windows xp operating system
-
ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్‌కి హ్యాకింగ్ ముప్పు
వాషింగ్టన్: నెటిజన్లను ఇటీవలే హార్ట్‌బ్లీడ్ బగ్ బెంబేలెత్తించగా.. తాజాగా మరో ముప్పు తెరపైకి వచ్చింది. ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్(ఐఈ) బ్రౌజర్లో భద్రతాపరమైన లోపాలు ఉన్నాయని గుర్తించినట్లు సాఫ్ట్వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ తెలిపింది. వీటి వల్ల యూజర్ల కంప్యూటర్లలోకి హ్యాకర్లు చొరబడి, వాటిని తమ ఆధీనంలో తెచ్చుకునే అవకాశం ఉందని వివరించింది. ఇప్పటికే ఈ తరహా దాడులు కొంత మేర జరిగాయని మైక్రోసాఫ్ట్ తెలిపింది. ఐఈలోని 6 నుంచి 11 దాకా వెర్షన్లలో ఈ బగ్ ఉన్నట్లు పేర్కొంది. ఈ లోపాన్ని సరిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించింది. కస్టమర్ల అవసరాన్ని బట్టి.. ప్రతి నెలా సెక్యూరిటీ అప్డేట్స్తో పాటు ఈ పరిష్కారాన్ని అందించే అంశాన్ని మైక్రోసాఫ్ట్ పరిశీలిస్తున్నట్లు ‘బీబీసీ న్యూస్’ తెలిపింది. మైక్రోసాఫ్ట్ నుంచి సపోర్ట్ నిల్చిపోయినప్పటికీ ఇప్పటికీ విండోస్ ఎక్స్పీ ఆపరేటింగ్ సిస్టమ్‌ని ఉపయోగిస్తున్న వారికి హ్యాకర్ల బెడద ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. భద్రతాపరమైన లోపాల కారణంగా ఎక్స్పీ ఓఎస్‌పై ఉపయోగించే ఐఈ తరచూ క్రాష్ కావొచ్చని సిమాంటెక్ పేర్కొంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా బ్రౌజర్ మార్కెట్లో ఐఈ వివిధ వెర్షన్ల వాటా 50% పైగా ఉంటోందని అంచనా. హ్యాకింగ్ ముప్పు ఇలా..: ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్లో లోపాలను తమకు అనుకూలంగా వాడుకునేందుకు.. హ్యాకర్లు అనుసరిస్తున్న విధానాలను మైక్రోసాఫ్ట్ వివరించింది. దీని ప్రకారం.. హ్యాకింగ్ కోసం హ్యాకర్లు ప్రత్యేక వెబ్సైటు ప్రారంభించి యూజర్లను ఆకర్షిస్తారు. ఈ మెయిల్ లేదా ఇన్స్టంట్ మెసెంజర్స్ ద్వారా సదరు వెబ్‌సైట్‌కి లింకులను పం పుతారు. అసలు విషయం తెలియక వాటిని క్లిక్ చేసే యూజర్ల కంప్యూటర్లలోకి హ్యాకర్లు చొరబడతారు. -
పీసీ అమ్మకాలు పుంజుకుంటాయ్
న్యూయార్క్/న్యూఢిల్లీ: విండోస్ ఎక్స్పీ ఆపరేటింగ్ సిస్టమ్‌కు సాంకేతిక తోడ్పాటునందించడాన్ని నిలిపేయాలన్న మైక్రోసాఫ్ట్ నిర్ణయించడం వల్ల పర్సనల్ కంప్యూటర్ల అమ్మకాలు కొంచెం మెరుగుపడతాయని అంతర్జాతీయ రీసెర్చ్ సంస్థలు, ఐడీసీ, గార్ట్నర్లు అంచనా వేస్తున్నాయి. మైక్రోసాఫ్ట్ నిర్ణయం వల్ల పడిపోతున్న పీసీల అమ్మకాలు స్వల్పంగా పుంజుకోగలవని ఈ సంస్థల అభిప్రాయం. విండోస్ ఎక్స్‌పీని ఉపయోగించే పీసీల స్థానంలో తాజా ఓఎస్‌లపై నడిచే పీసీలను వినియోగిస్తారని ఫలితంగా పీసీల విక్రయాలు పుంజుకోగలవని ఈ సంస్థలు అంచనా వేస్తున్నాయి. మైక్రోసాఫ్ట్ కంపెనీ విండోస్ ఎక్స్‌పీని 2001 అక్టోబర్‌లో విడుదల చేసింది. ప్రస్తుతమున్న ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్ 8తో పోల్చితే విండోస్ ఎక్స్పీ మూడు జనరేషన్లు వెనకటిది. ఐడీసీ, గార్ట్నర్ సంస్థలు వెల్లడించిన వివరాల ప్రకారం..., ఈ ఏడాది మొదటి క్వార్టర్లో పీసీల అమ్మకాలు 1.7 శాతం క్షీణించి 7.66 కోట్లకు చేరాయని గార్ట్నర్ పేర్కొనగా, 4.4 శాతం క్షీణించి 7.34 కోట్లకు తగ్గాయని ఐడీసీ తెలిపింది. మొబైళ్లు, ట్యాబ్‌ల వినియోగం పెరుగుతుండటంతో పీసీల అమ్మకాలు తగ్గుతున్నాయ్. వృద్ధి చెందిన దేశాల్లో ఈ ఏడాది మొదటి క్వార్టర్లో పీసీలకు డిమాండ్ గత ఏడాది ఇదే క్వార్డర్లో ఉన్న డిమాండ్‌తో పోల్చితే స్వల్పంగా పెరిగింది. విండోస్ ఎక్స్‌పీకి సపోర్ట్‌ను నిలిపేయడం జపాన్‌పై తీవ్రంగా ప్రభావం చూపింది. దీంతో పాటు అమ్మకం పన్నులో మార్పు కారణంగా జపాన్‌లో పీసీల విక్రయాలు 35 శాతం వృద్ధి చెందాయి. ఇక పీసీ విక్రయాల్లో చైనా కంపెనీ లెనొవొ 17% మార్కెట్ వాటాతో, 1.29 కోట్ల పీసీల విక్రయాలతో అగ్రస్థానంలో నిలిచింది.