మొదట ఏమిటోగానీ ఇప్పుడు ‘డూడుల్’ అనేది పక్కింటి అబ్బాయి పేరు విన్నంత సహజమైపోయింది. నిఘంటువు అర్థం ప్రకారం ‘డూడుల్’ అంటే వోన్లీ వన్ వే... అదే ఫన్ వే! కొందరు మహిళా ఇలస్ట్రేటర్లు ఆ దారి తప్పకుండా, ఒకవైపు వినోదం పంచుతూనే మరోవైపు సామాజికస్పృహకు ప్రాధాన్యత ఇస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లాంటి సామాజిక మాధ్యమాల్లో తమదైన గుర్తింపు తెచ్చుకుంటున్నారు.
నేహాశర్మ’(దిల్లీ)
‘నేహా డూడుల్స్’ పేరుతో ఎంతో మందిని ఆకట్టుకుంటోంది. ‘స్త్రీ సాధికారత’ను ప్రధాన వస్తువుగా తీసుకొని ఆమె డూడుల్స్ రూపొందిస్తుంటుంది. తన కళాత్మక అంశం చాలామందికి రియాలిటీచెక్‌లా ఉపయోగపడుతుంది. ‘డూడుల్స్‌లో ఉమెన్ ఎంపవర్‌మెంట్ ఎందుకు? హాయిగా నవ్వించవచ్చు కదా! అనుకుంటారు చాలామంది. అయితే సామాజిక విషయాలను డూడుల్స్‌గా ఎంచుకున్నంత మాత్రాన సీరియస్‌గానే చెప్పాలనే రూల్ ఏమీ లేదు కాదా! సున్నితంగా నవ్విస్తూనే విషయాన్ని సూటిగా చెప్పవచ్చు అని చెప్పడానికి ‘నేహా డూడుల్స్’ ఉదాహరణగా నిలుస్తాయి’ అని చెబుతుంది నేహాశర్మ చిరకాల ఫాలోవర్ రమ్య.
సలోని పటేల్ (కోల్‌కతా)
రూపొందిస్తున్న డూడుల్స్ చూస్తే ఎవరికైనా అర్థమయ్యే విషయం ఒక్కటే...‘జీవితాన్ని గ్లోబ్ మోసినంత భారంగా మోయనక్కర్లేదు. చిన్న జీవితాన్ని ప్రతిరోజూ పెద్దపండగలా జరుపుకోవచ్చు’ ‘ఎప్పుడైన మనసు బాగలేకపోతే నా దృష్టి సలోని సృష్టించే డూడుల్స్‌పై మళ్లుతుంది. హాయిగా నవ్వుకుంటాను. కొత్త ఉత్సాహంతో పనిచేస్తాను’ అంటుంది జాన్వీ అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. ఒకసారి యాదృచ్ఛికంగా ఆమె సలోని వేసిన డూడుల్స్‌ను ఇన్‌స్టాగ్రామ్ లో చూసింది. ఇక అప్పటి నుంచి రెగ్యులర్‌గా ఫాలో అవుతోంది.
వైబ్రంట్ కలర్స్, ఇమేజరీలతో ఆకట్టుకుంటుంది దిల్లీకి చెందిన భావ్య దోషి. రోజూ వినే సాధారణ సంభాషణలే ఆమె రూపొందించే డూడుల్స్‌లో కొత్త సొగసును సంతరించుకుంటాయి. బిగ్గరగా నవ్విస్తాయి. ‘కంటెంట్ కోసం జుట్టు పీక్కోవాల్సిన పనిలేదు. మన చుట్టూ ఉన్న జీవితం నుంచే ఎంతో సృష్టించుకోవచ్చు’ అంటుంది కోల్‌కతాకు చెందిన శ్రేయా కుందు.
‘శ్రేయా రూపొందించే డూడుల్స్‌లో బొమ్మలు కనిపించవు. ఎక్కడో ఒకచోట మనకు పరిచయం ఉన్నవారు కనిపిస్తారు. అదే శ్రేయా ప్రత్యేకత’ అంటుంది శ్రేయా అభిమాని సత్య. ఇక ఆకాంక్ష కుంచె నుంచి జాలువారే డూడుల్స్ ఆకట్టుకునేలా ఉండడమే కాదు కాసేపు ఆలోచించేలా చేస్తాయి. నవ్వించడం మంచిదే. నవ్వించడం ద్వారా మంచిని చెప్పడం అందులోనూ సునిశితంగా... కళాత్మకంగా బోధించడం అంతకంటే మంచిది కదా!
Comments
Please login to add a commentAdd a comment