Browser
-
గూగుల్‌పై కన్నెర్ర!
అతిథిగా వచ్చి అడిగినవన్నీ గుక్క తిప్పుకోకుండా చెబుతున్న సిద్ధుణ్ణి చూసి సంభ్రమాశ్చర్యాలకు లోనయిన ప్రవరాఖ్యుడు ‘సృష్టికర్త బ్రహ్మకైనా నేర్వశక్యంగాని ఇన్ని సంగతులు తమరికెలా సాధ్య మయ్యాయ’ని ఎంతో వినయంగా అడుగుతాడు ‘మనుచరిత్ర’ కావ్యంలో. ఈ ఆధునాతన యుగంలో ఆ సిద్ధుణ్ణి మించిపోయి, అడిగిన అరక్షణంలో అన్నిటినీ గూగుల్ ఏకరువు పెడుతోంది. అసలు గూగుల్ లేకపోతే మనకు చాలా విషయాలు తెలిసేవికాదని, మన జ్ఞానానికి ఎన్నో పరిమితులుండేవని ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది విశ్వసిస్తారు. అంతటి గూగుల్‌పై అమెరికా ఫెడరల్ న్యాయ స్థానం రూపంలో పిడుగుపడింది. ఈ సంస్థ గుత్తాధిపత్య పోకడలు పోతోందని న్యాయ స్థానం తీర్పునిచ్చింది. పోటీదారులందరికీ సమానావకాశాలు ఉండితీరాలన్న స్వేచ్ఛా మార్కెట్ సూత్రాలకు తిలోదకాలిచ్చి, చట్ట ఉల్లంఘనలకు పాల్పడి వక్రమార్గంలో లాభార్జనకు పాల్పడుతున్నదని తేల్చి చెప్పింది. సంస్థపై ఏ చర్యలు తీసుకోవాలన్నది న్యాయస్థానం ఇంకా చెప్పలేదు. అయితే దాన్ని భిన్న సంస్థలుగా విభజించాలని ఆదేశించటంతో సహా ఎలాంటి చర్యలనైనా సూచించే అవకాశం ఉంది. అసలు ఒక టెక్ దిగ్గజంగా, మహాసంస్థగా వెలిగిపోతున్న గూగుల్ ఏడెనిమిదేళ్ల క్రితం ఒక పెద్ద కార్పొరేట్ సంస్థ ‘ఆల్ఫాబెట్’లో ఒదిగి చిన్నబోయింది. ఇప్పటికే అమెజాన్, మెటా, యాపిల్ వగైరా భారీ కార్పొరేట్ కంపెనీలపై నడుస్తున్న వ్యాజ్యాలకు తాజా తీర్పు ప్రమాణంగా మారుతుందన్నది గుత్తాధిపత్య నిరోధక చట్టాల నిపుణులంటున్న మాట. నిజానికి మైక్రోసాఫ్ట్‌పై 2000 సంవత్సరంలో వెలువడిన యాంటీట్రస్ట్ తీర్పు ప్రస్తుత గూగుల్ కేసును ప్రభావితం చేసింది. ఈ కేసు పరిష్కారానికి ఏం చేయాలన్న అంశంపై ప్రభుత్వమూ, గూగుల్ మాట్లాడుకోవాలని, వచ్చే నెల 6 నాటికి నిర్ణయం తెలపాలని న్యాయమూర్తి చెప్పారు. ఈ తీర్పుపై గూగుల్ ఎటూ అప్పీల్‌కి పోతుంది.గూగుల్‌పై వచ్చిన ఆరోపణలు కొట్టివేయదగ్గవి కాదు. తన సెర్చ్ ఇంజన్‌ను సెల్ఫోన్లలో, బ్రౌజర్లలో అమర్చేలా యాపిల్‌తో సహా అనేక స్మార్ట్ ఫోన్ కంపెనీలకూ, బ్రౌజర్ కంపెనీలకూ గూగుల్ ఒక్క 2021లోనే 2,600 కోట్ల డాలర్లు చెల్లించిందని, ఇందువల్ల ఇతర సంస్థలు భారీగా నష్టపోయాయని ఆ అభియోగాల సారాంశం. ఒక అంచనా ప్రకారం ప్రపంచవ్యాప్తంగా వినియోగ దారుల్లో 90 శాతం మంది గూగుల్ సెర్చ్ ఇంజన్‌పైనే ఆధారపడుతున్నారు. అయితే వినియోగదారులను తాము నియంత్రించటమో, నిర్బంధించటమో చేయటం లేదని... ఎందులో మెరుగైన ఫలితా లొస్తాయో తేల్చుకుని స్వచ్ఛంగా తమను ఎంచుకుంటున్నారని గూగుల్ వాదించింది. వర్తమానంలో ఇంటర్నెట్ తెరిచాక సాగే అత్యంత ప్రధాన వ్యాపకం శోధించటమే. అయితే సెల్‌ఫోన్ తయారీ దార్లకూ, బ్రౌజర్ కంపెనీలకూ భారీ చెల్లింపులు చేసి గూగుల్ సెర్చ్ ఇంజన్‌ను చేర్చాక వాటిని వినియోగించేవారికి అంతకన్నా గత్యంతరం ఏముంటుందని న్యాయమూర్తి వేసిన ప్రశ్న సహేతుక మైనది. నిజానికి గూగుల్‌తోపాటు బింజ్‌తో సహా డజను వరకూ సెర్చ్ ఇంజన్ సంస్థలున్నాయి. కానీ అనేక ఏళ్లుగా గూగుల్ తెరచాటుగా సాగిస్తున్న గుత్తాధిపత్యం పర్యవసానంగా వాటికంత ప్రాధాన్యం లేకుండా పోయింది. ఆసక్తికరమైన విషయాన్నీ, అవసరమైన సమాచారాన్నీ సేకరించటానికి వినియోగదారుల్లో అత్యధికులు యధాలాపంగా ఆధారపడేది గూగులే. దాంతో పోలిస్తే వ్యక్తిగత గోప్యత మొదలుకొని అనేక అంశాల్లో ఇతర సంస్థల తీరు ఎంతో మెరుగ్గా ఉన్నదని టెక్ నిపుణులు చెబుతున్న మాట. వినియోగదారులు ఎలాంటి అంశాల గురించి ఆరా తీస్తున్నారన్న డేటా అత్యంత కీలకమైనది. ఈ క్రమంలో వినియోగదారుల ఇష్టానిష్టాలూ... వారి అలవాట్లు, ఆసక్తులకు సంబంధించిన సమాచారం వివిధ ఉత్పాదక సంస్థలకు చాలా అవసరం. వినియోగదారులకు తెలియకుండా ఈ వివరాలన్నీ గూగుల్ అమ్ముకుంటున్నదని చాన్నాళ్లుగా వినబడుతోంది. దాంతోపాటు ఈ రంగంలో గుత్తాధిపత్యం ఉండటాన్ని ఆసరా చేసుకుని వాణిజ్య ప్రకటనకర్తలు చెల్లించే రుసుమును అపారంగా పెంచుతోంది. వివిధ విషయాలూ, పదాలూ ఆధారంగా సెర్చ్ ఇంజన్లకు వినియోగించే క్రమసూత్రాలు (అల్గారిథమ్స్) ఏమిటన్నది గూగుల్ అత్యంత రహస్యంగా ఉంచుతోంది. అమెరికాలో దాఖలైన ఈ కేసులో ఆసక్తికరమైన అంశం ఉంది. మున్ముందు ఎన్నో సంస్థల భవితవ్యాన్ని ప్రభావితం చేసే ఈ కేసులో వ్యాజ్యాన్ని ఎదుర్కొన్న గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ మాదిరే తీర్పునిచ్చిన న్యాయమూర్తి అమిత్ మెహతా కూడా భారతీయుడే. యాంటీట్రస్ట్ చట్టం నిజానికి 19వ శతాబ్దం నాటిది. పారిశ్రామికరంగం భిన్నరంగాల్లో ఎదగటానికి గుత్తాధిపత్యం పెను అవరోధమని భావించి అప్పట్లో యాంటీట్రస్ట్ చట్టాన్ని తీసుకొచ్చారు. 1970లలో ఐబీఎం మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్లు, ఆ తర్వాత 1990లలో మైక్రోసాఫ్ట్ ఆపరేటింగ్ వ్యవస్థ పైనా ఇలాంటి వ్యాజ్యాలే పడ్డాయి. అవి భారీగా పరిహారాలు చెల్లించుకున్నాయి. మెయిన్‌ఫ్రేమ్ మార్కెట్ ఇప్పుడు దాదాపు లేదు. గూగుల్ రాకతో మైక్రోసాఫ్ట్ గుత్తాధిపత్యం కూడా అంతరించింది. అలాగే ప్రాసెసర్ల మార్కెట్లో వెలుగులీనిన ఇంటెల్ ప్రభ కూడా మరోపక్క క్షీణిస్తోంది. మారిన పరిస్థితులను అందిపుచ్చుకోలేకపోవటం, కొత్త రంగాలకు విస్తరించటానికి బద్ధకించటం లాంటివి వీటి వర్తమాన అవస్థకు ప్రధానంగా చెప్పుకోవాల్సిన కొన్ని కారణాలు. గూగుల్ వ్యవహారాన్ని కూడా మార్కెట్ శక్తులకే వదిలేస్తే కాగల కార్యం అవే తీరుస్తాయనీ, గత కాలపు చట్టాలతో నియంత్రించటం వ్యర్థమనీ వాదించేవారికి కూడా కొదవ లేదు. అయితే నియంత్రణ వ్యవస్థలు లేకపోతే కొత్త సంస్థల ఆవిర్భావం సాధ్యమేనా? ఏది ఏమైనా తాజా తీర్పు పర్యవసానాలు ప్రపంచవ్యాప్తంగా ఉంటాయన్నది వాస్తవం. -
మెర్లిన్..: మెరుపై మెరిసెన్
‘కాల్ చాట్‌జీపీటీ వేరెవర్ యూ ఆర్’ అంటూ రంగంలోకి దిగిన చాట్‌జీపీటీ యాప్ ‘మెర్లిన్’ మెరుపు వేగంతో విజయం సాధించింది. ‘పవర్ ఆఫ్ చాట్‌జీపీటీ’ని యూజర్‌కు దగ్గర చేసి, టైమ్ సేవ్ చేసే ‘మెర్లిన్’ సృష్టికర్తలు ప్రత్యూష్ రాయ్, సిద్ధార్థ సక్సెనా, సిరిసేందు సర్కార్లు మూకుమ్మడిగా చెప్పే మాట... ‘కొత్తగా ఆలోచించడం అనేది విజయానికి తొలి మెట్టు’ గ్లోబల్ కన్సల్టెన్సీ ‘బీసీజీ’లో పనిచేస్తున్న సమయంలో ఎన్నో విలువైన అనుభవాలను మూటగట్టుకున్నాడు ప్రత్యూష్రాయ్. ఆ అనుభవాలను విశ్లేషించుకునే క్రమంలో తనకు కొత్తగా ఏదైనా చేయాలనిపించేది. ఐఐటీ–కాన్పూర్‌లో సివిల్ ఇంజనీరింగ్ చేసిన ప్రత్యూష్ రాయ్ తన ఇద్దరు స్నేహితులు సిద్ధార్థ సక్సెనా, సిరిసేందు సర్కార్లతో మాట్లాడాడు. ‘కొత్తగా అనిపించే అర్థవంతమైన పని ఏదైనా చేద్దాం’ అనుకున్నారు వాళ్లు. అలా వారి మేధోమథనం నుంచి పుట్టిన అంకురమే...మెర్లిన్. చాట్‌జీపీటీ యాప్ ‘మెర్లిన్’ మెరుపు వేగంతో విజయం సాధించింది. ప్రారంభమైన ఆరునెలల్లోనే ఈ యాప్‌ను వందలాది మంది ఇన్స్టాల్ చేసుకున్నారు. టెక్ కంపెనీ ‘ఫోయర్’లో విలీనం అయిన తరువాత యూఎస్, తూర్పు ఆసియా, యూరప్‌లలో ‘మెర్లిన్’కు మంచి మార్కెట్ ఏర్పడింది. ‘ఎలాంటి అయోమయాలకు, సంక్లిష్టతలకు తావు లేకుండా బ్రౌజర్లో భాగమయ్యే సింపుల్ ప్రాడక్ట్ ఇది. యూట్యూబ్, జీమెయిల్, ట్విట్టర్, లింక్డ్ఇన్... మొదలైన వాటికి సంబంధించి క్లిష్టమైన సమస్యల పరిష్కారం విషయంలో డైలీ యాక్టివ్ యూజర్లకు ఉపయోగపడుతుంది. మార్కెటర్స్, రిక్రూటర్స్‌కు ఒక వాక్యం ట్వీట్ నుంచి ఎన్నో పదాల ఇమెయిల్ వరకు ఎన్నో పనుల్లో టైమ్ వృథా కాకుండా చూస్తుంది. ఇది సింపుల్ క్రోమ్ ఎక్స్టెన్షన్. బటన్‌ను ఒక్కసారి క్లిక్ చేస్తే చాలు చాట్‌జీపీటీ మనల్ని వెదుక్కుంటూ వస్తుంది’ అని ‘మెర్లిన్’ గురించి చెబుతున్నాడు ప్రత్యూష్ రాయ్. యూట్యూబ్‌కు సంబంధించి ‘మెర్లిన్’ను ‘యూట్యూబ్ సమ్మరైజర్’గా ఉపయోగించకుంటున్నారు యూజర్లు. ఒక యూట్యూబ్ వీడియోను పూర్తిగా చూడనవసరం లేకుండానే దానిలోని ముఖ్యమైన సెగ్మెంట్ల గురించి ‘మెర్లిన్’ చెబుతుంది. పర్సనలైజ్డ్ ప్రాంప్ట్స్ విషయంలోనూ ‘మెర్లిన్’ ఉపయోగపడుతుంది. మన రైటింగ్ స్టైల్‌ను కాప్చర్ చేస్తుంది. ‘నిజానికి మా దృష్టి డెవలపర్స్‌పై ఉండేది. అయితే మా ప్రాడక్ట్‌ను యూజర్లు ఆసక్తికరమైన పద్ధతుల్లో ఉపయోగించుకుంటున్నారు’ అంటున్నాడు ప్రత్యూష్ రాయ్. నేర్చుకున్న పాఠాలు ఎప్పుడూ వృథా పోవు. ‘బీసీజీ’లో రాయ్ అనుభవంతో నేర్చుకున్న ఎన్నో పాఠాలు ‘మెర్లిన్’ ప్రయాణంలో ఉపయోగపడ్డాయి. రాయ్ మాటల్లో చెప్పాలంటే ఆ అనుభవ పాఠాలు తన ప్రపంచాన్నే మార్చేసి కొత్త ప్రపంచాన్ని పరిచయం చేశాయి. ‘మెర్లిన్ సక్సెస్‌కు కారణం దానిపై యూజర్లకు గురి కుదరడమే’ అంటున్నాడు ‘ఫోయర్–మెర్లిన్’ ఫస్ట్ ఇన్వెస్టర్, బెటర్ క్యాపిటల్ సీయివో వైభవ్. ‘హమ్మయ్య...సక్సెస్ అయ్యాం’ అని సేద తీరడం లేదు ‘ఫోయర్–మెర్లిన్’ బృందం. ఇప్పుడు వారి దృష్టి సిబ్బందిని పెంచుకోవడం, మెర్లిన్లోకి రకరకాల సబ్ ఫీచర్స్‌ని తీసుకురావడంపై ఉంది. ‘మెర్లిన్’ అనేది ఒక రకమైన డేగ. దానిలోని సునిశితమై దృష్టిని తమ ‘మెర్లిన్’లోకి తీసుకురావాలనుకుంటోంది, ఫినిష్ ఎనీ టాస్క్ అని ధైర్యం ఇవ్వాలనుకుంటోంది బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ఫోయర్–మెర్లిన్ బృందం. ‘హమ్మయ్య... సక్సెస్ అయ్యాం’ అని సేద తీరడం లేదు ‘ఫోయర్–మెర్లిన్’ బృందం. ఇప్పుడు వారి దృష్టి సిబ్బందిని పెంచుకోవడం, మెర్లిన్లోకి రకరకాల సబ్ ఫీచర్స్‌ని తీసుకురావడంపై ఉంది. -
మైక్రోసాఫ్ట్ ‘ఎడ్జ్’లో కొత్త ఫీచర్స్
మైక్రోసాఫ్ట్ తమ వెబ్‌బ్రౌజర్ ‘ఎడ్జ్’ ను కొత్త ఏఐ ఆధారిత ఫీచర్స్‌తో అప్డెట్ చేసింది. బ్రాండ్–న్యూ లుక్‌తో కనిపించనున్న ‘ఎడ్జ్’ బ్రౌజర్లోని రెండు ఏఐ ఆధారిత ఫీచర్లు చాట్, కంపోజ్. ‘చాట్’తో వెబ్‌పేజ్ కంటెంట్, డాక్యుమెంట్‌కు సంబంధించి సమ్మరీని పొందడానికి, ప్రశ్నలు అడగడానికి వీలవుతుంది. ‘కంపోజ్’ ఫీచర్ అనేది రైటింగ్ అసిస్టెంట్. ఇదిప్రోప్ట్స్ ఆధారంగా టెక్స్›్ట, ఇ–మెయిల్స్‌ను జనరేట్ చేస్తుంది. -
మైక్రోసాఫ్ట్ యూజర్లకు బ్యాడ్ న్యూస్
అత్యంత ప్రజాదరణ పొందిన మైక్రోసాఫ్ట్ టీమ్స్ వెబ్ యాప్ నిలిచిపోనుంది. ఈ రోజు(నవంబర్ 30) నుండి మైక్రోసాఫ్ట్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్లో తన మైక్రోసాఫ్ట్ టీమ్స్ వెబ్ యాప్‌కి సపోర్ట్ నిలిపివేయనున్నట్లు తెలిపింది. ఒక వేల మీరు మైక్రోసాఫ్ట్ టీమ్స్ సేవలను ఉపయోగించాలని అనుకుంటే మాత్రం మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్ ని ఉపయోగించాలని పేర్కొంది. మైక్రోసాఫ్ట్ ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ లో టీమ్స్ సేవలు నిలిచిపోనున్నట్లు మైక్రోసాఫ్ట్ ఈ సంవత్సరం ప్రారంభంలో ప్రకటించింది. ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ లో వినియోగదారులందరని మైక్రోసాఫ్ట్ ఎడ్జ్‌ను ఉపయోగించుకునేలా చేయాలని సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశ్యం. (చదవండి: మోటో జీ 5జీ లాంచ్ నేడే) 2021, ఆగస్టు 17 నుంచి ఆఫీస్ 365, వన్ డ్రైవ్, ఔట్లుక్ వంటివి ఎక్స్‌ప్లోరర్11కు సపోర్టు చేయవని తెలిపింది. దశల వారీగా వీటిని నిలిపివేయనున్నట్లు ప్రకటించింది. మార్చి 9, 2021 తరువాత నుంచి ఎడ్జ్ లెగస్సీ డెస్క్ టాప్ యాప్ కొత్త సెక్యూరిటీ అప్ డేట్స్ పొందలేదని స్పష్టం చేసింది. దీనికి బదులుగా కొత్త మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్ కొత్త విండోస్ ఫీచర్ అప్ డేట్స్ తో అందుబాటులో ఉండనుందని పేర్కొంది. మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్ ను మైక్రో సాఫ్ట్ కొత్తగా తీసుకొచ్చింది. క్రోమ్ బ్రౌజర్ మాదిరిగానే ఇది కూడా సమర్థవంతంగా, వేగంగా పనిచేస్తుందని తెలిపింది. ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ 25 సంవత్సరాల క్రితం, 1995 ఆగస్టులో విడుదలైంది. ఒకప్పుడు ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ఉపయోగించిన వెబ్ బ్రౌజర్ ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్. 2003 ఏడాదిలో 95 శాతం వాటాతో మొదటి స్థానంలో నిలిచింది. ఫైర్ఫాక్స్, గూగుల్ క్రోమ్ వంటి వాటితో పోటీ నేపథ్యంలో ఈ కొత్త వెబ్ బ్రౌజర్ ని తీసుకొచ్చినట్లు సంస్థ తెలిపింది. -
సరికొత్తగా ‘జియోపేజెస్’ మొబైల్ బ్రౌజర్
న్యూఢిల్లీ: సరికొత్తగా తీర్చిదిద్దిన దేశీ మొబైల్ బ్రౌజర్ ‘జియోపేజెస్’ను రిలయన్స్ జియో ప్రవేశపెట్టింది. ఇది ఎనిమిది భారతీయ భాషల్లో లభ్యమవుతుందని సంస్థ వెల్లడించింది. మరింత మెరుగైన బ్రౌజింగ్ అనుభూతిని ఇవ్వడంతో పాటు డేటా గోప్యతకు పెద్ద పీట వేస్తూ దీన్ని రూపొందించినట్లు వివరించింది. గూగుల్ ప్లేస్టోర్‌లో దీన్ని అందుబాటులోకి తెచ్చినట్లు జియో ప్రతినిధి తెలిపారు. వేగవంతంగా పేజ్ లోడింగ్, మెరుగ్గా మీడియా స్ట్రీమింగ్, ఎన్క్రిప్టెడ్ కనెక్షన్ మొదలైన ప్రత్యేకతలు ఈ బ్రౌజర్లో ఉన్నాయని వివరించారు. (ఈ-కామర్స్ కంపెనీల టేకాఫ్ అదుర్స్ ) గత వెర్షన్‌కు 1.4 కోట్ల డౌన్లోడ్స్ ఉన్నాయని, వీటన్నింటినీ దశలవారీగా లేటెస్ట్ వెర్షన్‌కి అప్‌గ్రేడ్ చేయనున్నామని పేర్కొన్నారు. ఇంగ్లీష్, తెలుగు సహా తమిళం, మలయాళం, కన్నడ, హిందీ, మరాఠీ, గుజరాతీ, బెంగాలీ భాషల్లో జియో పేజెస్ అందుబాటులో ఉంటుందని చెప్పారు. జియోపేజెస్ బ్రౌజర్‌ను యూజర్లు తమకు కావల్సిన కంటెంట్ పొందేలా కస్టమైజ్ చేసుకునేందుకు కూడా వీలుంటుంది. రాష్ట్రాన్ని బట్టి స్థానికంగా ప్రాచుర్యం పొందిన సైట్లు.. స్క్రీన్‌పై కనిపిస్తాయి. గూగుల్, బింగ్, ఎంఎస్ఎన్, యాహూ వంటి సెర్చి ఇంజిన్లను డిఫాల్ట్ సెర్చి ఇంజిన్లుగా పెట్టుకునేలా హోమ్ స్క్రీన్ కూడా పర్సనలైజ్ చేసుకోవచ్చు. ‘ఇన్ఫర్మేటివ్ కార్డ్’ ఫీచరు ద్వారా వార్తలు, క్రికెట్ స్కోర్ మొదలైన వాటి గురించి తెలుసుకోవచ్చు. -
విహారి 135 నాటౌట్
చెన్నై: విజయ్ హజారే ట్రోఫీని ఆంధ్ర జట్టు విజయంతో ముగించింది. సోమవారం జరిగిన గ్రూప్ ‘సి’ మ్యాచ్‌లో విహారి (111 బంతుల్లో 135 నాటౌట్; 21 ఫోర్లు, 1 సిక్స్) అజేయ సెంచరీ సాధించడంతో ఆంధ్ర 8 వికెట్ల తేడాతో రాజస్తాన్‌పై ఘనవిజయం సాధించింది. మొదట రాజస్తాన్ 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 235 పరుగులు చేసింది. మహిపాల్ (67), తేజిందర్ సింగ్ (60) రాణించారు. ఆంధ్ర బౌలర్లలో విజయ్ కుమార్ 3, అయ్యప్ప 2 వికెట్లు తీశారు. ఆంధ్ర 39.5 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 236 పరుగులు చేసి గెలిచింది. ఈ గ్రూప్‌లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన బెంగాల్, గుజరాత్ జట్లు నాకౌట్ పోరుకు అర్హత పొందగా... ఆంధ్ర జట్టు ఐదో స్థానంలో నిలిచింది. -
పిల్లికి నోటీసులు
హూస్టన్: చాలా ఏళ్లుగా ఉంటున్న చోటును ఉన్నపళంగా ఖాళీ చేయాలని ఆదేశాలు అందితే కష్టం కదా. జంతువులకూ ఇది సమస్యే.అమెరికాలోని ఓ పిల్లి ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొం టోంది. టెక్సాస్‌లోని వైట్ సెటిల్మెంట్ నగరంలోని పబ్లిక్ లైబ్రరీలో బ్రౌజర్ అనే పిల్లి ఆరేళ్లుగా ఉంటోంది. 30 రోజుల్లోగా అక్కడి నుంచి వెళ్లి పోవాలని దాని కి ఆ నగర పాలకమండలి నోటీసులిచ్చింది. పిల్లల,ప్రజల విజ్ఞప్తులను పెడచెవిన పెట్టి, కౌన్సిల్ సభ్యుల మధ్య జరిగిన ఓటింగ్‌లో 2-1 తేడాతో బ్రౌజర్‌ను పంపిం చేయాలని తీర్మానించారు. ఈ లైబ్రరీ ఓ జూ నుంచి బ్రౌజర్‌ను దత్తత తీసు కుంది. కంప్యూటర్ కీబోర్డులపై విశ్రాంతి తీసుకోవడం, అక్కడ జరిగే ప్రత్యేక తరగతులకు హాజర వడం దాని వ్యాపకాలని అక్కడి వారు చెబుతున్నారు. -
మైక్రోసాఫ్ట్ ఆ బ్రౌజర్లను మూసేస్తుంది!
-
మైక్రోసాఫ్ట్ ఆ బ్రౌజర్లను మూసేస్తుంది!
ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యంత ఆదరణ కలిగిన ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ ఓల్డ్ వెర్షన్ బ్రౌజర్లను మూసివేయడానికి మైక్రోసాఫ్ట్ సంస్థ నిర్ణయించుకుంది. ఈ మేరకు ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ 8, 9, 10 వెర్షన్లకు టెక్నికల్, సెక్యురిటీ సపోర్ట్‌ను నిలిపివేస్తూ మైక్రోసాఫ్ట్ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికీ ఈ బ్రౌజర్లను ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది ఇంటర్నెట్ వినియోగదారులు ఉపయోగిస్తున్నారు. అయితే మారుతున్న ఆధునిక వెబ్ అవసరాలకు అనుగుణంగా మైక్రోసాఫ్ట్ రూపొందించిన కొత్త వెర్షన్లు.. ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ 11, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ లను ప్రోత్సహించడంలో భాగంగా సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. మైక్రోసాఫ్ట్ తీసుకున్న ఈ నిర్ణయంతో ఇకమీదట పాత వెర్షన్లను ఉపయోగించే యూజర్లకు ఎటువంటి టెక్నికల్, సెక్యురిటీ అప్డేట్స్ను సంస్థ అందించదు. దీంతో యూజర్లు హ్యాకర్ల బారిన పడే అవకాశాలు పెరుగడమే కాకుండా బ్రౌజింగ్ ప్రక్రియ కూడా సాఫీగా సాగదు. ఐఈ 8, 9, 10 వెర్షన్లను ఉపయోగించే యూజర్లు.. ఐఈ 11, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్‌లతో అప్డేట్ కావాలని సంస్థ ప్రకటించింది. 2002లో ప్రపంచ మార్కెట్లో ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ వినియోగదారుల వాటా 85 శాతంగా ఉండేది. అయితే గూగుల్ క్రోమ్, ఫైర్ఫాక్స్ వినియోగదారులు పెరుగుతుండటంతో ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ బ్రౌజర్ల వినియోగదారుల వాటా గత సంవత్సరానికి 6.8 శాతానికి పడిపోయింది. ఈ నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ ఎడ్జ్, ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ 11 వెర్షన్లతో ప్రపంచమార్కెట్లో మైక్రోసాఫ్ట్ బ్రౌజర్ల వినియోగదారుల సంఖ్య పెంచుకోవాలని సంస్థ భావిస్తోంది. -
భళా బుల్లి ప్రోగ్రామ్‌లు
నెట్ బ్రౌజింగ్‌లో మనల్ని చికాకుపెట్టే అంశాలేవి? విచ్చలవిడిగా వచ్చే ప్రకటనలు మొదటివైతే... అవసరమైన వెబ్‌సైట్‌ను పదేపదే వెతుక్కోవడం రెండోది. ఈ కామర్స్ వెబ్సైట్లు పెరిగిపోయిన నేపథ్యంలో... ఇంతకీ... ఎక్స్‌టెన్షన్స్‌ను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి? అన్నదేనా మీ సందేహం... బ్రౌజర్ పైభాగంలో కుడివైపున ఉన్న సెట్టింగ్స్‌ను చూస్తే... అందులో మోర్టూల్స్ అన్న ఆప్షన్ కనిపిస్తుంది. అందులో ఎక్స్టెన్షన్స్ ట్యాబ్‌ను క్లిక్ చేస్తే అందుబాటులో ఉన్న అనేక ఎక్స్టెన్షన్లు కనిపిస్తాయి. నచ్చినవాటిని ఎంచుకుని క్లిక్ చేయడమే మనం చేయాల్సింది! ఏ వెబ్సైట్లో ఏది చౌకగా దొరుకుతుందో తెలుసుకోవడం ముచ్చటగా మూడో ఇబ్బంది. మీ బ్రౌజర్ గూగుల్ క్రోమ్ ఐతే... కొన్ని ఎక్స్టెన్షన్లను డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా ఇలాంటి సమస్యలు అనేకం సులువుగా తప్పించుకోవచ్చు. దేశంలో నెట్ వాడకం క్రమేపీ పెరుగుతోంది. స్మార్ట్ఫోన్ల వాడకం పెరిగిపోవడం ఒక కారణమైతే...వాడటంలో ఉన్న సౌలభ్యం రెండో కారణంగా చెప్పుకోవచ్చు. మన బ్రౌజింగ్ అనుభూతిని మరింత సౌకర్యవంతం చేసేందుకు కంపెనీలూ ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తున్నాయి. చిన్న చిన్న ప్రోగ్రామ్‌ల రూపంలో ఉండే బ్రౌజర్ ఎక్స్టెన్షన్స్ ఈ కోవలోనివే. మిగిలిన బ్రౌజర్ల మాటెలా ఉన్నా... గూగుల్ క్రోమ్‌లోని కొన్ని ఎక్స్టెన్షన్స్ మనకు టెన్షన్ తప్పించేస్తాయి. అలాంటి కొన్ని ఎక్స్టెన్షన్లు... యాడ్ బ్లాక్: ఫేస్‌బుక్‌తోపాటు వెబ్సైట్లలో అటు ఇటూ చేరిపోయి మన దృష్టిని మరల్చే వాణిజ్య ప్రకటనలను తొలగించేందుకు ఉపయోగపడుతుంది ఈ సాఫ్ట్వేర్ టూల్. వెబ్సైట్లతోపాటు యూట్యూబ్‌కు కూడా దీన్ని వాడుకోవచ్చు. వీడియోలకు ముందు వచ్చే ప్రకటనలను అడ్డుకుంటుంది. ఇప్పటికే దాదాపు కోటిమంది ఈ ఎక్స్‌టెన్షన్‌ను డౌన్లోడ్ చేసుకున్నారంటే దీని ప్రాచుర్యం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. పీఎన్ఆర్ స్టేటస్: భారతీయ రైల్వే వెబ్సైట్ ద్వారా ఎప్పుడు టికెట్ బుక్ చేసుకున్నా.. అది కన్ఫర్మ్ అయ్యిందా? లేదా? అన్నది తెలుసుకునేందుకు తరచూ పీఎన్ఆర్ స్టేటస్‌ను చెక్ చేస్తూంటాము. ప్రతిసారి వెబ్‌సైట్‌ను ఓపెన్ చేసే పనిలేకుండా ఓ ఎక్స్టెన్షన్ ద్వారా కూడా పీఎన్ఆర్ స్టేటస్‌ను తెలుసుకోవచ్చు. గూగుల్ సెర్చ్‌లో ‘పీఎన్ఆర్ స్టేటస్’ అని టైప్ చేస్తే కనిపించే ఓ విడ్జెట్‌లో నేరుగా పీఎన్ఆర్ నెంబర్ లేదా ప్రయాణించే వ్యక్తి పేరు లేదా వివరాలు టైప్ చేసి టికెట్ కన్ఫర్మేషన్ ఏ దశలో ఉందో ఇట్టే తెలుసుకోవచ్చు. కంపేర్ హట్కే: అమెజాన్‌లోనో.. ఫ్లిప్కార్ట్లోనో ఏదైనా కొనాలనుకున్నప్పుడు ఇతర వెబ్సైట్లలో ఆ వస్తువు ధర ఎంతుందో తెలుసుకోవడం మనమందరం చేసే పని. కొందరైతే నాలుగైదు వెబ్సైట్లలో ధరలు తెలుసుకుంటూ ఉంటారు. అన్ని వెబ్సైట్లలో ఆ వస్తువు ధర ఏమిటన్నది ఒకే చోట కనిపించేందుకు పనికొచ్చే ఎక్స్టెన్షన్ ఈ ‘కంపేర్ హట్కే’. దాదాపు పది పోర్టల్స్‌లోని ధరల వివరాలను పోల్చి చూసుకోవచ్చు. క్లౌడీ: కంప్యూటర్ లేదా యూఎస్బీల్లో డేటా స్టోర్ చేసుకోవడం పాతపద్ధతి. వేర్వేరు వెబ్సైట్లు, కంపెనీలు అందిస్తున్న క్లౌడ్ స్టోరేజ్‌లో దాచుకోవడం లేటెస్ట్ ట్రెండ్. కాకపోతే ప్రతి ఫైల్‌నూ ఆ కంపెనీ వెబ్సైట్ ద్వారా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. క్లౌడీ మీ బ్రౌజర్ ఎక్స్‌టెన్షన్‌గా ఉంటే మాత్రం డ్రాప్‌బాక్స్, ఎవర్‌నోట్, ఇన్స్టాగ్రామ్ ఇలా ఏ సర్వీసుదైనా ఒకేచోటి నుంచి ఫైల్స్ అప్లోడ్ చేయవచ్చు. జీమెయిల్ వాడేవారికి పనికొచ్చే ఈ ఎక్స్‌టెన్షన్‌ను వాడుకోవడం ద్వారా భారీ సైజు అటాచ్మెంట్లను కూడా పంపుకోవచ్చు. టూమెనీ ట్యాబ్స్: బ్రౌజింగ్ సమయంలో ఒకటికంటే ఎక్కువ ట్యాబ్‌లను వాడటం మనలో చాలామంది చేసే పనే. అయితే ప్రతి అదనపు ట్యాబ్‌తో కంప్యూటర్ ప్రాసెసింగ్ శక్తి తక్కువవుతూ వస్తుంది. బ్రౌజింగ్ వేగమూ తగ్గుతుంది. ఈ చిక్కు నుంచి తప్పించుకునేందుకు టూమెనీ ట్యాబ్స్ పనికొస్తుంది. మీరు చూస్తున్న వెబ్‌సైట్‌ను మాత్రమే యాక్టివ్‌గా ఉంచి, మిగిలినవాటిని డిజేబుల్ చేయడం ద్వారా పనిచేసే ఈ ఎక్స్‌టెన్షన్‌తో ఇంకా చాలా ఉపయోగాలున్నాయి. వాడి చూడండి మీకే తెలుస్తుంది.