అమిత్ సింఘాల్ రిటైర్.. గూగుల్‌కు తీరని లోటు
శాన్‌ఫ్రాన్సిస్కో: గూగుల్ సంస్థలో టెక్నాలజీని అభివృద్ధి పరచడంలో 'అల్పాబెట్' సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అమిత్ సింఘాల్(48) పాత్ర మరువలేనిది. అమిత్ ఈ నెల 26న పదవి విరమణతో గూగుల్‌కు వీడ్కోలు పలకనున్నారు. అమిత్ నిష్క్రమణ తమ సంస్థకు తీరని లోటుగా గూగుల్ భావిస్తోంది.
ప్రస్తుతం ఆర్టీఫీషియల్ ఇంటిలిజెన్స్‌లో పనిచేస్తున్న జాన్ గియానేంద్రియా, అమిత్ స్థానాన్ని భర్తీ చేయనున్నారు. భారత్‌కు చెందిన సింఘాల్ 16 ఏళ్ల కిందట గూగుల్‌లోకి అడుగు పెట్టారు. అమిత్ పదవి విరమణ అనంతరం.. తన కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపాలనుకుంటున్నట్టు తెలిపారు.
కార్నెల్ నుంచి ఆయనకు కంప్యూటర్ సైన్స్‌లో డాక్టరేట్ లభించింది. గూగుల్‌లోకి రాకముందు ఏటీ అండ్ టీ ల్యాబ్స్‌లో ఆయన పనిచేశారు. గూగుల్‌లో చేరిన కొంతకాలంలోనే అల్గారిథమ్‌లను తిరిగిరాయడంలో తొలి విజయం సాధించారు అమిత్. గూగుల్ సెర్చ్ ఇంజిన్ రూపొందించడంలో భాగంగా స్పెల్ చెక్ వంటి ఫీచర్లతో అమిత్ ఎంతగానో కృషి చేశారు.