మైక్రోసాఫ్ట్ ఆ బ్రౌజర్లను మూసేస్తుంది!
ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యంత ఆదరణ కలిగిన ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ఓల్డ్ వెర్షన్ బ్రౌజర్లను మూసివేయడానికి మైక్రోసాఫ్ట్ సంస్థ నిర్ణయించుకుంది. ఈ మేరకు ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ 8, 9, 10 వెర్షన్లకు టెక్నికల్, సెక్యురిటీ సపోర్ట్ను నిలిపివేస్తూ మైక్రోసాఫ్ట్ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికీ ఈ బ్రౌజర్లను ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది ఇంటర్నెట్ వినియోగదారులు ఉపయోగిస్తున్నారు. అయితే మారుతున్న ఆధునిక వెబ్ అవసరాలకు అనుగుణంగా మైక్రోసాఫ్ట్ రూపొందించిన కొత్త వెర్షన్లు.. ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ 11, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ లను ప్రోత్సహించడంలో భాగంగా సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది.
మైక్రోసాఫ్ట్ తీసుకున్న ఈ నిర్ణయంతో ఇకమీదట పాత వెర్షన్లను ఉపయోగించే యూజర్లకు ఎటువంటి టెక్నికల్, సెక్యురిటీ అప్డేట్స్ను సంస్థ అందించదు. దీంతో యూజర్లు హ్యాకర్ల బారిన పడే అవకాశాలు పెరుగడమే కాకుండా బ్రౌజింగ్ ప్రక్రియ కూడా సాఫీగా సాగదు. ఐఈ 8, 9, 10 వెర్షన్లను ఉపయోగించే యూజర్లు.. ఐఈ 11, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్లతో అప్డేట్ కావాలని సంస్థ ప్రకటించింది.
2002లో ప్రపంచ మార్కెట్లో ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ వినియోగదారుల వాటా 85 శాతంగా ఉండేది. అయితే గూగుల్ క్రోమ్, ఫైర్ఫాక్స్ వినియోగదారులు పెరుగుతుండటంతో ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ బ్రౌజర్ల వినియోగదారుల వాటా గత సంవత్సరానికి 6.8 శాతానికి పడిపోయింది. ఈ నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ ఎడ్జ్, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ 11 వెర్షన్లతో ప్రపంచమార్కెట్లో మైక్రోసాఫ్ట్ బ్రౌజర్ల వినియోగదారుల సంఖ్య పెంచుకోవాలని సంస్థ భావిస్తోంది.