'నాట్యమయూరికి అరుదైన నివాళి'
న్యూఢిల్లీ: లీపు సంవత్సరాన్ని పురస్కరించుకొని ప్రముఖ భరతనాట్యకారిణి రుక్మిణీ దేవీ అరుండల్కు ప్రతిష్టాత్మక సెర్చ్ ఇంజిన్ గూగూల్ ఘన నివాళి అర్పించింది. ఆమె ఫొటోని డూడుల్ చిత్రంగా పెట్టి మరోసారి భారతీయుల మనసు కొల్లగొట్టింది. రుక్మిణి తమిళనాడులోని మధురై నగరంలో 1904, ఫిబ్రవరి 29న జన్మించారు.
సోమవారం ఆమె 112వ జయంతి సందర్భంగా గూగూల్ ఈ నివాళి అర్పించింది. సంప్రదాయ దుస్తుల్లో, నాట్యముద్రతో మెరిసిపోతున్న చిత్రాన్ని పెట్టింది. దీంతో పాటు పింక్ రంగు గల ట్రేడ్‌మార్క్ అక్షరాలను జతచేసింది. 1920ల్లో భరతనాట్యంపై సమాజంలో చిన్న చూపుండేది. వీటన్నింటిని అధిగమించి తనకంటూ రుక్మిణీ దేవీ నాట్య రంగంలో ప్రత్యేక స్థానం సంపాధించుకుంది. తన భర్తతో కలిసి చెన్నై సమీపంలో కళాక్షేత్ర దగ్గర డాన్స్ అకాడమీని స్థాపించారు.
నాట్యరంగంలో ఈమె కృషికిగానూ కేంద్ర ప్రభుత్వం 1956లో పద్మభూషణ్‌తో సత్కరించింది. సంగీత్ నాటక్ అకాడమీ 1967లోఫెల్లోషిప్‌ను ప్రదానం చేశారు. ఆమె రాజ్యసభ సభ్యురాలిగా రెండుసార్లు ఎన్నికయ్యారు. మోరార్జీదేశాయ్1977లో ఆమెను ప్రధాని అభ్యర్థిగా నామినేట్ చేయగా రుక్మీణీదేవీ సున్నితంగా తిరస్కరించారు. రుక్మిణి 1986 ఫిబ్రవరి 24న మరణించారు.