకు అత్యధికులు గూగుల్‌ను ఆశ్రయించారు. ఇవన్నీ ‘హౌ టు’టాప్ టెన్ ట్రెండింగ్ లిస్టులో చోటు దక్కించుకున్నాయి. ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలనే దానిపై శోధించిన వారిలో ఉత్తరాఖండ్ వాసులు ముందున్నారు. జార్ఖండ్, చత్తీస్‌గఢ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. ఎన్ఆర్సీలో తమ పేర్లను ఎలా పరిశీలించుకోవాలో తెలుసుకునేందుకు అత్యధిక అస్సామీలు గూగుల్‌ను వాడుకున్నారు. అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మేఘాలయ, త్రిపురవాసులు ఆ తర్వాత స్థానాల్లో ఉన్నారు. ’వాట్ ఈజ్’ట్రెండింగ్ లిస్ట్‌లో ‘377 సెక్షన్’నంబర్ వన్ స్థానంలో ఉంది. సిరియా సంక్షోభం, కికి చాలెంజ్, మీ టూ క్యాంపెయిన్, బాల్ ట్యాంపరింగ్, నిపా వైరస్, కార్డియాక్ అరెస్ట్, చంద్ర గ్రహణం, అవిశ్వాస తీర్మానం, ఎస్సీ, ఎస్టీ యాక్ట్ అంశాలు ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. బిట్ కాయిన్‌పై భారీ శోధన.. 2017, 2018ల్లో యూజర్లు అత్యధికంగా సెర్చ్ చేసింది బిట్ కాయిన్ గురించే. రెండేళ్లలోనూ ఇది ట్రెండింగ్‌లో ఉంది. ఇండియాలో బిట్ కాయిన్‌ను ఎలా కొనుగోలు చేయాలో, ఎలా మైనింగ్ చేయాలో, అసలు బిట్ కాయన్ అంటే ఏమిటో గూగుల్ ద్వారా తెలుసుుకోవాలనుకున్న వారు 2017లో అత్యధికంగా ఉన్నారు. ‘వాట్ ఈజ్’ట్రెండింగ్ లిస్ట్‌లో జీస్టీసీ గతేడాది టాప్‌లో ఉంది.. 2017లో.. పాన్ కార్డుతో ఆధార్‌ను ఎలా లింక్ చేసుకోవాలి? జియో ఫోన్‌ను ఎలా బుక్ చేసుకోవాలి? అనేవి హౌ టులో మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. -
గూగుల్‌కు షాక్; రాజీనామాలతో ఉద్యోగుల నిరసన
న్యూయార్క్ : మంచి జీతం, అనువైన పనివేళలు, ఆకర్షణీయమైన వసతులు... మొత్తంగా చెప్పాలంటే ఇంట్లో ఉండే పనిచేస్తున్నామనే భావన. ఇంత మంచి వసతులతో ఉన్న ఉద్యోగాన్ని వదులుకోవడం ఎవరికి మాత్రం ఇష్టంగా ఉంటుంది. కానీ గూగుల్ ఉద్యోగులు మాత్రం ఈ సాహసం చేశారు. కారణం విలువలకు వ్యతిరేకంగా పనిచేయడం ఇష్టం లేక. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఈ ఉదంతం వివరాలు ఇలా ఉన్నాయి.. కంపెనీ కొత్తగా చేపట్టిన ఒక ప్రాజెక్టు కంపెనీ విలువలకు వ్యతిరేకంగా ఉందని భావించిన ఉద్యోగులు కొందరు తమ ఉద్యోగాలకు రాజీనామా చేసి, తమ నిరసన వ్యక్తం చేశారు. అమెరికా రక్షణ విభాగం డ్రోన్ టెక్నాలజీకి సంబంధించి ‘ప్రాజెక్ట్ మావేన్’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ ప్రాజెక్ట్‌లో డ్రోన్లు ఆకాశంలో విహరిస్తూ భూఉపరితలం ఫొటోలను తీయడమే కాక, ఆటోమెటిక్‌గా ఆ ఫొటోల్లో ఉన్న మనుషులను, వస్తువులను వేరు చేసి చూపించనున్నాయి. ఇందుకు అవసరమైన ఆర్టిఫిషల్ ఇంటిలిజెన్స్‌ను అందించేందుకు మూడు నెలల క్రితం అమెరికా రక్షణ మంత్రిత్వ శాఖ, గూగుల్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం కంపెనీలో పనిచేసే చాలామంది ఉద్యోగులకు నచ్చలేదు. యంత్రాలకు మానవుని కంటే ఎక్కువ శక్తి ఇవ్వడం విలువలకు విరుద్ధం. అంతేకాక సైన్యానికి సంబంధించిన పనుల్లో పాలుపంచుకోవడం వల్ల కంపెనీ మీద ఉన్న విశ్వాసం సన్నగిల్లుతుందని భావించి చాలామంది ఉద్యోగులు కంపెనీ సీయివో సుందర్ పిచాయ్‌కు తమ రాజీనామాలు అందచేసి, నిరసనను తెలుపుతున్నారని సంస్థ అధికారి ఒకరు తెలిపారు. వీరితో పాటు కంపెనీలోని మరో 4వేల మంది ఉద్యోగులు కూడా ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించడమే కాక తక్షణం ఈ ప్రాజెక్టును వెనక్కు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తున్నారని వెల్లడించారు. అంతేకాక ఇక మీదట భవిష్యత్తులోనూ సైన్యానికి సంబంధించి ఎటువంటి ప్రాజెక్టులను చేపట్టవద్దనే నిబంధనను కూడా తీసుకురావాలని తెలిపారు. అయితే ఈ చర్యలేవి ఫలించలేదు, కంపెనీ ఉన్నాతాధికారులు తమ వైఖరిని మార్చుకోలేదు. పైగా ఈ నిరసనల మధ్యనే గూగుల్ పెంటగాన్ కంపెనీ క్లౌడ్ కంప్యూటింగ్ ఆధారిత డిఫెన్స్ ప్రాజెక్టును దక్కించుకోవడానికి ముమ్మర ప్రయత్నాలు చేస్తుండటం గమనార్హం. -
మళ్లీ తప్పులో కాలేసిన గూగుల్
సాక్షి, న్యూఢిల్లీ: సెర్చింజన్ దిగ్గజం గూగుల్ వరుస తప్పులతో అభాసుపాలు అవుతోంది. ఆ మధ్య నెహ్రూ సంబంధిత సమాచారానికి మోదీ ఫొటోను ఉంచి ట్రోలింగ్‌ను ఎదుర్కున్న విషయం తెలిసిందే. తాజాగా ఇప్పుడు మరోసారి అలాంటి పొరపాటే చేసింది. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ 157వ జయంతి సందర్భంగా గూగుల్‌లో ‘భారత జాతీయ కవి’ పేరిట టాప్ ట్రెండింగ్‌ను సృష్టించింది. అయితే గూగుల్‌లో ఆ పేరుతో పరిశోధించిన వారు దిగ్భ్రాంతికి లోనవుతున్నారు. నోబెల్ గ్రహీత ఠాగూర్ ప్లేస్‌లో.. ఆధ్యాత్మిక వేత్త శ్రీ అరబిందో ఫోటో ప్రదర్శితమైంది. దీనికితోడు మే 9న ఠాగూర్ పుట్టిన రోజు అయితే... తేదీని మే 7 అని తప్పుగా చూపిస్తోంది. ఈ వ్యవహారంపై బెంగాలీలు మండిపడుతున్నారు. తప్పులు లేకుండా ప్రచురించటం గూగుల్‌కి సాధ్యం కాదా? అంటూ కొందరు నిలదీస్తున్నారు. మరికొందరు తమదైన శైలిలో సోషల్ మీడియాలో గూగుల్‌పై సెటైర్లు పేలుస్తున్నారు. -
అమిత్ సింఘాల్ రిటైర్.. గూగుల్‌కు తీరని లోటు
శాన్ఫ్రాన్సిస్కో: గూగుల్ సంస్థలో టెక్నాలజీని అభివృద్ధి పరచడంలో 'అల్పాబెట్' సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అమిత్ సింఘాల్(48) పాత్ర మరువలేనిది. అమిత్ ఈ నెల 26న పదవి విరమణతో గూగుల్‌కు వీడ్కోలు పలకనున్నారు. అమిత్ నిష్క్రమణ తమ సంస్థకు తీరని లోటుగా గూగుల్ భావిస్తోంది. ప్రస్తుతం ఆర్టీఫీషియల్ ఇంటిలిజెన్స్‌లో పనిచేస్తున్న జాన్ గియానేంద్రియా, అమిత్ స్థానాన్ని భర్తీ చేయనున్నారు. భారత్‌కు చెందిన సింఘాల్ 16 ఏళ్ల కిందట గూగుల్లోకి అడుగు పెట్టారు. అమిత్ పదవి విరమణ అనంతరం.. తన కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపాలనుకుంటున్నట్టు తెలిపారు. కార్నెల్ నుంచి ఆయనకు కంప్యూటర్ సైన్స్‌లో డాక్టరేట్ లభించింది. గూగుల్లోకి రాకముందు ఏటీ అండ్ టీ ల్యాబ్స్‌లో ఆయన పనిచేశారు. గూగుల్‌లో చేరిన కొంతకాలంలోనే అల్గారిథమ్‌లను తిరిగిరాయడంలో తొలి విజయం సాధించారు అమిత్. గూగుల్ సెర్చ్ ఇంజిన్ రూపొందించడంలో భాగంగా స్పెల్ చెక్ వంటి ఫీచర్లతో అమిత్ ఎంతగానో కృషి చేశారు. -
చిక్కుల్లో గూగుల్ యాజమాన్యం
శాన్ ఫ్రాన్సిస్కో: గూగుల్ సంస్థ తమ కంపెనీల విషయాలను తక్కువ చేసి చూపుతుందని అమెరికా, యూరప్ ఖండాలలో ఫిర్యాదులు నమోదవుతున్నాయి. అదేవిధంగా భారత్ లో కూడా ఈ సమస్యలు తలెత్తుతున్నాయిని పలు కంపెనీలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు చెందిన నిఘా విభాగం ఆ సంస్థ తీరుపై తీవ్ర అభ్యంతరాలు లేవనెత్తడంతో పాటు వివరణ కోరింది. కంపెనీల మధ్య నెలకొన్న కాంపిటీషన్ వల్ల ఈ సమస్యలు వస్తున్నాయని కొందరు వాదిస్తున్నారు. కంపెనీల ఆర్థిక లావాదేవిలు, ఆన్ లైన్ ప్రకటనల ర్యాంకింగ్స్, సేవల వివరాలను గూగుల్ సెర్చ్ ఇంజన్ తప్పుగా చూపిస్తోందంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బ్రెజిల్, మెక్సికోలలో సొంత కంపెనీల సేవలను ఎక్కువ చేసి చూపిస్తూ ఇతర కంపెనీల మార్కెట్లను దెబ్బతీస్తుందని స్థానిక వ్యాపారవేత్తలు భావిస్తున్నారు. ఇదేతరహాలో భారత వెబ్ సైట్ భారత్ మాట్రిమోని, కన్స్యూమర్ అండ్ ట్రస్ట్ సొసైటీలు కూడా అవాస్తవాలను ప్రచారం చేయడంతో తమ సైట్ల సేవలు కాస్త నెమ్మదించాయని, ప్రజలలో అపనమ్మకాలు పెరిగే అవకాశాలు లేకపోలేదని ఆరోపిస్తున్నాయి. సెప్టెంబర్ 10 లోపు వివరణ ఇచ్చుకోవాలని కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా, గూగుల్ సంస్థ నిర్వాహకులకు సూచించగా, గడువును మరింత పొడిగించాలని గూగుల్ కోరుతోంది. -
గూగుల్ : చిన్నారి డూడుల్
నిన్న మీరు గూగుల్ సెర్చ్ ఇంజన్ చూసే ఉంటారు. భారతీయ మహిళకు ఆకాశమే హద్దు అనే అర్థం వచ్చేలా గీసిన గూగుల్ డూడుల్ చాలామంది మనసు దోచుకుంది. ఏ చిత్రకారుడు గీసిన బొమ్మ ఇది...అని అందరినీ ఆలోచింపజేసింది. అసలు విషయం ఏంటంటే... ఏటా గూగుల్ ఇండియా... పాఠశాల విద్యార్థులకు డూడుల్ చిత్రాల పోటీలు పెడుతుంది. అదేవిధంగా ఈ ఏడాది ‘సెలబ్రేటింగ్ ఇండియన్ ఉమెన్’ అనే థీమ్‌తో నిర్వహించిన ఈ పోటీలకు పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. దేశవ్యాప్తంగా 100 పట్టణాలలోని 1500 పాఠశాలల నుంచి లక్షా యాభైవేల ఎంట్రీలు వచ్చాయి. వాటిలో పన్నెండు డూడుల్స్‌ని అత్యుత్తమ గూగుల్ డూడుల్స్‌గా న్యాయనిర్ణేతలు ఎంపికచేశారు. వీటిలో పుణెలోని కళ్యాణినగర్ బిషప్ కో ఎడ్యుకేషన్ పాఠశాలలో పదవతరగతి చదువుతున్న గాయత్రి కేతారామన్ పంపిన డూడుల్‌కి మొదటి బహుమతి వచ్చింది. కేతారామన్ చిత్రీకరించిన ఈ ప్రత్యేక డూడుల్ బాలల దినోత్సవం సందర్భంగా నిన్న గూగుల్ సెర్చ్ ఇంజన్‌గా ప్రదర్శించారు. ఈ పోటీల్లో విజేతలుగా నిలిచిన పన్నెండు మందిని గూగుల్ ఇండియా మేనేజింగ్ డెరైక్టర్ రాజన్ ఆనందన్ న్యూఢిల్లీలో సత్కరించనున్నారు. ఒక పక్క స్కూలు పాఠాలు వింటూనే మరో పక్క గూగుల్ డూడుల్స్పై కూడా ఒక చెయ్యి వేస్తున్న ఈ హైటెక్ చిన్నారులను అభినందించాల్సిందే.