ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్‌కి హ్యాకింగ్ ముప్పు
వాషింగ్టన్: నెటిజన్లను ఇటీవలే హార్ట్‌బ్లీడ్ బగ్ బెంబేలెత్తించగా.. తాజాగా మరో ముప్పు తెరపైకి వచ్చింది. ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్(ఐఈ) బ్రౌజర్‌లో భద్రతాపరమైన లోపాలు ఉన్నాయని గుర్తించినట్లు సాఫ్ట్‌వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ తెలిపింది. వీటి వల్ల యూజర్ల కంప్యూటర్లలోకి హ్యాకర్లు చొరబడి, వాటిని తమ ఆధీనంలో తెచ్చుకునే అవకాశం ఉందని వివరించింది. ఇప్పటికే ఈ తరహా దాడులు కొంత మేర జరిగాయని మైక్రోసాఫ్ట్ తెలిపింది. ఐఈలోని 6 నుంచి 11 దాకా వెర్షన్లలో ఈ బగ్ ఉన్నట్లు పేర్కొంది. ఈ లోపాన్ని సరిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించింది.
కస్టమర్ల అవసరాన్ని బట్టి.. ప్రతి నెలా సెక్యూరిటీ అప్‌డేట్స్‌తో పాటు ఈ పరిష్కారాన్ని అందించే అంశాన్ని మైక్రోసాఫ్ట్ పరిశీలిస్తున్నట్లు ‘బీబీసీ న్యూస్’ తెలిపింది. మైక్రోసాఫ్ట్ నుంచి సపోర్ట్ నిల్చిపోయినప్పటికీ ఇప్పటికీ విండోస్ ఎక్స్‌పీ ఆపరేటింగ్ సిస్టమ్‌ని ఉపయోగిస్తున్న వారికి హ్యాకర్ల బెడద ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. భద్రతాపరమైన లోపాల కారణంగా ఎక్స్‌పీ ఓఎస్‌పై ఉపయోగించే ఐఈ తరచూ క్రాష్ కావొచ్చని సిమాంటెక్ పేర్కొంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా బ్రౌజర్ మార్కెట్లో ఐఈ వివిధ వెర్షన్ల వాటా 50% పైగా ఉంటోందని అంచనా.
హ్యాకింగ్ ముప్పు ఇలా..: ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్‌లో లోపాలను తమకు అనుకూలంగా వాడుకునేందుకు.. హ్యాకర్లు అనుసరిస్తున్న విధానాలను మైక్రోసాఫ్ట్ వివరించింది. దీని ప్రకారం.. హ్యాకింగ్ కోసం హ్యాకర్లు ప్రత్యేక వెబ్‌సైటు ప్రారంభించి యూజర్లను ఆకర్షిస్తారు. ఈ మెయిల్ లేదా ఇన్‌స్టంట్ మెసెంజర్స్ ద్వారా సదరు వెబ్‌సైట్‌కి లింకులను పం పుతారు. అసలు విషయం తెలియక వాటిని క్లిక్ చేసే యూజర్ల కంప్యూటర్లలోకి హ్యాకర్లు చొరబడతారు.