గూగుల్ : చిన్నారి డూడుల్
నిన్న మీరు గూగుల్ సెర్చ్ ఇంజన్ చూసే ఉంటారు. భారతీయ మహిళకు ఆకాశమే హద్దు అనే అర్థం వచ్చేలా గీసిన గూగుల్ డూడుల్ చాలామంది మనసు దోచుకుంది. ఏ చిత్రకారుడు గీసిన బొమ్మ ఇది...అని అందరినీ ఆలోచింపజేసింది. అసలు విషయం ఏంటంటే... ఏటా గూగుల్ ఇండియా... పాఠశాల విద్యార్థులకు డూడుల్ చిత్రాల పోటీలు పెడుతుంది. అదేవిధంగా ఈ ఏడాది ‘సెలబ్రేటింగ్ ఇండియన్ ఉమెన్’ అనే థీమ్‌తో నిర్వహించిన ఈ పోటీలకు పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. దేశవ్యాప్తంగా 100 పట్టణాలలోని 1500 పాఠశాలల నుంచి లక్షా యాభైవేల ఎంట్రీలు వచ్చాయి. వాటిలో పన్నెండు డూడుల్స్‌ని అత్యుత్తమ గూగుల్ డూడుల్స్‌గా న్యాయనిర్ణేతలు ఎంపికచేశారు.
వీటిలో పుణెలోని కళ్యాణినగర్ బిషప్ కో ఎడ్యుకేషన్ పాఠశాలలో పదవతరగతి చదువుతున్న గాయత్రి కేతారామన్ పంపిన డూడుల్‌కి మొదటి బహుమతి వచ్చింది. కేతారామన్ చిత్రీకరించిన ఈ ప్రత్యేక డూడుల్ బాలల దినోత్సవం సందర్భంగా నిన్న గూగుల్ సెర్చ్ ఇంజన్‌గా ప్రదర్శించారు. ఈ పోటీల్లో విజేతలుగా నిలిచిన పన్నెండు మందిని గూగుల్ ఇండియా మేనేజింగ్ డెరైక్టర్ రాజన్ ఆనందన్ న్యూఢిల్లీలో సత్కరించనున్నారు. ఒక పక్క స్కూలు పాఠాలు వింటూనే మరో పక్క గూగుల్ డూడుల్స్‌పై కూడా ఒక చెయ్యి వేస్తున్న ఈ హైటెక్ చిన్నారులను అభినందించాల్సిందే.