doodle
-
పారిస్ ఒలింపిక్స్ 2024.. గూగుల్ ప్రత్యేక డూడుల్!
పారిస్ ఒలింపిక్స్ 2024 ప్రారంభం సందర్భంగా గూగుల్ ప్రత్యేకంగా డూడుల్‌ను డిజైన్ చేసింది. యూజర్లు దానిపై క్లిక్ చేసిన వెంటనే ఒలింపిక్ 2024కి సంబంధించిన తాజా అప్డేట్లు వచ్చేలా పేజీ సిద్ధం చేశారు. నదిలో జీవులు సేదతీరుతున్నట్లు ఈ డూడుల్‌ను ఏర్పాటు చేశారు.ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేక ఈవెంట్లు ఉన్నపుడు గూగుల్ వాటిని తెలియజేసేలా సృజనాత్మకంగా డూడుల్‌లను రూపొందిస్తోంది. జులై 26న పారిస్ ఒలింపిక్స్ 2024 ప్రారంభం అవుతుండడంతో ఈ ఈవెంట్‌ను తెలియజేసేలా డూడుల్‌ను సిద్ధం చేసింది. పారిస్ వెంబడి ప్రవహించే ‘సీన్ నది’ని తలపిస్తూ ఐదు ఖండాల క్రీడాకారులను రిప్రజెంట్ చేసేలా వివిధ జీవులతో డూడుల్‌ను రూపొందించింది. ప్రస్తుతం పారిస్‌లో వేసవికాలం ఉండడంతో అవి నదిలో సేదతీరుతున్నట్లు ఈ డూడుల్‌లో చూడవచ్చు.పారిస్ ఒలింపిక్ 2024 ప్రారంభ వేడుకలకు రెండు రోజుల ముందే జులై 24న ఆర్చరీ, సాకర్, హ్యాండ్‌బాల్, రగ్బీలో ప్రాథమిక రౌండ్‌ను మొదలుపెట్టారు. 69 ఈవెంట్లలో 117 మంది భారతీయ పోటీదారులు 95 పతకాల కోసం పోటీపడబోతున్నారు. ఇందులో 70 మంది పురుషులు, 47 మంది మహిళలు ఉన్నారు. పారిస్‌లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న పోటీదారుల్లో జావెలిన్థ్రో స్టార్ నీరజ్ చోప్రా, బ్యాడ్మింటన్ స్టార్లు పీజీ సింధు, సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి, వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను వంటి ప్రముఖ క్రీడాకారులున్నారు.ఇదీ చదవండి: ఒలింపిక్ కమిటీకి ఏకగ్రీవంగా ఎన్నికైన నీతా అంబానీఒలింపిక్ 2024 ప్రారంభ వేడుక తర్వాత జులై 27న శనివారం న్యూజిలాండ్‌తో భారత పురుషుల హాకీ జట్టు పోటీపడనుంది. బ్యాడ్మింటన్, బాక్సింగ్, షూటింగ్, టేబుల్ టెన్నిస్ ఈవెంట్లు కూడా అదే రోజున జరుగుతాయి. ఈ ఈవెంట్స్ స్పోర్ట్స్ 18, వయాకామ్ 18 నెట్‌వర్క్‌తో అనుసంధానం కలిగిన ఛానల్స్‌తో పాటు, జియో సినిమా యాప్‌లో ప్రసారం చేస్తున్నారు. -
కొత్త ఏడాదికి గూగుల్ వెల్కమ్- నెట్టింట్లో డూడుల్ వైరల్
కొత్త సంవత్సరానికి స్వాగతం పలకడానికి.. 2023కి వీడ్కోలు పలకడానికి ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు సిద్ధమైపోయారు. అంతకంటే ముందు గూగుల్ ఓ కొత్త డూడుల్ ప్రదర్శించింది. దీనికి సంబంధించిన యానిమేషన్ కూడా నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. 3... 2... 1... హ్యాపీ న్యూ ఇయర్! అంటూ గూగుల్ పేర్కొంది. 2023 మిగిల్చిన మధుర జ్ఞాపకాలను, విషాదాలను నెమరు వేసుకుంటూ.. 2024 సంతోషంగా సాగాలని కోరుకుంటూ వెల్కమ్ చెప్పడానికి ప్రపంచమే సిద్దమవుతున్న సమయంలో గూగుల్ ఈ విన్నూత ప్రయోగం చేసింది. నిజానికి 1998 నుంచి 2003 వరకు, గూగుల్ వివిధ సందర్భాలను పురస్కరించుకుని, వ్యక్తులను గౌరవించడం మొదలు ఏకంగా 5000 కంటే ఎక్కువ డూడుల్ రూపొందించినట్లు సమాచారం. ఈ డూడుల్ ఐడియా అనేది సంస్థ కో-ఫౌండర్స్ నుంచి పుట్టుకొచ్చిందే. ఇదీ చదవండి: చైనా కొత్త టెక్నాలజీ - ట్రాక్‌లెస్ ట్రైన్ వీడియో వైరల్ 1998లో గూగుల్ సహ-వ్యవస్థాపకులు లారీ పేజ్ & సెర్గీ బ్రిన్ నెవాడాలో బర్నింగ్ మ్యాన్ ఉత్సవానికి హాజరు కావడానికి ఆఫీసుకు కొన్ని రోజులు దూరంగా ఉండాలని ప్లాన్ చేస్తున్నారు. ఆ విషయాన్ని గూగుల్ వినియోగదారులకు తెలియజేయడానికి ఓ సులభమైన మార్గాన్ని ఆలోచించడంలో భాగంగానే ఈ డూడుల్ అనేది పుట్టుకొచ్చింది. -
కనిపించిన కాగితం మీదల్లా బొమ్మలు గీసేస్తాడు..అదే ఆ బాలుడిని..
క్లాసులో ఒకవైపు టీచర్ పాఠాలు చెబుతున్నా, మరోవైపు దొరికిన కాగితాల మీదో, నోట్ పుస్తకాల మీదో బొమ్మలు గీసే అలవాటు చాలామంది పిల్లలకు ఉంటుంది. పాఠం వినకుండా బొమ్మలు గీయడంలో మునిగిపోయే విద్యార్థులను టీచర్లు మందలించడమూ మామూలే! ఇంగ్లండ్‌లోని ష్రూజ్బరీకి చెందిన జో వేల్ అనే ఈ పదమూడేళ్ల బాలుడికి ఖాళీగా కనిపించిన కాగితం మీదనల్లా బొమ్మలు గీసే అలవాటు ఉంది. క్లాసులో టీచర్ మందలించినా బొమ్మలు గీయకుండా ఉండలేకపోయేవాడు. మిగిలిన క్లాసుల్లో టీచర్ల మందలింపులు తప్పకపోయినా, డ్రాయింగ్ క్లాసులో జో వేల్ చురుగ్గా ఉండేవాడు. డ్రాయింగ్ టీచర్ ప్రోత్సాహంతో తోటి పిల్లలకు ఫ్రీహ్యాండ్ డ్రాయింగ్ గురించి లెక్చర్లిచ్చేవాడు. అతడి అభిరుచిని గమనించి తల్లిదండ్రులు ప్రోత్సహించడంతో సోషల్ మీడియాలోకి ప్రవేశించాడు. ‘డూడుల్ బాయ్’ పేరుతో జనాలను విపరీతంగా ఆకట్టుకున్నాడు. ఎక్కడ పడితే అక్కడ బొమ్మలు గీసే అలవాటే జో వేల్కు చక్కని అవకాశం తెచ్చిపెట్టింది. ‘నైకీ’ షూ కంపెనీకి జో వేల్ గీసే బొమ్మలు బాగా నచ్చాయి. ఈ బొమ్మలను తమ షూస్‌పై డిజైన్లుగా ముద్రించుకోవడానికి అతడితో ఇటీవల ఒప్పందం కుదుర్చుకుంది. (చదవండి: అతిపెద్ద బాలల మ్యూజియం!) -
యూనిస్ న్యూటన్ ఫుట్: గూగుల్ డూడుల్‌లో ఉన్న వ్యక్తి ఎవరంటే..
ఈ రోజు గూగుల్ 11 స్లయిడ్‌లతో ఓ ఇంటారాక్టివ్ డూడుల్‌ని రూపొందించింది. అందులో ఓ మహిళ ఫోటో ఉంది ఎవరు ఆమె?. ఎందుకు గూగుల్ సోమవారం ఆ మహిళతో ఉన్న డూడిల్ రూపొందించిన నివాళులర్పించింది. తొలిసారిగా గ్రీన్హౌస్ ప్రభావాన్ని కనుగొన్న తొలి వ్యక్తే ఆమె. ఆమె పేరు యూనిస్ న్యూటన్ ఫుట్, అమెరికన్ శాస్త్రవేత్త. స్త్రీలు అంతగా చదువుకోని ఆరోజుల్లో ఆమె చదువుకోవడమేగాక ఇలాంటి పరిశోధనల వైపుకి వెళ్లే అవకాశమేలేని స్థితిలో అటువైపుకే అడుగులు వేయడం విశేషం. ఇక ఫుట్ 1856లో ఓ ప్రయోగాన్ని నిర్వహించింది. గాజు సిలండర్లలో పాదరసంతో కూడిన థర్మామీటర్లను ఉంచింది. సిలిండర్‌లో కార్బన్ డయాక్సైడ్ ఉండటం వల్లే సూర్యరశ్మీ ప్రభావానికి బాగా గురైందని కనుగొంది. దీని ఫలితంగా గాల్లో ఉండే కార్బన్ డయాక్స్డ్ స్థాయిల వల్ల వాతావరణం చాలా సులభంగా వేడుక్కుతుందనే విషయాన్ని నిర్థారించింది. ఆ పరిశోధనలే నేటి వాతావరణ మార్పుల అవగాహన సదస్సులకు మూలం అయ్యింది. ఇలా ఫుట్ తన పరిశోధనలను ప్రచురించిన తర్వాత వాతావరణ స్థిర విద్యుత్‌పై రెండొవ అధ్యయనాన్ని రూపొందించింది. మొత్తంగా ఆమె రెండు భౌతిక శాస్త్ర అధ్యయనాలను ప్రచురించిన మొదటి మహిళ. వాటిపై జరిగిన చర్చలే తదుపరి ప్రయోగాలకు దారితీశాయి. ఆ తర్వాత దాన్నే ఇప్పుడు మనం 'గ్రీన్ హౌస్ ఎఫెక్ట్‌గా' పిలుస్తున్నాం. ఆమె వేసిన పునాది వల్లే ప్రపంచవ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలు వాతావరణ శాస్త్రాన్ని అభివృద్ధి చేసేందుకు కారణమైంది. అంతేగాదు గ్రీన్హౌస్ ప్రభావాన్ని, గ్లోబల్ వార్మింగ్ దాని ప్రభావం గురించి అధ్యయనం చేసిన తొలి మహిళగా అమెరికన్ శాస్త్రవేత్త ఫుట్ నిలిచింది. నిజానికి ఫుట్ 1819లో కనెక్టికట్‌లో జన్మించింది. ఆమె ట్రాయ ఫిమేల్ సెమినరీ అనే పాఠశాలలో చదువుకున్నారు. ఇది విద్యార్థులను సైన్స్ తరగతులకు హాజరయ్యేలా చేయడమే గాక కెమిస్ట్రీ ల్యాబ్‌లోని ప్రయోగాల్లో పాల్గొనేలా ప్రోత్సహించేది. ఇక్కడ నుంచి ఫుట్కి సైన్స్‌పై మక్కువ ఏర్పడింది. అంతేగాదు ఫుట్ ఇలా పరిశోధనలు చేస్తూనే మహిళా హక్కుల ప్రచారానికి కూడా సమయం కేటాయించింది. ఫుట్ 19848లో సెనెకా ఫాల్స్‌లో జరిగిన మొదటి మహిళా హక్కుల సమావేశానికి హాజరయ్యి డిక్లరేషన్ ఆఫ్ సెంటిమెంట్స్‌పై సంతకం చేసింది. ఇది సామాజికంగా చట్టపరమైన హోదాలో మహిళలకు సమానత్వాన్ని కోరే పత్రం. ఐతే గొప్ప శాస్త్రవేత్త అయిన ఫుట్ 1888లో మరణించడంతో ఒక శతాబ్దానికి పైగా ఫుట్ విజయాలను గుర్తింపు లభించలేదు. ఈ నేపథ్యంలోనే గూగుల్ ఆమెకి నివాళులర్పిస్తూ సోమవారం ఈ డూడుల్‌ని రూపొందించింది. అది ఆమె సాధించిన విజయాలను తెలిపేలా గ్రీన్హౌస్ ప్రభావాన్ని కూడా వివరిస్తోంది. (చదవండి: ఈ వర్షాకాలంలో ఈ పండ్లు తీసుకుంటే..ఇమ్యూనిటీ ఫుల్) -
లెజెండరి సింగర్ వాణీ జయరాంకు అమూల్ ఘన నివాళి
లెజెండరి సింగర్ వాణీ జయరాం శనివారం(ఫిబ్రవరి 4న) హఠాన్మరణం చెందిన సంగతి తెలిసిందే. చెన్నైలోని తన నివాసంలో ఆమె తుదిశ్వాస విడిచారు. ఆదివారం ఆమె ప్రభుత్వ లాంఛనాల మధ్య అంత్యక్రియలు ముగిశాయి. ఇక ఆమె మృతితో భారత చలన చిత్ర పరిశ్రమ విషాదంలోకి వెళ్లింది. 5 దశాబ్దాలుగా 14 భాషల్లో తన గాత్రాన్ని అందించారు వాణీ జయరాం. ఇక ఆమె మృతితో భారత చలన చిత్ర పరిశ్రమ విషాదంలోకి వెళ్లింది. తెలగు, తమిళం, కన్నడ, హిందీ, మళయాల చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు సినీ ప్రముఖులు ఆమె ఆత్మకు శాంతి చేకూరాలంటూ సోషల్ మీడియా వేదికగా సంతాపం ప్రకటించారు. చదవండి: వచ్చే వారమే ప్రభాస్-కృతి సనన్ నిశ్చితార్థం? ట్వీట్ వైరల్ అలాగే ఆమె మృతికి ప్రముఖ డెయిరీ బ్రాండ్ అమూల్ ఇండియా వినూత్నంగా నివాళులు తెలిపింది. ఆమెకు ప్రత్యేకంగా డూడుల్‌తో సంతాపం తెలిపింది. వాణీ జయరాం పాట పాడుతున్న ఫొటోను డూడుల్‌లో డిజైన్ చేసి ఘన నివాళి అర్పించింది అమూల్. దీనిని తన అధికారిక ట్విటర్లో షేర్ చేస్తూ.. ‘ప్రతి రాగంలో ఆమె కవిత వికసించింది. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలి. రిప్ వాణీ జయరాం’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఈ ప్రస్తుతం అమూల్ ట్వీట్ నెటిజన్లను బాగా ఆకట్టుకుంది. బ్లాక్ అండ్ వైట్‌లో ఉన్న ఆమె డూడుల్ ఫొటో అభిమానులను బాగా ఆకట్టుకుంది. ఈ పోస్ట్ చేసిన కొన్ని గంటల్లోనే 37వేలకు పైగా వ్యూస్, వందల్లో లైక్స్ వచ్చాయి. చదవండి: ఆయన మరణం తర్వాత నన్ను ఏ సంఘటన కదిలించడం లేదు: సునీత #Amul Topical: Tribute to legendary playback singer of South Indian cinema pic.twitter.com/jSuzQfndkz — Amul.coop (@Amul_Coop) February 5, 2023 -
వెరీ గుడ్ డూడులర్స్
రోజూ గూగుల్‌లో ఆకట్టుకునే డూడుల్స్ చూస్తుంటాం. అయితే యూత్‌కు అవి ‘ఆహా’లు మాత్రమే కాదు అనేక రకాలుగా ఇన్స్పిరేషన్లు. డూడులింగ్లో తమదైన శైలిని సృష్టించుకుంటున్నారు. విశేషం ఏమిటంటే డూడులింగ్ అనేది వారి దృష్టిలో కళాప్రక్రియ మాత్రమే కాదు. ధ్యానం కూడా! ఏదో ఒక అవసరానికి యూత్ వేళ్లు గూగుల్‌పైన ఉంటూనే ఉంటాయి. ఈ క్రమంలోనే వారిని ‘డూడుల్స్’ కట్టిపారేసాయి. క్రియేటివిటీని తట్టి లేపాయి. కోల్‌కతాకు చెందిన శ్రేయ కుందు రోజువారి జీవితానికి సంబంధించిన సంఘటనల్లో నుంచి డూడుల్స్ రూపొందిస్తుంటుంది. ‘శ్రేయాడూడుల్స్’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఎకౌంట్ ఓపెన్ చేసింది. ఇప్పుడు శ్రేయాకు వందల సంఖ్యలో ఫాలోవర్స్ ఉన్నారు. ‘ఊహించని ఆదరణ ఇది’ అంటుంది శ్రేయ. ఫన్నీ బ్లాగ్స్, పుస్తకాలు చదవడం, సిట్కామ్లు వీక్షించడం అంటే ఇష్టపడే శ్రేయ భవిష్యత్ లక్ష్యం... డూడులర్గా అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకోవడం. భోపాల్‌కు చెందిన తేజస్విని కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్. ఎప్పటికప్పుడు గూగుల్ డూడుల్స్ ఫాలో కావడం అంటే ఎంత ఇష్టమో, తనదైన శైలిలో గీయడం అంటే కూడా అంతే ఇష్టం. ‘సరదాగా పరిచయం అయిన డూడుల్ ఇప్పుడు నన్ను నేను సరిచేసుకోవడానికి ఉపకరిస్తుంది. టెన్షన్‌గా అనిపించినప్పుడు, నిరుత్సాహంలో ఉన్నప్పుడు, పరీక్షల సమయంలో ఒత్తిడిగా అనిపించినప్పుడు డూడుల్స్ గీస్తుంటాను. ఎంతో రిలాక్స్డ్గా అనిపిస్తుంది’ అంటుంది తేజస్విని. సామాజిక మాధ్యమాల్లో పాపులర్ అయిన కొందరు డూడులర్స్ గురించి... సాధ్య తన డూడులింగ్ స్కిల్స్‌తో నెటిజనులను ఆకట్టుకుంది. వాటర్ కలర్స్, కాలిగ్రఫీ తన ప్రత్యేకత. ‘కాలిగ్రఫీలో డూడుల్స్‌ను చూడడం కొత్తగా, ఆకర్షణీయంగా ఉంది’ అంటూ ఆమెపై ప్రశంసల వర్షం కురిసింది. భావోద్వేగాలు, ఇన్స్పైరింగ్ పాయింట్స్‌ను ఆధారంగా చేసుకొని డూడుల్స్ గీస్తుంటుంది సాధ్య. ఆహా అనిపించడానికే కాదు ఆలోచింపజేయడానికి కూడా డూడుల్ ఉపయోగపడాలి అనేది ఆమె అభిప్రాయం. ‘వెన్ లైన్స్ మెట్ సర్కిల్స్’ అంటున్న సంజమ్ బగ్గా డూడుల్స్కు ఎంతోమంది అభిమానులు ఉన్నారు. తన ప్యాషన్‌ను బిజినెస్ వెంచర్‌గా మార్చి విజయం సాధిస్తుంది సంజమ్. అనఘ దండేకర్ డూడుల్స్కు ప్రత్యేక ఆకర్షణ ఫ్యాన్సీ ఫాంట్స్, కలర్స్. ‘సబ్జెక్ట్‌తో పాటు ఫామ్ కూడా బాగుండాలి’ అనేది ఆమె థియరీ. అబ్స్ట్రాక్ట్ ఫామ్‌ను, డూడుల్‌కు జోడించి ‘డూడుల్ డబ్బా’ పేరుతో తన ప్రత్యేకతను చాటుకుంటుంది ఖుష్బు. ఫైన్ ఆర్ట్స్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చిన టాంజిల సామాజిక సందేశానికి డూడుల్ ను వాహికగా చేసుకుంది. తన దృష్టిలో డూడులింగ్ అనేది ఆర్ట్ ఫామ్ మాత్రమే కాదు అంతకంటే ఎక్కువ. డూడులింగ్ తనకు ధ్యానం లాంటిది. చిత్ర అయ్యర్‌కు బాల్యం నుంచి చిత్రకళతో అనుబంధం ఉంది. కాస్త ఆలస్యంగానే ‘డూడుల్ మేకింగ్’లోకి వచ్చింది. ‘గడ్డు కాలంలో నాకు డూడులింగ్ ఎంతగానో ఉపయోగపడింది. ఒకానొక దశలో డిప్రెషన్ బారినపడ్డప్పుడు అందులో నుంచి బయటికి రావడానికి బలమైన శక్తిని ఇచ్చింది’ అంటుంది చిత్ర. ఆసక్తి నుంచి సరదాగా మొదలైన డూడులింగ్ ఇప్పుడు అనేక రూపాల్లో యూత్‌కు దర్శనమవుతుంది. ఎన్నో రకాలుగా ఉపయోగపడుతూ మరింత దగ్గరవుతుంది. ఆత్మీయనేస్తం అవుతుంది. -
డూడులమ్మలు...
మొదట ఏమిటోగానీ ఇప్పుడు ‘డూడుల్’ అనేది పక్కింటి అబ్బాయి పేరు విన్నంత సహజమైపోయింది. నిఘంటువు అర్థం ప్రకారం ‘డూడుల్’ అంటే వోన్లీ వన్ వే... అదే ఫన్ వే! కొందరు మహిళా ఇలస్ట్రేటర్లు ఆ దారి తప్పకుండా, ఒకవైపు వినోదం పంచుతూనే మరోవైపు సామాజికస్పృహకు ప్రాధాన్యత ఇస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లాంటి సామాజిక మాధ్యమాల్లో తమదైన గుర్తింపు తెచ్చుకుంటున్నారు. నేహాశర్మ’(దిల్లీ) ‘నేహా డూడుల్స్’ పేరుతో ఎంతో మందిని ఆకట్టుకుంటోంది. ‘స్త్రీ సాధికారత’ను ప్రధాన వస్తువుగా తీసుకొని ఆమె డూడుల్స్ రూపొందిస్తుంటుంది. తన కళాత్మక అంశం చాలామందికి రియాలిటీచెక్లా ఉపయోగపడుతుంది. ‘డూడుల్స్‌లో ఉమెన్ ఎంపవర్మెంట్ ఎందుకు? హాయిగా నవ్వించవచ్చు కదా! అనుకుంటారు చాలామంది. అయితే సామాజిక విషయాలను డూడుల్స్‌గా ఎంచుకున్నంత మాత్రాన సీరియస్‌గానే చెప్పాలనే రూల్ ఏమీ లేదు కాదా! సున్నితంగా నవ్విస్తూనే విషయాన్ని సూటిగా చెప్పవచ్చు అని చెప్పడానికి ‘నేహా డూడుల్స్’ ఉదాహరణగా నిలుస్తాయి’ అని చెబుతుంది నేహాశర్మ చిరకాల ఫాలోవర్ రమ్య. సలోని పటేల్ (కోల్‌కతా) రూపొందిస్తున్న డూడుల్స్ చూస్తే ఎవరికైనా అర్థమయ్యే విషయం ఒక్కటే...‘జీవితాన్ని గ్లోబ్ మోసినంత భారంగా మోయనక్కర్లేదు. చిన్న జీవితాన్ని ప్రతిరోజూ పెద్దపండగలా జరుపుకోవచ్చు’ ‘ఎప్పుడైన మనసు బాగలేకపోతే నా దృష్టి సలోని సృష్టించే డూడుల్స్పై మళ్లుతుంది. హాయిగా నవ్వుకుంటాను. కొత్త ఉత్సాహంతో పనిచేస్తాను’ అంటుంది జాన్వీ అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఒకసారి యాదృచ్ఛికంగా ఆమె సలోని వేసిన డూడుల్స్‌ను ఇన్స్టాగ్రామ్ లో చూసింది. ఇక అప్పటి నుంచి రెగ్యులర్‌గా ఫాలో అవుతోంది. వైబ్రంట్ కలర్స్, ఇమేజరీలతో ఆకట్టుకుంటుంది దిల్లీకి చెందిన భావ్య దోషి. రోజూ వినే సాధారణ సంభాషణలే ఆమె రూపొందించే డూడుల్స్‌లో కొత్త సొగసును సంతరించుకుంటాయి. బిగ్గరగా నవ్విస్తాయి. ‘కంటెంట్ కోసం జుట్టు పీక్కోవాల్సిన పనిలేదు. మన చుట్టూ ఉన్న జీవితం నుంచే ఎంతో సృష్టించుకోవచ్చు’ అంటుంది కోల్‌కతాకు చెందిన శ్రేయా కుందు. ‘శ్రేయా రూపొందించే డూడుల్స్‌లో బొమ్మలు కనిపించవు. ఎక్కడో ఒకచోట మనకు పరిచయం ఉన్నవారు కనిపిస్తారు. అదే శ్రేయా ప్రత్యేకత’ అంటుంది శ్రేయా అభిమాని సత్య. ఇక ఆకాంక్ష కుంచె నుంచి జాలువారే డూడుల్స్ ఆకట్టుకునేలా ఉండడమే కాదు కాసేపు ఆలోచించేలా చేస్తాయి. నవ్వించడం మంచిదే. నవ్వించడం ద్వారా మంచిని చెప్పడం అందులోనూ సునిశితంగా... కళాత్మకంగా బోధించడం అంతకంటే మంచిది కదా! -
తొలి మహిళా సత్యాగ్రాహి.. సుభద్రా కీ కహానీ
స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అవుతున్న సందర్భంగా దేశం కోసం సేవ చేసిన త్యాగధనులు మరోసారి స్మరణకు వస్తున్నారు. తొలి మహిళా సత్యాగ్రాహి, జైలుకు వెళ్లిన తొలి మహిళా కాంగ్రెస్ కార్యకర్త, గొప్ప కవయిత్రి సుభద్ర కుమారి చౌహాన్‌ను ఆమె 117వ జయంతి సందర్భంగా ‘డూడుల్’తో గూగుల్ గౌరవించింది. స్ఫూర్తివంతమైన ఆమె జీవితాన్ని గుర్తుకు తెచ్చింది. ఆడపిల్లల్ని ఇప్పుడు కూడా ‘అటు వెళ్లొద్దు... అది చేయొద్దు’ అనే పెద్దలున్న రోజుల్లో దాదాపు 110 ఏళ్ల క్రితం 9 ఏళ్ల వయసులో కవిత్వం రాసింది సుభద్ర కుమారి చౌహాన్. రాయడమే కాదు... దానిని పత్రికలకు పంపింది. పంపితే అది అచ్చయ్యింది. సుభద్ర కుమారి చౌహాన్ కొన్ని పనులు చేయడానికి ఈ భూమ్మీదకు వచ్చింది. కొన్ని పనులు చేసి తరలి వెళ్లిపోయింది. భారత స్వాతంత్రోద్యమం ఆమెను తప్పక తలచుకుంటూ ఉంటుంది. హిందీ సాహిత్య సమాజం ఆమెను తలుచుకుంటూనే ఉంటుంది. ఎందుకంటే ఆ రెండు రంగాలలో ఆమె గొప్ప ముద్రను వదిలి వెళ్లింది. తొమ్మిది మంది సంతానంలో సుభద్ర కుమారి అలహాబాద్‌లో 1904లో జన్మించింది. నలుగురు అన్నదమ్ములు, ఐదుమంది అక్కచెల్లెళ్లలో ఆమె ఒకతి. తండ్రి, ఇతర అన్నయ్యలు ఆడపిల్లలను ఆడపిల్లల్లానే ఉంచాలని అనుకున్నా చివరి అన్నయ్య రాజ్ బహదూర్ సింగ్ మాత్రం తన తోబుట్టువులను ముఖ్యంగా సుభద్రను ప్రోత్సహించేవాడు. ‘చేయాల్సిన అల్లరి చేయండి’ అని వాళ్లకు రక్షణ గా నిలిచేవాడు. ఆ అన్న అండతో సుభద్ర కవిత్వం రాసింది. 1913లో ఆమె రాసిన తొలి కవిత ‘నీమ్’ (వేపచెట్టు) ‘మర్యాద’ అనే పత్రిక లో అచ్చయ్యింది. ఆడపిల్లలకు చదువేంటి అనే ఆ రోజుల్లో ఆమె అలహాబాద్‌లోని ‘లేడీ సుందర్‌లాల్ హాస్టల్’లో ఉండి చదువుకుంది. ఆ సమయంలో ఎన్నో కవితలు రాసింది. అక్కడే చదువుకుంటున్న తర్వాతి రోజుల్లో ప్రఖ్యాతి చెందిన కవయిత్రి మహాదేవి వర్మతో కలిసి ఆమె కవిత్వం ఉద్యమంలా కొనసాగించింది. 1919లో కవి, పత్రికా రచయిత అయిన లక్ష్మణ్ సింగ్‌తో వివాహం జరిగినప్పుడు కట్నం ప్రస్తావన గాని, తల మీద కొంగు కప్పుకుని వధువు ముఖం దాచుకునే సంప్రదాయం కాని పాటించకుండా చాలా సరళంగా వివాహం జరుపుకుంది. ఆ రోజుల్లో ఇది పెద్ద వార్త. ఝాన్సీ కీ రాణి సుభద్ర కుమారి చౌహాన్ కవితలు దేశభక్తిని కలిగించేలా ఉండేవి. బ్రిటిష్ వారిని పారదోలేందుకు ఝాన్సీ లక్ష్మిని స్ఫూర్తిగా తీసుకోమని సుభద్ర రాసిన ‘ఝాన్సీ కీ రాణి’ ఉత్తర భారతదేశంలో ప్రతి విద్యార్థి నేటికీ ఏదో ఒక తరగతిలో చదువుతూనే ఉంటాడు. ‘ఝాన్సీ కీ రాణి’ కవిత వేదిక మీద వేలసార్లు చదవబడింది. 1919లో రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా జలియన్‌వాలాబాగ్‌లో మీటింగ్ జరుగుతుంటే డయ్యర్ చేసిన ఘాతుకానికి సుభద్ర కదిలిపోయింది. ‘జలియన్‌వాలాబాగ్‌లో వసంతం’ పేర ఒక కవిత రాసింది. అంతే కాదు ఆ మరుసటి సంవత్సరమే భర్తతో కలిసి పూర్తిస్థాయి కాంగ్రెస్ కార్యకర్తగా మారిపోయింది. తొలి మహిళా సత్యాగ్రాహి సుభద్ర ఇప్పుడు భర్తతో కలిసి జబల్పూర్ (మధ్యప్రదేశ్)ను తన కార్యక్షేత్రం చేసుకుంది. భర్త పత్రిక నడుపుతుంటే సుభద్ర సైకిల్ మీద రోజూ 14 కిలోమీటర్లు తిరుగుతూ ప్రజలకు స్వాతంత్రోద్యమ అవసరం తెలియచేసేది. అంటరానితనంకు వ్యతిరేకంగా ప్రచారం చేసేది. 1922లో ‘జెండా సత్యాగ్రహం’ జబల్పూర్లో ఉధృతంగా జరిగింది. ప్రయివేటు, పబ్లిక్ స్థలాల్లో దేశ జెండాను ఎగురవేయడం ఆ కార్యక్రమం. ఆ సమయంలో ఆ కార్యక్రమంలో పాల్గొన్న తొలి ధీర మహిళగా సుభద్ర కుమారి చౌహాన్ చరిత్రకెక్కింది. ఆ తర్వాత ఆమె ఉపన్యాసాలకు జనం విరగపడసాగారు. ఆమె తన ఉపన్యాసాల మధ్య ‘ఝాన్సీ కీ రాణి’ కవితను ఉత్తేజపూర్వకంగా చదువుతూ ఉందని బ్రిటిష్ ప్రభుత్వం ఆ కవితను నిషేధించింది. అంతే కాదు.. 1923లో నాగపూర్‌లో జెండా సత్యాగ్రహంలో పాల్గొనడానికి వెళ్లిన సుభద్రను అరెస్టు చేసి జైల్లో పెట్టింది. దేశంలో అలా అరెస్ట్ అయిన తొలి మహిళా సత్యాగ్రాహి ఆమె. జైల్లో ఉండి ఆమె కవిత్వం రాసింది. ‘లాంతరులో చమురు లేదు. అది ప్రాణం విడిచేలోపు నాలుగు పంక్తులు రాసుకుంటాను’ అని రాసిందామె. చిన్న వయసులో మరణం సుభద్ర కుమారికి ఒక కూతురు పుట్టింది. ఆ కూతురిలో తన బాల్యం చూసుకుంటూ ఆమె అద్భుతమైన కవిత్వం రాసింది. స్వాతంత్య్రం సిద్ధించాక ఆమె ఇంకా ఉత్సాహంగా పని చేస్తూ నాగ్‌పూర్‌లో ఒక ఉపన్యాసం ఇచ్చి జబల్పూర్కు తిరిగి వస్తుండగా 1948లో కారు యాక్సిడెంట్ లో మరణించింది. అప్పటికి ఆమె వయసు 43 సంవత్సరాలు. సుభద్ర కుమారి చౌహాన్ పేరిట ఎన్నో సాహిత్య పురస్కారాలు ఉన్నాయి. ఒక కోస్ట్‌గార్డ్ నౌకకు ఆమె పేరు పెట్టారు. జబల్పూర్లో ప్రభుత్వం ఆమె విగ్రహం పెట్టింది. ప్రస్తుతం అమృతోత్సవాల సందర్భంగా ఆమె 117వ జయంతి రావడంతో గూగుల్ ఆమె స్మరణగా డూడుల్ చేసి గౌరవాన్ని ప్రకటించింది. ‘ఆమె స్ఫూర్తి గొప్పది’ అని గూగుల్ వ్యాఖ్యానించింది. -
రిపబ్లిక్ డేపై గూగుల్ స్పెషల్ డూడుల్
సాక్షి, న్యూఢిల్లీ : భారత 71వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రత్యేక డూడుల్‌తో గూగుల్ తనదైనశైలిలో శుభాకాంక్షలు తెలిపింది. దేశంలోని విభిన్న సంస్కృతులు, సంప్రదాయాలు ఉట్టిపడేలా దీనిని తీర్చిదిద్దింది. ఈ ప్రత్యేక డూడుల్‌ను సింగపూర్‌కు చెందిన మెరో సేథ్ అనే కళాకారుడు రూపుదిద్దారు.అందులో ప్రఖ్యాత ప్రదేశాలను, తాజ్‌మహల్,ఇండియా గేట్, కూడా ప్రతిబింబించేలా తయారు చేశారు. ఇంకా భారత దేశానికి చెందిన శాస్త్రీయ సంగీతం, కళలు, మన జాతీయ పక్షి.. దేశంలోని వస్త్ర పరిశ్రమను కూడా చిత్రంలో చేర్చుతూ.. ప్రత్యేక డూడుల్‌ను ఏర్పాటు చేశారు. ఈ ప్రత్యేక డూడుల్ అందర్నీ ఆకట్టుకుంటుంది. -
డూడుల్ గీయండి... లక్షలు పట్టండి
న్యూఢిల్లీ: విద్యార్థులూ.. మీరు చక్కగా బొమ్మలు వేయగలరా? అయితే గూగుల్ ఓ కొత్త ఆఫర్‌తో మీ ముందుకు వచ్చింది. మీరంతా గూగుల్ వెబ్సైట్ తెరవగానే గూగుల్ లోగోపైన డూడుల్ చూసే ఉంటారు. ఏ రోజు ప్రాముఖ్యతను ఆ రోజు చిన్న కార్టూన్ రూపంలో అది సూచిస్తుంది. ఇప్పుడు మీరు గీయబోయే చిత్రం ఆ డూడుల్ స్థానంలో కనిపించనుంది. నవంబర్ 14న ‘బాలల దినోత్సవాన్ని’ పురస్కరించుకొని ప్రత్యేకంగా తయారు చేయనున్న డూడుల్‌కు కార్టూన్లు వేయాల్సిందిగా గూగుల్ కోరుతోంది. ఇది కేవలం మీ డూడుల్ కనిపించేలా చేయడమే కాదండోయ్.. అయిదు లక్షల క్యాష్‌ను కూడా మోసుకొస్తుంది. ‘నేను పెద్దయ్యే సరికి.. నేనేం ఆశిస్తున్నానంటే’ అన్న అంశం మీద డూడుల్‌ను తయారు చేయాల్సి ఉంటుంది. ఈ అంశం కింద, మీకు ఉన్న ఏ ఆలోచనకైనా రూపం ఇవ్వచ్చు. ఉదాహరణకు చంద్రుడి మీద జీవితం ఎలా ఉంటుంది? భూమ్మీద కాలుష్యం లేకపోతే ఎలా ఉంటుంది? భూమి అంతా సాధు జంతువులతో నిండిపోతే ఎలా ఉంటుంది ? వంటి ఏ అంశం మీదైనా డూడుల్ తయారు చేయవచ్చు.డూడుల్‌లో కచ్చితంగా ‘జీఓఓజీఎల్ఈ’ అన్న గూగుల్ స్పెల్లింగ్ ఉండాలి. ఎంపిక ఇలా...: మొదట మీరు గీసిన చిత్రాలన్నింటినీ గూగుల్ బృందం ఎంపిక చేస్తుంది. ఈ బృందంలో బాగా డూడుల్స్ తయారుచేసే నేహా డూడుల్స్ మేడం, యూట్యూబ్‌లో టాలెంట్ చూపించే ప్రజక్త కోళి, మనందరికీ ఇష్టమైన ఛోటా భీమ్ బొమ్మ గీసిన రాజివ్ చికాల కూడా ఉన్నారు. వీరంతా మేటిగా ఉన్న 20 చిత్రాలను ఎంపిక చేస్తారు. వీటిని అక్టోబర్ 21 నుంచి నవంబర్ 6 వరకు పబ్లిక్ ఓటింగ్‌లో ఉంచుతారు. గెలిచిన వారికి 5 లక్షల స్కాలర్‌షిప్‌తో పాటు రూ. 2 లక్షల విలువైన సాంకేతికతను మీ పాఠశాలకు ఇస్తారు. -
స్టీవ్ ఇర్విన్‌కు గూగుల్ నివాళి
ఒడుపుగా మొసళ్లను పడుతూ..ఎంతటి విషసర్పాలనైనా అలవోకగా మాలిమి చేసుకుని వాటితో చెలిమి చేసే నేర్పరి, ప్రముఖ పర్యావరణవేత్త దివంగత స్టీవ్ ఇర్విన్‌పై గూగుల్ తన గౌరవాన్ని చాటుకుంది. 'ది క్రోకోడైల్ హంటర్' గా గుర్తింపు తెచ్చుకున్న స్టీవ్ ఇర్విన్ 57వ జన్మదిన వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని (ఫిబ్రవరి 22) ప్రత్యేక డూడుల్‌ని రూపొందించింది. నాట్జియో, యానిమల్ ప్లానెట్, డిస్కవరీ ఇలా అనేక చానెళ్ల ద్వారా వన్యప్రాణుల్ని పరిచయం చేసిన స్టీవ్ ఇర్విన్ చాలా దురదృష్టకరమైన పరిస్థితిలో కన్నుమూయడం పర్యావరణ ప్రేమికులను విషాదంలో ముంచింది. 2006లో ఓ అరుదైన ఫుటేజ్ కోసం సముద్రంలోని మంటా రేలపై ఒక డాక్యుమెంటరీ తీస్తుండగా ప్రమాదవశాత్తు దాని ముల్లు గుండెల్లోకి దిగడంతో స్టీవ్ ప్రాణాలు కోల్పోయారు. అయితే స్టీవ్ భార్య టెర్రీ ఇర్విన్, పిల్లలు రాబర్ట్ ఇర్విన్, బిందీ ఇర్విన్తండ్రి అడుగుజాడల్లో నడుస్తున్నారు.తండ్రి ప్రారంభించిన వన్యప్రాణి సంరక్షణ కేంద్రం బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. ఈక్రమంలో జంతు ప్రపంచాన్ని ఛాయాచిత్రాల్లో బంధిస్తూ కుమారుడు రాబర్ట్ తన ప్రత్యేకతను చాటుకుంటున్న సంగతి తెలిసిందే. మరోవైపు ఇర్విన్ సేవలకు గుర్తింపుగా ఫిబ్రవరి 22న ఆస్ట్రేలియాలో జాతీయ వన్యప్రాణుల దినంగా కూడా పాటించడం విశేషం. -
గూగుల్ ‘గ్రహాంతర’ డూడుల్
న్యూఢిల్లీ: భూమికి ఆవల ప్రాణికోటి ఉందా? ఉంటే ఆ గ్రహాంతరవాసులు మనకన్నా బలమైన, తెలివైనవారా? వంటి రహస్యాల్ని తెలుసుకోవాలనే జిజ్ఞాసతో శాస్త్రవేత్తలు 1974లో మనిషి ఆనవాళ్లతో ఓ మెసేజ్‌ను శూన్యంలోకి పంపారు. ఈ మెసేజ్‌ను ప్యుర్టొరికోలోని అరిసిబో అబ్జర్వేటరీ నుంచి రేడియో టెలిస్కోప్ సాయంతో ఫ్రీక్వెన్సీ రేడియో తరంగాల ద్వారా పంపించారు. ఇది జరిగి శుక్రవారం నాటికి సరిగ్గా 44 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆ మెసేజ్‌లో ఒక భాగమైన ‘హ్యూమానిటీ’ చిత్రాన్ని సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్ తన డూడుల్‌గా పెట్టింది. 3 నిమిషాల నిడివిగల అరిసిబో మెసెజ్‌లో 1 నుంచి 10 అంకెలు, పలు మూలకాల పరమాణు సంఖ్యలు, మనిషి డీఎన్ఏ, మనిషి రూపం (హ్యూమానిటీ), టెలిస్కోప్ వంటి చిత్రాలతో7 భాగాలున్నాయి. ఈ సమాచారమంతా డిజిటల్(1,0) రూపంలో ఉంటుంది. హ్యూమానిటీ చిత్రంలో మధ్య భాగం మానవుడి రూపం, ఎడమవైపున్న చిత్రం సగటు యుక్త వయసు పురుషుడి ఎత్తు (5.94 అడుగులు), కుడివైపున్న ఆకారం 1974లో భూమిపై ఉన్న జనాభా(430కోట్లు)ను సూచిస్తుంది. గమ్యం దిశగా ఇప్పటికి ఈ మెసేజ్ 259 ట్రిలియన్ మైళ్లు ప్రయాణించింది. -
నేటి డూడుల్ ఏంటో తెలుసా?
ప్రఖ్యాత గూగుల్ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ది పొందిన వ్యక్తులను డూడుల్రూపంలో లోగోను తయారుచేసి వారిని గౌరవిస్తుంది. వారి పుట్టిన రోజున వీటిని ఆ ఒక్కరోజు డూడుల్‌గా గూగుల్‌లో దర్శనమిస్తుంది. ఈ రోజు(జనవరి 22)న ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన సెర్గీ ఐజిన్స్టైన్పై డూడుల్ చిత్రించి గౌరవించింది. నేడు ఆయన 120వ పుట్టిన రోజు. చిత్రరంగంలో ఫిల్మ్‌లతో సినిమాలను చిత్రీకరించడం ఈయనతోనే ప్రారంభమైంది. ఈయనను ఫాదర్ ఆఫ్ మోంటేజ్ టెక్నిక్ ఇన్ ఫిల్మ్‌మేకింగ్ అంటారు. అందుకే ఈయనను ఫిల్మ్‌లతో కూడిన లోగోను ఏర్పాటుచేసి డూడుల్‌గా పెట్టారు. ఫిల్మ్‌లతో కూడిన గూగుల్ అనే అక్షరాల నడుమ సెర్గీ ఈ రోజు మనకు దర్శనమిస్తాడు. మాంటేజ్ టెక్నిక్ అంటే...ఎడిటింగ్‌లో ఒక ప్రక్రియ. చిన్న చిన్న షాట్స్‌ను సమయానికి, స్పేస్, విషయానికి అనుగుణంగా ఉండేలా కుదించడం. ఈయన 1898 రిగాలో (ఇప్పటి లాత్వియాలో) జన్మించారు. ఆయన ఆర్కిటెక్చర్, ఇంజనీరింగ్ విద్యనభ్యసించారు. బోల్షివిక్ విప్లవంలో కూడా పాల్గొన్నారు. తరువాత ఆయనకు సినిమాలపై ఇష్టమేర్పడి మాస్కోకు వెళ్లాడు. ఈయన మొదటి సినిమా స్ట్రైక్ 1925లో విడుదలైంది. రష్యాలోని కార్మికులు ఫ్యాక్టరీ ముందు చేస్తున్న ధర్నా నేపథ్యంలో చిత్రీకరించాడు. ఇది ఒక సైలెంట్(మూకీ)సినిమా. అదే సంవత్సరంలో బాటిల్షిప్ పొటెమ్కిన్ అనే మరో చిత్రాన్ని విడుదలచేశాడు. రష్యా సైనికులు అమాయకపు పౌరులను హతమార్చిన సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తీశాడు. 1928లో అక్టోబర్ అనే సినిమాను విడుదలచేశాడు. 1917 అక్టోబర్ విప్లవం, రష్యా నియంతృత్వ పాలన ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమాపై అప్పటి పాలకులు కన్నెర్ర చేశారు. అయినా కానీ ఐజిన్స్టైన్ వెనక్కితగ్గకుండా ఇంకా ఎన్నో మరుపు రాని చిత్రాలను తీశారు. అలెగ్జాండర్ నెవస్కీ, ఇవాన్ ది టెర్రిబుల్ లాంటి సినిమాలెన్నో తీసి...1948లో గుండెనొప్పితో మరణించారు. -
గాలిబ్‌ను గుర్తు చేసిన గూగుల్
న్యూఢిల్లీ: ఉర్దూ రచయిత, కవి గాలిబ్(విజేత అని అర్థం)గా సుప్రసిద్ధుడైన మీర్జా అసదుల్లా బేగ్ ఖాన్ 220 జయంతి సందర్భంగా సెర్చ్ ఇంజన్ గూగుల్ ప్రత్యేక డూడుల్‌ను పెట్టింది. ఆయన యానిమేషన్ ఫొటోతో డూడుల్‌ను రూపొందించింది. బ్యాక్‌గ్రౌండ్‌లో సూర్యుడు, మసీదు నేపథ్యంతో భవనం బాల్కనీలో పేపరు, పెన్నుతో గాలిబ్ నిలబడినట్లు అందులో చూపింది. గాలిబ్ ఆగ్రాలోని కాలా మహల్లో 1797లో జన్మించారు. మొగల్ చక్రవర్తి ఆఖరు కాలంలో, భారత్‌ను బ్రిటిషర్లు ఆక్రమించుకున్న కాలంలో ఉర్దూ, పర్షియన్ భాషల్లో రచనలు సాగించి ప్రతి ఒక్కరినీ ప్రభావితం చేసిన ప్రముఖుల్లో ఒకరు. అతని గజల్స్‌కు పలు రూపాల్లో వ్యాఖ్యానాలు రాగా వివిధ వర్గాల ప్రజలు పాడుకున్నారు. గాలిబ్ తన 11వ ఏటనే కవిత్వం రాయడం మొదలుపెట్టారు. ఆయన మాతృభాష ఉర్దూ అయినప్పటికీ పర్షియన్, టర్కిష్ భాషల్లోనూ అంతేస్థాయి ప్రావీణ్యం ప్రదర్శించారు. ఆయన విద్యాభ్యాసం పర్షియన్, అరబిక్ భాషల్లో సాగింది. 1869 ఫిబ్రవరి 15న గాలిబ్ తుదిశ్వాస విడిచారు. ఆయన నివాసం గాలిబ్ స్మృతి భవన్‌గా రూపాంతరం చెందింది. నిజాముద్దీన్ ప్రాంతంలోని చౌసాత్ ఖామ్బాలో ఆయన సమాధి ఉంది. -
తొలి మహిళా ఫోటో జర్నలిస్టుకు గూగుల్ నివాళి
స్పెషల్ డూడుల్స్‌తో వివిధ విశిష్ట వ్యక్తుల ప్రాముఖ్యతను గుర్తు చేసుకునే గూగుల్ తాజాగా మరో ఆసక్తికరమైన డూడుల్‌ను తయారు చేసింది. భారతదేశంలోనే తొలి మహిళా ఫోటో జర్నలిస్టు హోమాయ్ వ్యరవాల్లకు నివాళిగా డూడుల్‌ని ప్రదర్శించింది. డిసెంబర్ 9 ఆమె 104వ జయంతి సందర్భంగా గూగుల్ డూడుల్‌తో ఆమెకు ఘన నివాళులర్పించింది. ముంబై కళాకారుడు సమీర్ కులవూర్ ఈ డూడుల్ ను రూపొందించారు. గుజరాత్ నవ్సారిలో హోమాయ్ జన్మించారు. సెయింట్ జేవియర్స్ కాలేజీలో డిప్లొమా అనంతరం ఉన్నత చదువుల కోసం ముంబై వెళ్లారు. ప్రముఖ ఫోటోగ్రాఫర్ మానెక్సా పెళ్లి చేసుకున్నారు. తన భర్త నుంచే హొమాయ్ ఫోటోగ్రఫీని నేర్చుకున్నారు. 1942 లో ఆమె బ్రిటీష్ ఇన్ఫర్మేషన్ సర్వీస్‌లో పూర్తికాల ఉద్యోగిగా చేరారు. బ్రిటీష్ కాలం నుంచి భారత్‌కు స్వాతంత్రం వచ్చేంత వరకు తను ఫోటోగ్రాఫర్‌గా దేశానికి విశిష్ట సేవలను అందించారు. ముఖ్యంగా 1947 ఆగస్ట్ 15న తొలి పతాకావిష్కరణ సందర్భంగా మహాత్మా గాంధీ, జవహర్ లాల్ నెహ్రూ లాంటి జాతీయ నాయకుల ఫోటోలు బాగా పాపులర్ అయ్యాయి. అలాగే ఇండియానుంచి లార్డ్ మౌంట్ బాటన్ నిష్క్రమణతోపాటు, మహాత్మాగాంధీ, జవహర్లాల్ నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి లాంటి మహానుభావుల అంతిమ యాత్రలను హొమాయ్ కవర్ చేశారు. క్వీన్ ఎలిజెబిత్, యూఎస్ మాజీ అధ్యక్షుడు డ్వైట్ ఐసెన్‌హోవర్ భారత్‌ను పర్యటించినప్పడు కూడా వాళ్ల ఫోటోను హొమాయే తీశారు. హొమాయ్ సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం 2011లో పద్మ విభూషణ్‌తో సత్కరించింది. సబీన్ గాడిహోక్ అనే ఆమె సన్నిహితులొకరు సాహసోపేత మహిళగా ఆమెను అభివర్ణించడం విశేషం. రెండవ ప్రపంచ యుద్ధం ఆరంభంలో ఒక ఫోటో జర్నలిస్టుగా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించిన హోమాయ్ ఇలస్ట్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియాకు పనిచేశారు. అయితే 1938లో ముంబై మహిళల క్లబ్లో మహిళల పిక్నిక్ పార్టీకోసం తీసిన ఫోటో మొదటి ఫోటో. కాగా 'బొంబాయి క్రానికల్' లో తొలి ఫోటో ప్రచురితమైంది. దీనికి ఆమె ఒక రూపాయిని పత్రిక చెల్లించింది. దాల్డా 13పేరుతో ఆమె ఫోటోలను పబ్లిష్ చేసేవారు. జనవరి 15, 2012 న 98 సంవత్సరాల వయసులో హోమాయ్ తుదిశ్వాస విడిచారు. -
మహిళ దినోత్సవ సందర్భంగా ప్రత్యేక డూడుల్
ఈ రోజు గూగుల్ డూడుల్ చూశారా.. ఓసారి లుక్కేయండి. ప్రత్యేక సందర్భాల సమయంలో డూడుల్‌లో మార్పులు చేసే ప్రముఖ సెర్చింజన్ ఓ అడుగు ముందుకు వేసి ఓ విడియోనే రూపొందించింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గూగుల్ ప్రత్యేక డూడుల్ ద్వారా మహిళలకు శుభాకాంక్షలు తెలిపింది. వివిధ దేశాలకు చెందిన మహిళలతో ఓ విడియోను రూపొందించి డూడుల్ మధ్యలో ఏర్పాటు చేశారు. -
'నాట్యమయూరికి అరుదైన నివాళి'
న్యూఢిల్లీ: లీపు సంవత్సరాన్ని పురస్కరించుకొని ప్రముఖ భరతనాట్యకారిణి రుక్మిణీ దేవీ అరుండల్కు ప్రతిష్టాత్మక సెర్చ్ ఇంజిన్ గూగూల్ ఘన నివాళి అర్పించింది. ఆమె ఫొటోని డూడుల్ చిత్రంగా పెట్టి మరోసారి భారతీయుల మనసు కొల్లగొట్టింది. రుక్మిణి తమిళనాడులోని మధురై నగరంలో 1904, ఫిబ్రవరి 29న జన్మించారు. సోమవారం ఆమె 112వ జయంతి సందర్భంగా గూగూల్ ఈ నివాళి అర్పించింది. సంప్రదాయ దుస్తుల్లో, నాట్యముద్రతో మెరిసిపోతున్న చిత్రాన్ని పెట్టింది. దీంతో పాటు పింక్ రంగు గల ట్రేడ్‌మార్క్ అక్షరాలను జతచేసింది. 1920ల్లో భరతనాట్యంపై సమాజంలో చిన్న చూపుండేది. వీటన్నింటిని అధిగమించి తనకంటూ రుక్మిణీ దేవీ నాట్య రంగంలో ప్రత్యేక స్థానం సంపాధించుకుంది. తన భర్తతో కలిసి చెన్నై సమీపంలో కళాక్షేత్ర దగ్గర డాన్స్ అకాడమీని స్థాపించారు. నాట్యరంగంలో ఈమె కృషికిగానూ కేంద్ర ప్రభుత్వం 1956లో పద్మభూషణ్‌తో సత్కరించింది. సంగీత్ నాటక్ అకాడమీ 1967లోఫెల్లోషిప్‌ను ప్రదానం చేశారు. ఆమె రాజ్యసభ సభ్యురాలిగా రెండుసార్లు ఎన్నికయ్యారు. మోరార్జీదేశాయ్1977లో ఆమెను ప్రధాని అభ్యర్థిగా నామినేట్ చేయగా రుక్మీణీదేవీ సున్నితంగా తిరస్కరించారు. రుక్మిణి 1986 ఫిబ్రవరి 24న మరణించారు. -
రిపబ్లిక్ డేపై గూగుల్ స్పెషల్ డూడుల్
న్యూఢిల్లీ: భారత 67వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రత్యేక డూడుల్‌తో గూగుల్ తనదైనశైలిలో శుభాకాంక్షలు తెలిపింది. సరిహద్దు భద్రతా దళానికి (బీఎస్ఎఫ్) చెందిన ఒంటెల దళం కవాత్తును తన సెర్చ్ పేజీలో డూడుల్‌గా ప్రచురించింది. ఢిల్లీలోని రాజ్‌పథ్‌లో జరుగుతున్న గణతంత్ర వేడుకలను తలపించేలా.. అందంగా తీర్చిదిద్దిన ఒంటెలు, వాటిపై కూర్చుని మార్షియల్ సంగీతాన్ని అందిస్తున్న బ్యాండ్‌మేళాతో కూడిన డూడుల్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఈ డూడుల్‌లోని ఆరు ఒంటెలపై కప్పిన బంగారురంగు జరీవస్త్రంపై గూగుల్ అని ఆంగ్ల అక్షరాలు ఎరుపు రంగంలో రాసి ఉన్నాయి. దేశంలో బీఎస్ఎఫ్కు మాత్రమే అందంగా తీర్చిదిద్దిన ఒంటెల దళం ఉంది. -
జార్జ్ బూలేపై గూగుల్ ప్రత్యేక డూడుల్
ప్రఖ్యాత బ్రిటన్ గణిత శాస్త్రవేత్త జార్జ్ బూలే 200 వ జయంతి సందర్భంగా ప్రముఖ సెర్చ్ ఇంజన్ గూగుల్ ప్రత్యేక డూడుల్‌ని రూపొందించింది. డూడుల్‌లో ఆల్ జీబ్రాకు సంబంధించిన అంశాలు ప్రతిబింబించేలా ఈ డూడుల్‌ను తయారు చేయడం విశేషం. బూలే గణితంలోనే కాక ఫిలాసఫి, తర్కశాస్త్రంలో విశేష కృషి చేశారు. ఆయన రూపొదించిన బూలియన్ లాజిక్‌ను ప్రస్తుత సమాచార యుగానికి పునాదిగా భావిస్తారు. ఆయన రాసిన 'ద మ్యాథమేటికల్ ఎనాలిసిస్ ఆఫ్ లాజిక్', 'ది లాస్ ఆప్ థాట్', 'ద ట్రిటీస్ ఆన్ ద కాలిక్యులస్ ఆప్ ఫినిట్ డిఫరెన్సెస్' అనే పుస్తకాలు గణిత రంగంలో ఆయన చేసిన కృషిని తెలియజేస్తాయి. బూలే సేవలకు గాను రాయల్ సొసైటీ ఆయన్ను రాయల్ మెడల్‌తో సత్కరించింది. -
గూగుల్ హోమ్ పేజీపై వైదేహిరెడ్డి ‘డూడుల్’
న్యూఢిల్లీ: అస్సాం ప్రకృతి సౌందర్యాన్ని, సుసంపన్నమైన సాంస్కృతిక వైభవాన్ని ప్రతిఫలించేలా ఆకర్షణీయంగా రూపొందిన ‘డూడుల్’,.. శుక్రవారం భారత్‌లో గూగుల్ సెర్చిఇంజన్ హోమ్ పేజీపై దర్శనమిచ్చింది.నెహ్రూ జయంతి సందర్భంగా బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ ప్రత్యేక డూడుల్‌ను ‘గూగుల్’ తన హోమ్‌పేజీపై పొందుపరిచింది. ‘ప్రాకృతిక, సాంస్కృతిక స్వర్గం- అస్సాం’ అన్న శీర్షికతో పూణె సైనిక స్కూల్‌కు చెందిన 9వ తరగతి విద్యార్థి, వైదేహి రెడ్డి రూపొందించిన ఈ ‘డూడుల్’ను గూగుల్ సంస్థ ఒక పోటీలో ఎంపిక చేసింది. డూడుల్ ఫర్ గూగుల్ (Doodle4GoogleD4G) అన్న పేరుతో నిర్వహించిన ఈ పోటీలో 50 నగరాలకు చెందిన 2,100స్కూళ్లనుంచి అందిన 10లక్షలకుపైగా ఎంట్రీలను పరిశీలించారు. చివరకు, వైదేహి అస్సాంపై రూపొందించిన ఈ డూడుల్‌ను ఎంపికచేశారు. అస్సాం వన్యజీవులను, వృక్ష సంపదను, ప్రతిఫలించేలా పులి, ఖడ్గమృగం, తేయాకు పొదలు, వెదురు చెట్లు, సంప్రదాయబద్ధమైన టోపీతో నృత్యం చేస్తున్న అస్సాం మహిళ తదితర అంశాలతో వైదేహి రెడ్డి ఈ డూడుల్‌ను చిత్రించింది. పొలిటికల్ కార్టూనిస్ట్ అజిత్ నీనన్, ఏసీకే మీడియా సేవియో సంస్థ ఆర్ట్ డెరైక్టర్ మస్కరెన్హాస్ , గూగుల్ నిపుణుల బృందంతో కూడిన న్యాయనిర్ణేతల బృందం వైదేహి ఎంట్రీని ఎంపిక చేసింది. -
గూగుల్ : చిన్నారి డూడుల్
నిన్న మీరు గూగుల్ సెర్చ్ ఇంజన్ చూసే ఉంటారు. భారతీయ మహిళకు ఆకాశమే హద్దు అనే అర్థం వచ్చేలా గీసిన గూగుల్ డూడుల్ చాలామంది మనసు దోచుకుంది. ఏ చిత్రకారుడు గీసిన బొమ్మ ఇది...అని అందరినీ ఆలోచింపజేసింది. అసలు విషయం ఏంటంటే... ఏటా గూగుల్ ఇండియా... పాఠశాల విద్యార్థులకు డూడుల్ చిత్రాల పోటీలు పెడుతుంది. అదేవిధంగా ఈ ఏడాది ‘సెలబ్రేటింగ్ ఇండియన్ ఉమెన్’ అనే థీమ్‌తో నిర్వహించిన ఈ పోటీలకు పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. దేశవ్యాప్తంగా 100 పట్టణాలలోని 1500 పాఠశాలల నుంచి లక్షా యాభైవేల ఎంట్రీలు వచ్చాయి. వాటిలో పన్నెండు డూడుల్స్‌ని అత్యుత్తమ గూగుల్ డూడుల్స్‌గా న్యాయనిర్ణేతలు ఎంపికచేశారు. వీటిలో పుణెలోని కళ్యాణినగర్ బిషప్ కో ఎడ్యుకేషన్ పాఠశాలలో పదవతరగతి చదువుతున్న గాయత్రి కేతారామన్ పంపిన డూడుల్‌కి మొదటి బహుమతి వచ్చింది. కేతారామన్ చిత్రీకరించిన ఈ ప్రత్యేక డూడుల్ బాలల దినోత్సవం సందర్భంగా నిన్న గూగుల్ సెర్చ్ ఇంజన్‌గా ప్రదర్శించారు. ఈ పోటీల్లో విజేతలుగా నిలిచిన పన్నెండు మందిని గూగుల్ ఇండియా మేనేజింగ్ డెరైక్టర్ రాజన్ ఆనందన్ న్యూఢిల్లీలో సత్కరించనున్నారు. ఒక పక్క స్కూలు పాఠాలు వింటూనే మరో పక్క గూగుల్ డూడుల్స్పై కూడా ఒక చెయ్యి వేస్తున్న ఈ హైటెక్ చిన్నారులను అభినందించాల్సిందే.