ఒడుపుగా మొసళ్లను పడుతూ..ఎంతటి విషసర్పాలనైనా అలవోకగా మాలిమి చేసుకుని వాటితో చెలిమి చేసే నేర్పరి, ప్రముఖ పర్యావరణవేత్త దివంగత స్టీవ్ ఇర్విన్‌పై గూగుల్ తన గౌరవాన్ని చాటుకుంది. 'ది క్రోకోడైల్ హంటర్' గా గుర్తింపు తెచ్చుకున్న స్టీవ్ ఇర్విన్ 57వ జన్మదిన వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని (ఫిబ్రవరి 22) ప్రత్యేక డూడుల్‌ని రూపొందించింది.
నాట్‌జియో, యానిమల్ ప్లానెట్, డిస్కవరీ ఇలా అనేక చానెళ్ల ద్వారా వన్యప్రాణుల్ని పరిచయం చేసిన స్టీవ్ ఇర్విన్ చాలా దురదృష్టకరమైన పరిస్థితిలో కన్నుమూయడం పర్యావరణ ప్రేమికులను విషాదంలో ముంచింది.
2006లో ఓ అరుదైన ఫుటేజ్ కోసం సముద్రంలోని మంటా రేలపై ఒక డాక్యుమెంటరీ తీస్తుండగా ప్రమాదవశాత్తు దాని ముల్లు గుండెల్లోకి దిగడంతో స్టీవ్ ప్రాణాలు కోల్పోయారు. అయితే స్టీవ్ భార్య టెర్రీ ఇర్విన్, పిల్లలు రాబర్ట్ ఇర్విన్, బిందీ ఇర్విన్‌తండ్రి అడుగుజాడల్లో నడుస్తున్నారు.తండ్రి ప్రారంభించిన వన్యప్రాణి సంరక్షణ కేంద్రం బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. ఈక్రమంలో జంతు ప్రపంచాన్ని ఛాయాచిత్రాల్లో బంధిస్తూ కుమారుడు రాబర్ట్ తన ప్రత్యేకతను చాటుకుంటున్న సంగతి తెలిసిందే. మరోవైపు ఇర్విన్ సేవలకు గుర్తింపుగా ఫిబ్రవరి 22న ఆస్ట్రేలియాలో జాతీయ వన్యప్రాణుల దినంగా కూడా పాటించడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment