గూగుల్‌కు షాక్‌; రాజీనామాలతో ఉద్యోగుల నిరసన | Google sign A Contract For US Defence Department And Employees Protest | Sakshi
Sakshi News home page

గూగుల్‌కు షాక్‌; రాజీనామాలతో ఉద్యోగుల నిరసన

Published Wed, May 16 2018 3:08 PM | Last Updated on Wed, May 16 2018 4:25 PM

Google sign A Contract For US Defence Department And Employees Protest - Sakshi

న్యూయార్క్‌ : మంచి జీతం, అనువైన పనివేళలు, ఆకర్షణీయమైన వసతులు... మొత్తంగా చెప్పాలంటే ఇంట్లో ఉండే పనిచేస్తున్నామనే భావన. ఇంత మంచి వసతులతో ఉన్న ఉద్యోగాన్ని వదులుకోవడం ఎవరికి మాత్రం ఇష్టంగా ఉంటుంది. కానీ గూగుల్‌ ఉద్యోగులు మాత్రం ఈ సాహసం చేశారు. కారణం విలువలకు వ్యతిరేకంగా పనిచేయడం ఇష్టం లేక. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఈ ఉదంతం వివరాలు ఇలా ఉన్నాయి..

కంపెనీ కొత్తగా చేపట్టిన ఒక ప్రాజెక్టు కంపెనీ విలువలకు వ్యతిరేకంగా ఉందని భావించిన ఉద్యోగులు కొందరు తమ ఉద్యోగాలకు రాజీనామా చేసి, తమ నిరసన వ్యక్తం చేశారు. అమెరికా రక్షణ విభాగం డ్రోన్‌ టెక్నాలజీకి సంబంధించి ‘ప్రాజెక్ట్‌ మావేన్‌’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ ప్రాజెక్ట్‌లో డ్రోన్‌లు ఆకాశంలో విహరిస్తూ భూఉపరితలం ఫొటోలను తీయడమే కాక, ఆటోమెటిక్‌గా ఆ ఫొటోల్లో ఉన్న మనుషులను, వస్తువులను వేరు చేసి చూపించనున్నాయి. ఇందుకు అవసరమైన ఆర్టిఫిషల్‌ ఇంటిలిజెన్స్‌ను అందించేందుకు మూడు నెలల క్రితం అమెరికా రక్షణ మంత్రిత్వ శాఖ, గూగుల్‌ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది.

ఈ ఒప్పందం కంపెనీలో పనిచేసే చాలామంది ఉద్యోగులకు నచ్చలేదు. యంత్రాలకు మానవుని కంటే ఎక్కువ శక్తి ఇవ్వడం విలువలకు విరుద్ధం. అంతేకాక సైన్యానికి సంబంధించిన పనుల్లో పాలుపంచుకోవడం వల్ల కంపెనీ మీద ఉన్న విశ్వాసం సన్నగిల్లుతుందని భావించి చాలామంది ఉద్యోగులు కంపెనీ సీయివో సుందర్‌ పిచాయ్‌కు తమ రాజీనామాలు అందచేసి, నిరసనను తెలుపుతున్నారని సంస్థ అధికారి ఒకరు తెలిపారు. వీరితో పాటు కంపెనీలోని మరో 4వేల మంది ఉద్యోగులు కూడా ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించడమే కాక తక్షణం ఈ ప్రాజెక్టును వెనక్కు తీసుకోవాల్సిందిగా డిమాండ్‌ చేస్తున్నారని వెల్లడించారు. అంతేకాక ఇక మీదట భవిష్యత్తులోనూ సైన్యానికి సంబంధించి ఎటువంటి ప్రాజెక్టులను చేపట్టవద్దనే నిబంధనను కూడా తీసుకురావాలని తెలిపారు.

అయితే ఈ చర్యలేవి ఫలించలేదు, కంపెనీ ఉన్నాతాధికారులు తమ వైఖరిని మార్చుకోలేదు. పైగా ఈ నిరసనల మధ్యనే గూగుల్‌ పెంటగాన్‌ కంపెనీ క్లౌడ్‌ కంప్యూటింగ్‌ ఆధారిత డిఫెన్స్‌ ప్రాజెక్టును దక్కించుకోవడానికి ముమ్మర ప్రయత్నాలు చేస్తుండటం గమనార్హం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement