అతిథిగా వచ్చి అడిగినవన్నీ గుక్క తిప్పుకోకుండా చెబుతున్న సిద్ధుణ్ణి చూసి సంభ్రమాశ్చర్యాలకు లోనయిన ప్రవరాఖ్యుడు ‘సృష్టికర్త బ్రహ్మకైనా నేర్వశక్యంగాని ఇన్ని సంగతులు తమరికెలా సాధ్య మయ్యాయ’ని ఎంతో వినయంగా అడుగుతాడు ‘మనుచరిత్ర’ కావ్యంలో. ఈ ఆధునాతన యుగంలో ఆ సిద్ధుణ్ణి మించిపోయి, అడిగిన అరక్షణంలో అన్నిటినీ గూగుల్ ఏకరువు పెడుతోంది. అసలు గూగుల్ లేకపోతే మనకు చాలా విషయాలు తెలిసేవికాదని, మన జ్ఞానానికి ఎన్నో పరిమితులుండేవని ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది విశ్వసిస్తారు.
అంతటి గూగుల్‌పై అమెరికా ఫెడరల్ న్యాయ స్థానం రూపంలో పిడుగుపడింది. ఈ సంస్థ గుత్తాధిపత్య పోకడలు పోతోందని న్యాయ స్థానం తీర్పునిచ్చింది. పోటీదారులందరికీ సమానావకాశాలు ఉండితీరాలన్న స్వేచ్ఛా మార్కెట్ సూత్రాలకు తిలోదకాలిచ్చి, చట్ట ఉల్లంఘనలకు పాల్పడి వక్రమార్గంలో లాభార్జనకు పాల్పడుతున్నదని తేల్చి చెప్పింది. సంస్థపై ఏ చర్యలు తీసుకోవాలన్నది న్యాయస్థానం ఇంకా చెప్పలేదు. అయితే దాన్ని భిన్న సంస్థలుగా విభజించాలని ఆదేశించటంతో సహా ఎలాంటి చర్యలనైనా సూచించే అవకాశం ఉంది.
అసలు ఒక టెక్ దిగ్గజంగా, మహాసంస్థగా వెలిగిపోతున్న గూగుల్ ఏడెనిమిదేళ్ల క్రితం ఒక పెద్ద కార్పొరేట్ సంస్థ ‘ఆల్ఫాబెట్’లో ఒదిగి చిన్నబోయింది. ఇప్పటికే అమెజాన్, మెటా, యాపిల్ వగైరా భారీ కార్పొరేట్ కంపెనీలపై నడుస్తున్న వ్యాజ్యాలకు తాజా తీర్పు ప్రమాణంగా మారుతుందన్నది గుత్తాధిపత్య నిరోధక చట్టాల నిపుణులంటున్న మాట. నిజానికి మైక్రోసాఫ్ట్‌పై 2000 సంవత్సరంలో వెలువడిన యాంటీట్రస్ట్ తీర్పు ప్రస్తుత గూగుల్ కేసును ప్రభావితం చేసింది. ఈ కేసు పరిష్కారానికి ఏం చేయాలన్న అంశంపై ప్రభుత్వమూ, గూగుల్ మాట్లాడుకోవాలని, వచ్చే నెల 6 నాటికి నిర్ణయం తెలపాలని న్యాయమూర్తి చెప్పారు. ఈ తీర్పుపై గూగుల్ ఎటూ అప్పీల్‌కి పోతుంది.
గూగుల్‌పై వచ్చిన ఆరోపణలు కొట్టివేయదగ్గవి కాదు. తన సెర్చ్ ఇంజన్‌ను సెల్‌ఫోన్లలో, బ్రౌజర్‌లలో అమర్చేలా యాపిల్‌తో సహా అనేక స్మార్ట్ ఫోన్ కంపెనీలకూ, బ్రౌజర్ కంపెనీలకూ గూగుల్ ఒక్క 2021లోనే 2,600 కోట్ల డాలర్లు చెల్లించిందని, ఇందువల్ల ఇతర సంస్థలు భారీగా నష్టపోయాయని ఆ అభియోగాల సారాంశం. ఒక అంచనా ప్రకారం ప్రపంచవ్యాప్తంగా వినియోగ దారుల్లో 90 శాతం మంది గూగుల్ సెర్చ్ ఇంజన్‌పైనే ఆధారపడుతున్నారు.
అయితే వినియోగదారులను తాము నియంత్రించటమో, నిర్బంధించటమో చేయటం లేదని... ఎందులో మెరుగైన ఫలితా లొస్తాయో తేల్చుకుని స్వచ్ఛంగా తమను ఎంచుకుంటున్నారని గూగుల్ వాదించింది. వర్తమానంలో ఇంటర్నెట్ తెరిచాక సాగే అత్యంత ప్రధాన వ్యాపకం శోధించటమే. అయితే సెల్‌ఫోన్ తయారీ దార్లకూ, బ్రౌజర్ కంపెనీలకూ భారీ చెల్లింపులు చేసి గూగుల్ సెర్చ్ ఇంజన్‌ను చేర్చాక వాటిని వినియోగించేవారికి అంతకన్నా గత్యంతరం ఏముంటుందని న్యాయమూర్తి వేసిన ప్రశ్న సహేతుక మైనది.
నిజానికి గూగుల్‌తోపాటు బింజ్‌తో సహా డజను వరకూ సెర్చ్ ఇంజన్ సంస్థలున్నాయి. కానీ అనేక ఏళ్లుగా గూగుల్ తెరచాటుగా సాగిస్తున్న గుత్తాధిపత్యం పర్యవసానంగా వాటికంత ప్రాధాన్యం లేకుండా పోయింది. ఆసక్తికరమైన విషయాన్నీ, అవసరమైన సమాచారాన్నీ సేకరించటానికి వినియోగదారుల్లో అత్యధికులు యధాలాపంగా ఆధారపడేది గూగులే. దాంతో పోలిస్తే వ్యక్తిగత గోప్యత మొదలుకొని అనేక అంశాల్లో ఇతర సంస్థల తీరు ఎంతో మెరుగ్గా ఉన్నదని టెక్ నిపుణులు చెబుతున్న మాట.
వినియోగదారులు ఎలాంటి అంశాల గురించి ఆరా తీస్తున్నారన్న డేటా అత్యంత కీలకమైనది. ఈ క్రమంలో వినియోగదారుల ఇష్టానిష్టాలూ... వారి అలవాట్లు, ఆసక్తులకు సంబంధించిన సమాచారం వివిధ ఉత్పాదక సంస్థలకు చాలా అవసరం. వినియోగదారులకు తెలియకుండా ఈ వివరాలన్నీ గూగుల్ అమ్ముకుంటున్నదని చాన్నాళ్లుగా వినబడుతోంది. దాంతోపాటు ఈ రంగంలో గుత్తాధిపత్యం ఉండటాన్ని ఆసరా చేసుకుని వాణిజ్య ప్రకటనకర్తలు చెల్లించే రుసుమును అపారంగా పెంచుతోంది. వివిధ విషయాలూ, పదాలూ ఆధారంగా సెర్చ్ ఇంజన్లకు వినియోగించే క్రమసూత్రాలు (అల్‌గారిథమ్స్) ఏమిటన్నది గూగుల్ అత్యంత రహస్యంగా ఉంచుతోంది.
అమెరికాలో దాఖలైన ఈ కేసులో ఆసక్తికరమైన అంశం ఉంది. మున్ముందు ఎన్నో సంస్థల భవితవ్యాన్ని ప్రభావితం చేసే ఈ కేసులో వ్యాజ్యాన్ని ఎదుర్కొన్న గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ మాదిరే తీర్పునిచ్చిన న్యాయమూర్తి అమిత్ మెహతా కూడా భారతీయుడే. యాంటీట్రస్ట్ చట్టం నిజానికి 19వ శతాబ్దం నాటిది. పారిశ్రామికరంగం భిన్నరంగాల్లో ఎదగటానికి గుత్తాధిపత్యం పెను అవరోధమని భావించి అప్పట్లో యాంటీట్రస్ట్ చట్టాన్ని తీసుకొచ్చారు.
1970లలో ఐబీఎం మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్లు, ఆ తర్వాత 1990లలో మైక్రోసాఫ్ట్ ఆపరేటింగ్ వ్యవస్థ పైనా ఇలాంటి వ్యాజ్యాలే పడ్డాయి. అవి భారీగా పరిహారాలు చెల్లించుకున్నాయి. మెయిన్‌ఫ్రేమ్ మార్కెట్ ఇప్పుడు దాదాపు లేదు. గూగుల్ రాకతో మైక్రోసాఫ్ట్ గుత్తాధిపత్యం కూడా అంతరించింది. అలాగే ప్రాసెసర్ల మార్కెట్‌లో వెలుగులీనిన ఇంటెల్ ప్రభ కూడా మరోపక్క క్షీణిస్తోంది.
మారిన పరిస్థితులను అందిపుచ్చుకోలేకపోవటం, కొత్త రంగాలకు విస్తరించటానికి బద్ధకించటం లాంటివి వీటి వర్తమాన అవస్థకు ప్రధానంగా చెప్పుకోవాల్సిన కొన్ని కారణాలు. గూగుల్ వ్యవహారాన్ని కూడా మార్కెట్ శక్తులకే వదిలేస్తే కాగల కార్యం అవే తీరుస్తాయనీ, గత కాలపు చట్టాలతో నియంత్రించటం వ్యర్థమనీ వాదించేవారికి కూడా కొదవ లేదు. అయితే నియంత్రణ వ్యవస్థలు లేకపోతే కొత్త సంస్థల ఆవిర్భావం సాధ్యమేనా? ఏది ఏమైనా తాజా తీర్పు పర్యవసానాలు ప్రపంచవ్యాప్తంగా ఉంటాయన్నది వాస్తవం.
గూగుల్‌పై కన్నెర్ర!
Published Fri, Aug 9 2024 12:03 AM | Last Updated on Fri, Aug 9 2024 12:03 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment